‘అవతార్ 2’ తెలుగు రివ్యూ.!

- December 16, 2022 , by Maagulf
‘అవతార్ 2’ తెలుగు రివ్యూ.!

‘అవతార్ 2 - ది వే ఆఫ్ వాటర్’ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి క్రియేట్ చేసిన సినిమా ఎట్టకేలకు ఈ రోజు అనగా డిశంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2009 లో రిలీజైన ‘అవతార్’ కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం విజువల్ వండర్ అంటూ ప్రమోషన్లు గట్టిగా నిర్వహించారు. 
ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ‘అవతార్ 2’ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇక, తెలుగు విషయానికి వస్తే, అసలే ఇలాంటి విజువల్ అద్భుతాలకు మనోళ్లు దాసోహం అంటుంటారు. అందుకే ‘అవతార్ 2’ పట్ల కూడా అంతే ఆకర్షితులయ్యారు తెలుగు సినీ జనం. జేమ్స్ కేమెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అద్భుత విజువల్ సృష్టి ఎలా వుందీ, ప్రేక్షకుల అంచనాల్ని అందుకుందా.? లేదా.? అని తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
అవతార్ 2 గురించి చెప్పాలంటే, ఒకసారి అవతార్ మొదటి పార్ట్ గుర్తు చేసుకోవాలి. అవతార్ మొదటి పార్ట్‌లో భూగ్రహం నుంచి పండోరా గ్రహానికి వెళ్లిన కాళ్లు లేని యువకుడు జేక్, అక్కడి తెగ మంచితనానికి ముగ్ఢుడవుతాడు. అక్కడి అద్భుతమైన వృక్ష సంపదలో తెలియని ఔషధ రహస్యాలు దాగున్నాయని తెలుసుకున్న కొందరు భూగ్రహం మనుషులు అక్కడి తెగని నాశనం చేసి, ఆ గ్రహాన్ని చేజిక్కించుకోవాలనుకుంటారు.
అక్కడి తెగ నాయకుడి కూతురు నేత్రితో ప్రేమలో పడతాడు జేక్. వారిని కాపాడేందుకు మనుషులతోనే పోరాడతాడు. ఆ పోరాటంలో చివరికి నేత్రి మనసును గెలిచి ఆమెకు భర్తగా, ఆ తెగకు నాయకుడిగా అక్కడే వుండిపోతాడు.
రెండో పార్ట్‌లో జేక్, నేత్రి దంపతులకు ముగ్గురు సంతానం. వారితో పాటూ ఓ మానవ బాలుడు కూడా వుంటాడు. మొదటి పార్ట్‌లో పండోరా గ్రహాన్ని చేజిక్కించుకోవాలన్న ప్రయత్నం సఫలం కాని క్వారిచ్ (విలన్), మళ్లీ రెండో పార్ట్‌లోనూ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తాడు.
ఈ క్రమంలోనే జేక్ వద్ద వున్న మానవ బాలుడు తన కుమారుడే అని తెలుసుకుని, ఆ గ్రహంతో పాటూ, తన కొడుకుని వెనక్కి తీసుకెళ్లడం కూడా తన టార్గెట్‌గా పెట్టుకుంటాడు. మరి, ఆ లక్ష్యాన్ని విలన్ ఛేధించాడా.? 
తన జాతినీ, గ్రహాన్ని కాపాడుకోవడానికి జేక్ అతని కుటుంబం మనుషులతో ఎలా పోరాడింది.? అనేది తెలియాలంటే అవతార్ 2 చూడాల్సిందే.
నో డౌట్.! అవతార్ 2 ఓ విజువల్ వండర్. మొదటి పార్ట్ కోసం పండోరా గ్రహాన్ని అద్భుతంగా సృష్టిస్తే, రెండో పార్ట్ మొత్తాన్ని సముద్ర గర్భానికి షిప్ట్ చేశాడు జేమ్స్ కెమెరాన్. ఈ పార్ట్‌లో జేక్ సంతానాన్ని ఎక్కువగా హైలైట్ చేశాడు. విజువల్ వండర్ అని ముందుగానే చెప్పుకున్నాం కదా. మాటల్లో చెప్పలేని విజువల్ అది. ఖచ్చితంగా సినిమా ధియేటర్లో చూసి, ఆ ఫీల్ ఆస్వాదించాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com