జగన్ నేతృత్వంలో విధ్వంస పాలన కొనసాగుతోంది: చంద్రబాబు నాయుడు

- December 31, 2022 , by Maagulf
జగన్ నేతృత్వంలో విధ్వంస పాలన కొనసాగుతోంది: చంద్రబాబు నాయుడు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా రాజుపాలెంలో మీడియాతో మాట్లాడుతూ..మరోసారి సిఎం జగన్‌ పై విమర్శలు గుప్పించారు. జగన్ నేతృత్వంలో విధ్వంస పాలన కొనసాగుతోందని అన్నారు. పోలీసుల అండ చూసుకుని వైఎస్‌ఆర్‌సిపి గూండాలు, సైకోలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని… తాము బాధ పడుతుంటే జగన్, వైఎస్‌ఆర్‌సిపి నేతలు రాక్షసానందం పొందుతున్నారని అన్నారు.

విచారణల పేరుతో సీఐడీ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛను కోల్పోయారని అన్నారు. జగన్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ప్రజలు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బాధపడుతున్నారని చెప్పారు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయని… ఏ రాష్ట్రంలో లేని ధరలు ఏపీలో ఉన్నాయని అన్నారు. ఏపీని డ్రగ్స్, గంజాయికి అడ్డాగా మార్చారని మండిపడ్డారు.

మీడియాను సైతం సీఐడీతో వేధిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎక్కడా లేని విధంగా ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. రాష్ట్ర అప్పులు పెరుగుతున్నా ముఖ్యమంత్రికి ఏమాత్రం బాధ లేదని అన్నారు. జగన్ నిర్వాకంతో రైతుల అప్పులు పెరిగాయని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఏపీ ఉందని అన్నారు. సైకో పాలనకు ప్రజలే ముగింపు పలుకుతారని అన్నారు.

న్యాయ వ్యస్థపై కూడా దాడి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అట్టడుగున నిలిపిన జగన్… అవినీతిలో మాత్రం ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలిపారని విమర్శించారు. జగన్, జగన్ గ్యాంగ్ దగ్గర మాత్రమే డబ్బులుండాలని… మిగిలిన వారందరూ వాళ్ల మోచేతి నీళ్లు తాగాలనేది వారి నైజమని అన్నారు. వీళ్లందరికీ ప్రజలు బట్టలిప్పే రోజు వస్తుందని చెప్పారు. మంత్రులు డమ్మీలుగా తయారయ్యారని… వారు వారి బాధ్యతలను నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com