తల్లీ... నిన్ను తలంచి……..

- May 07, 2016 , by Maagulf
తల్లీ... నిన్ను తలంచి……..

‘పదిమంది ప్రభోదకుల కంటే విజ్ఞానాన్ని అందించే ఒక ఉపాధ్యాయుడు ముఖ్యం.పది మంది ఉపాధ్యాయుల కన్నా కర్తవ్య నిర్వహణలో పిల్లల్ని తీర్చిదిద్దే తండ్రి చాలా ముఖ్యమైన వ్యక్తి.పది మంది తండ్రుల కంటే నవమాసాలు మోసి కన్న తల్లి మరెంతో ముఖ్యం.తల్లికి మించిన గొప్ప గురువు మరింకెవ్వరూ వుండరు’ ఇది మహాభారతంలోని ఓ ప్రవచనం. నాటి నేటికీ అమ్మ గొప్పతనం గురించి చక్కగా వివరించిన ప్రవచనమిది. ఈ నేపథ్యంలో ‘మదర్స్‌ డే’ను పురస్కరించుకొని ‘అమ్మ’ గురించి ...

తల్లిని మించిన ప్రత్యక్ష దైవం లేదు. నవమాసాలు మోసి రక్తాన్ని పంచి ఇచ్చి బిడ్డను కం టుంది. పుట్టినప్పటి నుంచి కంటి పాపలా తన బిడ్డను పెంచుతుంది. 

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే...
బిడ్డ రాష్టప్రతి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినా... కాకపోయినా... ఒక సామాన్య జీవితం నుంచి అత్యున్నత శిఖరానికి ఎదిగినా అమ్మ, నాన్నలకు తమ పొత్తిళ్ళల్లోని బిడ్డే. తమ పిల్లవాడు అంచెలంచెలుగా ఎదిగిన క్రమం చూసి తల్లిద్రండులు మురిసిపోతారు. అందుకే ‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే..’అని సామెత పుట్టింది. 

తన బిడ్డ చేసే తప్పు ఒప్పుల్ని సైతం తమ గుండెల్లో దాచుకుంటారు కన్నవారు. ముఖ్యంగా తల్లి పాత్ర అతి కీలకం, ప్రధానం. తమ పిల్లలు అందవికారంగా వున్న తల్లి దృష్టిలో అం దగాళ్లే. నా కళ్ళు పెట్టి చూడండి మీకే అర్థం అవుతుంది అని అంటుంది అమ్మ. అందుకే ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అనే సామెత వచ్చింది. పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని తప్పు లు చేసినా మురిపెంగా ఏమిటో పిచ్చి పిల్లలు అనే అంటుంది మంచి తల్లి. ఏమి చేసినా ఎంత చేసినా అంతులేని మమకారం, చెప్పలేని ఆర్తి బిడ్డకు జన్మనివ్వడం కోసం తల్లి మరో జన్మ ఎత్తుతుంది. అవసరం అయితే ఏ బిడ్డల కోసం జీవిస్తుందో.. వారి కోసం మరణిస్తుం ది. అంతటి త్యాగమూర్తి అమ్మ! అందుకే అంటుంటారు ప్రతి చోటికి, ప్రతి సందర్భానికి తను ప్రత్యక్షంగా వెళ్ళలేని దైవం తన ప్రతినిధిగా అమ్మను సృష్టిం చాడని. 

మదర్స్‌ డే వేడుకలు...
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 46 దేశాలలో మే రెండో ఆదివారం అత్యంత ఆనందంగా మద ర్స్‌ డే ఉత్సవాలు జరుపుతారు. అంటే అమ్మల పండుగను ఏడాదికి ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా జరపటం చూస్తుంటే అసలు నిజానికి రోజూ అమ్మ పండుగ కాదా? అనిపి స్తుంది. అమ్మ అందించే ప్రేమామృతధారలు ప్రతి ఇంట నిత్య నైవేద్యాలు కాదా? అసలు అమ్మ నిర్వహించే బాధ్యతలకి హద్దులున్నాయా? అమ్మకి సాటి ఎవరు? అమ్మ ప్రేమకు తిరుగుందా?

జనని అనే పేరు అమ్మకి వుంది. అన్ని మతాలు, కులాల వారు అమ్మను పంచభూతాలతో సమానంగా ఉన్నత స్థానంలో వుంచాలని ఆకాంక్షిస్తున్నారు. సంధ్యావం దనంలో కూడా నీటిని (తల్లిలా) ఓ జలమా! మమ్మల్ని తల్లిలా కాపాడు నువ్వు అని అంటారు ప్రార్థనలో. 

హృదయంలో నుంచి వచ్చే మాట...
అ అంటే అలసట ఎరుగని
మ అంటే మమకారాన్ని పంచేది అమ్మ శబ్దం.
ఇంకో చోట అ అంటే అపురూపమైన, మ అంటే మాతృత్వా న్నిచ్చేది.
అపురూపమైన మాతృత్వాన్ని మనకి ఇచ్చేది అమ్మ.
ఇంకోచోట అ అంటే అద్భుతమైన, మ అంటే మనోనిబ్బరాన్నిచ్చేది.
అద్భుతమైన మనోనిబ్బరాన్ని అందించేది అమ్మ.
ఎవరిి తోచిన రీతిలో వారు అమ్మ పదానికి అర్థాలు చెపుతుంటారు.
తల్లి ప్రేమను పొందలేని అభాగ్యులు హంసల మధ్య కొంగలా సభలో రాణించలేరని కవి మాట (న శోభత సభ మధ్యే హంస మధ్యే ఒకో యథ).
చెడ్డ కొడుకు వుండచ్చుట గాని చెడ్డ తల్లి వుండదని నానుడి. అసలు తల్లి ప్రేమలోని మాధుర్యానికి, ప్రత్యామ్నాయాలు లేవు. ఏమి చేసినా... ఎంత చేసినా దానికి గుర్తింపు కోరని త్యాగానికి మరోరూపం మరో పేరు ఆ దేవత. బిడ్డ పడే కష్టాన్ని పెదవి విప్పి చెప్పక ముందే ఆకళిం పు చేసుకునేదే తల్లి హృదయం.
తన మనసులోని కష్టాన్ని, వేదనను ఏనాడు బయటకి చెప్పక, ఎంత అలసట, బరువు బాధ్యతనైనా చిరునవ్వుతో, సవాలుగా తీసుకొని తను తిన్నా తినకపోయినా తన బిడ్డడికి ఎలాంటి బాధ రాకుండా చూసేది తల్లి.
నవమాసాలు మోసి బిడ్డకి జన్మని ఇచ్చాక ఆ బాధను సైతం మరచిపోయి మురిసిపోయేది తల్లి.

మాతృత్వపు మధురిమ...
అసలు స్ర్తీకి తల్లిగా మారాకనేే సంపూర్ణత్వం వస్తుంది. మానసిక, శారీరక పరిణతి అనేది తను ఒక అమ్మగా గుర్తింపు పొందిన తర్వాతే వస్తుంది. ఎంత సంపాదించినా... ఎన్ని ఆభర ణాలున్నా వెలకట్టలేనిది. సృష్టిలో తీయనైనది అమ్మతనం.

తాను తల్లిగా గర్భం ధరించానని గుర్తించిన తొలినాళ్ళ నుంచి బిడ్డని కని చేతిలోకి తీసుకునే దాకా తల్లి పడే ఆ ఆరాటం, ఆ ఆనందం... మాటల్లో వర్ణించేందుకు సాధ్యం కాదు. తనని కన్న వారిని, తనని కట్టుకున్న వారిని, తనతో పుట్టిన వారిని... అందర్నీ మరపించేది మాతృ త్వం.ఆ మాతృత్వం స్ర్తీని తల్లిగా మార్చేస్తుంది. ఈనాటి అమ్మ బాధ్యత మరింతగా పెరిగింది. రకరకాల వృత్తి, ఉద్యోగాలు, సహాయం కరువైన న్యూక్లియర్‌ కుటుంబాలు; అక్కరకు రాని పని మనుషులు... స్థితి గతుల నడుమ బిడ్డని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే అవసరంతో పాటుగా వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడం అసలు సామాన్యమైనది కాదు. కత్తి మీద సాము లాంటిది. బిడ్డ ఎదుగుదలలో ఎన్ని సమస్యలు... 

పరిణామాలను నేటి స్ర్తీ ఎదుర్కోవటం ఆమెకి ఒక సవాలే!
అయినా ఎదురీది కష్టపడి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన తర్వాత రెక్కలోచ్చి ఎగిరిపోతారు ఆ పిల్లలు.అయినా అమ్మకి అస్సలు కోపం రాదు. పిల్లల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అనుకునే తల్లులు ఎందరికో ఎదురువుతున్న పరిస్థితి ఈనాడు ఇదే. అవునన్నా కాదన్నా ఇది నిజమే.

సాటిరాని బంధం...
సృష్టిలో ఎన్ని బంధాలున్నా.. అమ్మ బంధానికి సాటిరావు. అమ్మ ఎవరికైనా అమ్మే. పిల్ల లను కడుపులో పెట్టుకుని చూసేది తల్లి మనసే. బాధలు మన మనసు కలుక్కుమంటే ఎక్కడో వున్న పేగు కదలాడతుంది. అదే మాతృత్వం... అమ్మ చూపే మమకారం!! తల్లి నవమాసాలు మోసేటపుడు ఆమె చేసే ఆలోచనలు బిడ్డకు సంక్రమిస్తాయి. ఆమె ఆలోచనలు ఆధ్యాత్మికంగా, ధీరోరత్తంగా వుంటే అలాంటి బిడ్డలే కలుగుతారుట.

ఉదాహరణకు సుభద్ర గర్భంలో వున్నపుడు అర్జునుడు ఆమెకు పద్మవ్యూహాన్ని ఛేదించే రహస్యం చెప్పాడు. ఆమె కడుపులో బిడ్డ ఆ తండ్రి చెప్పేది శ్రద్ధగా విన్నాడు. కనుకే పద్మవ్యూ హాన్ని ఛేదించాడు. అయితే అందులోంచి బయటకు వచ్చే అవకాశాన్ని శ్రీకృష్ణుడు ఇవ్వలేదు అతనికి... అందుకే అభిమన్యుడు రాలేక పోయాడు అందులోంచి బయటికి!శకుంతల వీరుడైన దుష్యంతుని ఆలోచనలలో సింహసముడైన భరుతుడ్ని కన్నది. అష్టా వక్రుడు అనే ఋషి తల్లి గర్భంలో ఉండే వేదాంగాలను నేర్చాడు. మదాలసాదేవి సంసార మయ, రాజ్యకాంక్షకు లోబడకుండా తన పుత్రులను (విక్రంతుడు, సుబాహువు, అరిదమనుడు) తీర్చిదిద్దింది. ఇలా చెప్తూపోతే ఎందరెందరో తల్లులు తమ ఉదాత్తమైన ఆలోచనలతో గర్భంలోనే బిడ్డలను తీర్చిదిద్దారు. వారి వారి ఆలోచనా తరంగాల ప్రభావం బిడ్డలపై గట్టిగా వుంటుంది. అంతెందుకు మహాభక్తుడైన ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భం లో నే విష్ణు భక్తుడడయ్యాడు. ఇంతగా తమ పిల్లలను తీర్చిదిద్దే తల్లులకి ఏమిచ్చి ఋణం తీరుస్తాము???

తల్లి గర్భస్థ సమయంలో చేసే ఆలోచనల ప్రభావం పిల్లలపై ఉంటుందనే విషయాన్ని నేడు సైన్సు కూడా అంగీకరిస్తున్నది. ఆ సమయంలో వారు ఎంత ప్రశాంతంగా ఉంటే పిల్లలు అంత సంయమనంగా ఉండగలుగుతారని చెబుతున్నది. పురాణాలను నమ్మకపోయినా పరిశోధనలు చేసి మరీ తేల్చే సైన్సును నమ్మకుండా ఉండలేం.

ఒక్కో దేశంలో ఒక్కో రోజు...
అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, ఇటలీ, జపాన్‌, బ్రెజిల్‌, కెనడా, డెన్మార్క్‌, ఫిన్‌లాండ్‌, జర్మనీ, న్యూజి లాండ్‌, సింగపూర్‌, టర్కీలలో మే నెలలో వచ్చే రెండవ ఆదివారం మదర్స్‌ డే! ఇండోనేషియాలో డిసెంబర్‌ 22న, ఈజిప్టులో మార్చి 21న, నార్వేలో ఫిబ్రవరి 13న, థాయ్‌ లాండ్‌లో రాణి సిరికిట్‌ కిటియావర్‌ జన్మదినం రోజున అంటే 12 ఆగస్ట్‌న; స్వీడన్‌లో మే చివరి ఆదివారం జరుపుతారు. 

మెక్సికోలో మే 8, ఆల్బేనియా లో మార్చి 8, రష్యా నవంబర్‌ 28, పోలెండ్‌ 26 మే; దక్షిణ అమె రికా, బహ్రెయిన్‌, మలేషియా, ఒకున్‌, పాకిస్తాన్‌, కటార్‌, సౌదీ, యునైటడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌లో మే పది; ఇంగ్లండ్‌లో లెంట్‌లో నాలుగో ఆదివారం, ఫ్రాన్స్‌లో జూన్‌ మొదటి ఆదివారం, లేదా మే చివరి ఆదివారం, లెబనాన్‌లో వసంతం తొలి రోజున, నార్వేలో ఫిబ్రవరి 2 ఆదివారం, ఆస్ట్రియా, స్పెయిన్‌, హంగేరి, తైవాన్‌, హాంగ్‌కాంగ్‌ మే తొలి ఆదివారం జరుపుతారు. 

చరిత్ర...
అసలు ఈ అమ్మల పండుగ చరిత్ర ఎప్పటిదో...
గ్రీకుల వార్షిక వసంతోత్సవాలలో దేవతల తల్లిని పూజించడం ఆనవాయితీ. గ్రీకుల పురాణాల ప్రకారం దేవతల తల్లిని, క్రినస్‌ భార్యను గౌరవిస్తూ గ్రీకులు ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారుట. ప్రాచీన రోమన్లు హీఠారి యా పేరిట దేవతామూర్తి సిబెల్‌కు ఈ పండుగ అంకిత మిచ్చారు. క్రీస్తు తల్లి గౌరవార్థం ప్రాచీన క్రైస్తవులు మదర్స్‌డేను జరిపేవారు. ఇంగ్లాండ్‌లో తల్లులందరికీ సెలవు ప్రకటించి దాన్ని మదరింగ్‌ సండే గా పిలిచేవారు.

ఈ మదరింగ్‌ సండే ఇంగ్లాండ్‌లో 1600 సంవత్సరాల నాటిది. ఈస్టర్‌కు 40 రోజుల ముందు (లెంట్‌ అంటా రు) నాల్గవ ఆదివారాన్ని ప్రతి ఏటా మదరింగ్‌ సండేగా వ్యవహరించేవారు. ఆ రోజున పిల్లలు తమ అమ్మలకు బహుమతులు ఇచ్చేవారు. 19వ శతాబ్దం సమయానికి ఇది కనుమరుగైంది.1914 మే 8న అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ మే 2వ ఆదివారాన్ని మదర్స్‌డేగా పరి గణించి సంయుక్త తీర్మానాన్ని చేసి సంతకాలు చేసాడు. అప్పటి నుంచి అది అమెరికా సంయుక్త రాష్ట్రాల పండుగ అయ్యింది. అక్కడ నుంచి విభిన్న దేశాలలో విభిన్న రకా లుగా అమ్మకు అభివాదం తెలుపుతుంది ఈ పండుగ.

మనదేశంలో...
భారతదేశంలో మదర్స్‌ డే వయసు చాలా చిన్నది. ఒక దశాబ్దంగా మన దేశంలోకి వచ్చిన విదేశీ పండుగ ఇది. మన సాంప్రదాయ పండుగల మధ్య మదర్స్‌డే కూడా చోటు చేసుకోవడం గమనార్హం! ప్రపంచీకరణ దృష్ట్యా ఈ అమెరికన్‌ ఉత్సవం మన దేశంలోకి వచ్చింది?
మన దేశం వారు ఎక్కువగా అమెరికాలో ఉండడం, ఇం టర్నెట్‌ శాటిలైట్‌ మొదలైనవి భారతదేశంలో మదర్స్‌డే వ్యాపించడానికి ఒక కారణం. అంతే కాకుండా మన దేశ స్థులకి భావోద్వేగాలు చాలా చాలా ఎక్కువ.

అమ్మ అంటే ఆదరణ, అమ్మపై మమకారం, అమ్మ ప్రేమ లోని కమ్మనితనం, అమ్మ పదానికి వున్న అర్థం... ఒకటే మిటి ఎన్ని విషయాలు ప్రత్యేకించి అమ్మపైన గల ప్రేమా గౌరవాలు కూడా కలిసి మన వారికి మదర్స్‌ డే అనేది బాగా నచ్చింది. ఆ పండుగ మన వారి మనస్సులలో చో టు సంపాదించింది. అందుకే ఈ పండుగ సంబరం మనదేశంలో ఇతర దేశాల మాదిరిగా విస్తరించింది. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో జరుపుకునే ఈ పండుగను చూస్తే అందరి ఆలోచనలో మతృమూర్తికి కృతజ్ఞతో చె ెప్పటమే సారాంశం! కొందరు బహుమతులు ఇస్తారు. మరి కొందరు మిఠాయిలు మరికొందరు బట్టలు, పండ్లు... ఇలా తమ తమ ప్రేమను చాటుకుంటారు అమ్మ మీద!

అసలు అమ్మ పండుగని సంవత్సరానికి ఒక్క రోజు ఇలా చేస్తే సరిపోతుందా? కన్న ఋణం తీరిపోతుందా? అ మ్మంటే అవసరానికి వాడుకునే యంత్రమో, బొమ్మ కాదు. శక్తి వున్నంత వరకూ మనకి సేవలు చేసి, తన కోసం ఏమీ కోరకుండా, మనపైన పిచ్చి ప్రేమ మమ కారంతో వుండి లేవలేని స్థితిలో మంచానికి పరిమిత మైనా కూడా ఆమె విలువ తగ్గదు, వెలకట్టలేము. ఆమెని గౌరవిద్దాం. ఎలాగంటే?... ఎలాగ?... ఇలాగ!!!

అన్ని అవసరాల్లో మనం పుట్టింది మొదలు మన వెనుక వుండి తన అరచేతుల్లో నడిపించి... నడక నేర్చుకో టానికి వెన్ను ఆసరా ఇచ్చి తనకి ఏమీ మిగుల్చుకోకుండా మనకి కడుపునింపి, మన కంట నలుసు తన కంట ముల్లుగా భావించి, మనం నవ్వితే నవ్వి, ఏడ్చితే ఏడ్చి, పలుకులకి పంచదార చిలుకలు, అడుగులకి అరిసెలు, నవ్వులకి నువ్వుండలు పంచి... మన కోసం జీవితాన్ని త్యాగం చేసి మనమే లోకంగా బ్రతికి... బ్రతుకుతున్న అమ్మకి ఆదరణలో లోపం చేయొద్దు. నేటి వృద్ధాశ్రమా లు పెరగటానికి అమ్మకి ఆదరణ లేకపోవడమేగా??

మనకి జన్మనిచ్చినందుకు, మనల్ని ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దినందుకు, ఈ జన్మలో సంస్కారాన్ని అందించి నందుకు అనుక్షణం మన అభివృద్ధి కాంక్షించినందు కు... తిరిగి కేవలం కాస్త ప్రేమనురాగాల్ని తప్ప మరేమీ అడగని అమ్మకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలం! కేవలం సంవత్సరానికి ఒక రోజు గుర్తింపు కాదు. జీవి తకాలం ఆమెకి మనం ఋణ పడివుంటాం; అందుకే ఆదరించాలి ఆమెని.అంతెందుకు? మనం అలజడిగానో, అలసటగానో వున్న పుడు అమ్మ స్పర్శ... అమ్మ ఒడిలో తలవాల్చి సేదతీరితే అంతకు మించి విశ్రాంతి... ఆనందం? వుందా? అది... అది అమ్మ స్పర్శ... అమ్మ పిలుపు... అమ్మంటే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com