APNRTS: ఏపీ నుంచి గల్ఫ్ దేశాలకు నేరుగా విమానలు నడపాలి..

- November 25, 2022 , by Maagulf
APNRTS: ఏపీ నుంచి గల్ఫ్ దేశాలకు నేరుగా విమానలు నడపాలి..

అమరావతి: ఏపీకి చెందిన ఎన్నారైలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడ్డారని, వారి కోసం విశాఖపట్నం నుంచి దుబాయ్/షార్జా,  తిరుపతి నుంచి కువైట్ రూట్లలో విమానాలను నడపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియాను ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRTS) ప్రెసిడెంట్, ఏపీ గవర్నమెంట్ ఎన్ఆర్టీ అఫైర్స్ అడ్వైజర్ వెంకట్ ఎస్.మేడపాటి అభ్యర్థించారు.ఈ మేరకు జ్యోతిరాదిత్యకు ఓ లేఖను మేడపాటి రాశారు. విశాఖపట్నం, తిరుపతి నుంచి గల్ఫ్ రిజియన్ దేశాలకు రోజువారీగా అంతర్జాతీయ విమానాలను నడపడాన్ని పరిశీలించమని లేఖలో ప్రస్తావించారు. అలాగే ఈ రూట్లలో ఆసక్తి ఉన్న ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ లను అనుమతించాలని కోరారు.

ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి తూర్పు, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారు గల్ఫ్ కంట్రీస్ లో అధికంగా ఉన్నారని లేఖలో మేడపాటి గుర్తు చేశారు.యూఏఈలోని మొత్తం 3.౫ మిలియన్ల భారతీయులలో ఏపీ నుండి అర మిలియన్ కంటే ఎక్కువ మంది NRIలు ఉన్నారన్నారు. అదేవిధంగా కువైట్‌లోని ఒక మిలియన్ భారతీయులలో 10%  మంది ఏపీ వారు ఉన్నారన్నారు.

విశాఖ నుంచి గల్ఫ్ దేశాలకు  నేరుగా విమానాలు లేకపోవడం కారణంగా యూఏఈలో నివసిస్తున్న తూర్పు , పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాగే తిరుపతి నుండి కువైట్ కు నేరుగా విమానం లేనందున రాయలసీమ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రమంత్రి దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు.ఏపీకి చెందిన ఎన్నారైలు అందరూ 7 గంటల ప్రయాణం చేసి హైదరాబాద్, చెన్నై లకు వెళ్లాల్సి వస్తుందని, దీనితో డబ్బులతోపాటు విలువైన సమయం కూడా వృథా అవుతుందన్నారు.

ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిదారుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటని, ముఖ్యంగా రొయ్యలు, చేపలు ఇతర దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో ఆక్వా ఉత్పత్తి అధికంగా ఉంటుందన్నారు. రొయ్యలు, చేపలు ప్రతిరోజూ హైదరాబాద్ నుంచి యూఏఈకి ఎగుమతి అవుతాయని, ఏపీ నుండి నేరుగా విమానాలు లేకపోవడంతో రొయ్యలు విలువైన ఒకరోజు షెల్ఫ్ జీవితాన్ని కోల్పోతున్నాయన్నారు. దీంతో ఏపీకి చెందిన ఆక్వా ఉత్పత్తిదారులు ఆర్థికంగా నష్టపోతున్నారని లేఖలో మేడపాటి పేర్కొన్నారు.

కొవిడ్-19 సమయంలో గల్ఫ్ దేశాల నుండి కొన్ని అంతర్జాతీయ విమానాలు విశాఖ, తిరుపతి విమానశ్రాయాలకు వచ్చాయని లేఖలో గుర్తుచేశారు. వైడ్ బాడీ విమానాల ల్యాండింగ్‌కు అనుగుణంగా తిరుపతిలో రన్ వే ను విస్తరించినట్లు గుర్తు చేశారు. 170 మంది ప్రయాణికులు కెపాసిటీ ఉండే ఎయిర్‌బస్ A320 విమానం విమానాశ్రయంలో దింపవచ్చని వెల్లడించారు.  ఏపీ నుంచి నేరుగా గల్ఫ్ కంట్రీస్ కు విమాన సర్వీసులను ప్రారంభించడం ద్వారా పర్యాటకం, వాణిజ్యం, ఎగుమతులు మొదలైనవి పెరుగుతాయన్నారు. అలాగే అంతర్జాతీయంగా అక్వా ఉత్పత్తుల ఎగుమతులకు మార్గం సుగమం అవుతుందని మేడపాటి లేఖలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com