ముగింపు దశలో ఫిఫా వరల్డ్ కప్

- December 16, 2022 , by Maagulf
ముగింపు దశలో ఫిఫా వరల్డ్ కప్

దోహా: ‘ఫిఫా వరల్డ్ కప్-2022’ సందర్భంగా నెల రోజులపాటు కళకళలాడిన ఆతిథ్య దేశం ఖతార్ ఇప్పుడు వెలవెలబోతుంది. నిన్నమొన్నటి వరకు కిక్కిరిసిన జనంతో సందడిగా కనిపించిన ఖతార్ ఇప్పుడు ఖాళీ అవుతోంది. దీంతో షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ వంటివన్నీ వెలవెలబోతున్నాయి. ‘ఫిఫా వరల్డ్ కప్-2022’ ఆదివారంతో ముగియబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే సెమీ ఫైనల్స్ కూడా పూర్తి కావడంతో జట్లన్నీ తమ దేశాలకు తిరుగు పయనమయ్యాయి. ఆయా దేశాల అభిమానులు కూడా వెనుదిరిగారు. ఆదివారం నాటి ఫైనల్ కోసం కొద్ది మంది మాత్రమే ఖతార్‌లో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఖతార్ ఖాళీగా దర్శనమిస్తోంది. ఈ టోర్నీ కోసం ఖతార్ పన్నెండేళ్ల నుంచి ఏర్పాట్లు ప్రారంభించింది. దీని కోసం 300 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇంత చిన్న దేశం అంత డబ్బు ఖర్చు పెట్టడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ, ఖతార్ వెనకుంజ వేయలేదు. భారీ స్టేడియాలు, హోటల్స్ వంటి నిర్మాణాలు చేపట్టి, టోర్నీని విజయవంతంగా నిర్వహించింది. అనేక రకాలుగా ఈ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు సొంతం చేసుకుంది. టీవీలో అత్యధిక మంది వీక్షించారు. బ్రాండింగ్ భారీగా జరిగింది.

అయితే, ఇవన్నీ ఖతార్‌కు ఏ మేరకు లబ్ధి చేకూర్చాయి అనేదే అసలు సందేహం. ఈ టోర్నీ కోసం ఖతార్‌కు ఏడు లక్షల మంది వచ్చినట్లు అంచనా. టోర్నీ ముగియడంతో వీళ్లంతా ఇప్పుడు ఖతార్ వీడుతున్నారు. మరోవైపు అక్కడ పనుల కోసం వచ్చిన వలస కూలీలు కూడా దేశం విడిచి వెళ్లే పరిస్థితి. ఎందుకంటే మొన్నటి వరకు ఈ టోర్నీ కోసం చేపట్టిన నిర్మాణాల వల్ల పనులు దొరికేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో కూలీలు కూడా వెళ్తున్నారు. అయితే, ఇప్పుడు టూరిస్టులు, కూలీల కోసం నిర్మించిన అపార్టుమెంట్లు, హోటళ్లు, గెస్ట్ రూములు అన్నీ ఖాళీ అవుతున్నాయి. టోర్నీ కోసం కట్టిన కొన్ని స్టేడియంలను తిరిగి వాడే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో అక్కడి అపార్టుమెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. అలాగే భవిష్యత్తులో కూడా అక్కడ రద్దీ పెరిగే అవకాశం కనిపించడం లేదు.

దీంతో అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ టోర్నీ కోసం నిర్మించిన కట్టడాలను ఇతర అవసరాల కోసం వాడేందుకు ఖతార్ సిద్ధమవుతోంది. కొన్ని స్టేడియాలను చిన్న స్టేడియాలుగా మార్చి, ఇతర టోర్నీలు నిర్వహించడం, థీమ్ పార్కులుగా మార్చడం వంటివి చేయాలనుకుంటోంది. ఏదైమైనప్పటికీ ఫిఫా వరల్డ్ కప్ వల్ల ఖతార్ లబ్ధి పొందిందా లేదా తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com