తెలివైన కుందేలు
- June 19, 2015
ఒక అడవిలో ఒక సరస్సు ఉండేది. దాని మధ్యలో చిన్న దీవి ఉండేది. ఆ దీవిలో రకరకాల పండ్ల చెట్లు ఉండేవి. ఆ పండ్లను తినాలని చాలా జంతువులకు ఆశగా ఉండేది. కానీ అక్కడకు వెళ్లడానికి సాహసించేవి కావు. ఎందుకంటే ఆ సరస్సు నిండా మొసళ్లు ఉండేవి. ఒకరోజు దాహం తీర్చుకోవడానికి సరస్సు దగ్గరకు వచ్చిన కుందేలుకు ఆ దీవిలోని పండ్లను చూసి నోరూరింది. ఎలాగైనా సరే ఒక్కసారి అక్కడకు వెళ్లి కడుపునిండా ఆ పండ్లను తిని రావాలని కోరిక కలిగింది. ఆ రాత్రంతా ఆలోచిస్తే దాని చిన్న బుర్రకి ఒక ఉపాయం తట్టింది. మర్నాడు ఉదయాన్నే ఆ సరస్సు దగ్గరికి వెళ్లింది. అందులోని మొసళ్లను బయటికి రమ్మని గట్టిగా అరిచి కేకలు పెట్టింది. ‘మనల్ని బయటికి పిలిచే ధైర్యం ఎవరికుందబ్బా’ అని అనుకుంటూ మొసళ్లు సరస్సు నుండి బయటికి వచ్చాయి. మీకో శుభవార్త చెబుదామని ఇలా పరుగెత్తుకొచ్చాను అంది ఆ కుందేలు ఆయాసపడుతూ.. ఏంటని ఆతృతగా అడిగాయి ఆ మొసళ్ళు. మన మృగరాజు గారు అడవిలోని జంతువులన్నింటికీ విందు భోజనం ఏర్పాటు చేసి వారికి బహుమతులు కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఈ సరస్సులోని మొసళ్ళను లెక్కపెట్టే పనిని నాకప్పగించారు. మీరు నన్నేం చేయకుండా ఉంటే మిమ్మల్నందర్నీ లెక్కపెట్టి రాజుగారికి విన్నవిస్తాను అంది ఎంతో వినయంగా. అయితే మమ్మల్ని నువ్వెలా లెక్కపెట్టగలవు? అని అడిగింది ఒక మొసలి. మీరందరూ ఒక వరుసగా ఉంటే లెక్కపెట్టేస్తాను అంది కుందేలు. అవి కుందేలు చెప్పినట్టుగానే చేశాయి. వాటి వరుస సరస్సు ఒడ్డు నుంచి దీవిదాకా ఉంది. చక్కగా కుందేలు వాటి మీద నుండి నడుచుకుంటూ దీవిలోకి వెళ్లి, దానికి కావల్సిన పండ్లూ, దుంపలూ కడుపు నిండా తిని వచ్చింది. ఎప్పుడో వెళ్ళినదానివి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావ్? అని అడిగింది ఒక మొసలి. మీరెందరున్నారో లెక్క తేలక అవస్థ పడడంతో ఇంత సమయం పట్టింది. మళ్లీ మీరు ఒక్కసారి వరుసలో నిలబడితే ఈ సారి సరిగ్గా లెక్క తేల్చేస్తాను అంది కుందేలు. దాని మాట ప్రకారం అవి వరుసలో నిలబడ్డాయి. దాంతో మళ్లీ కుందేలు వాటి మీద నుండి చెంగు చెంగున నడుచుకుంటూ దీవినుండి ఇవతలి ఒడ్డుకు వచ్చేసింది. ఆదీ కుందేలు తెలివి తేటలు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







