దుబాయ్ లో అమ్మకానికి మార్బుల్‌ ప్యాలెస్

- June 17, 2023 , by Maagulf
దుబాయ్ లో అమ్మకానికి మార్బుల్‌ ప్యాలెస్

దుబాయ్: దుబాయ్ లో ఓ అద్భుతం అమ్మకానికి వచ్చింది. దుబాయ్ అంటేనే రిచ్. అందమైన కట్టడాలకు పెట్టింది పేరు.  దుబాయ్ లో ఓ మాన్షన్‌ ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. అదే మార్బుల్‌ ప్యాలెస్. అతి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ స్టోన్‌తో నిర్మించడం వల్లే దానికి ఈ పేరు వచ్చిందట. మార్కెట్‌లో ప్రస్తుతం దీని ధర 750 మిలియన్ దిర్హాములు( రూ.1,600 కోట్లు). ఎంత ఖరీదైనదో అంత అందమైనది ఈ భవంతి. ఈ భవనం అమ్మకానికి ఉందని తెలియడంతో కొంతమంది మిలియనీర్లు కొనుగోలు కోసం ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఈ ఇంద్రభవనంపై మోజుపడుతున్నవారిలో ఓ భారతీయుడు కూడా ఉండడం విశేషం. లక్షాబిటాట్ సోత్ బేస్ ఇంటర్నేషనల్ రియాల్టీ వారు అమ్మకానికి ఉంచిన ఈ భవంతి నిర్మాణానికే సుమారు పన్నెండేళ్లు పట్టిందట. ఈ భవంతి విశేషాల విషయానికి వస్తే. మార్బుల్ ప్యాలెస్ భవనం ఏకంగా 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. 60,000 చదరపు అడుగుల ఇండోర్ ప్లేస్‌ దీని సొంతం. ఈ భవనం దుబాయ్ ఎమిరేట్స్ హిల్స్ పరిసరాల్లోని గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇంట్లో మొత్తం ఐదు బెడ్‌రూమ్‌లు ఉంటాయి. ఇందులో మాస్టర్ బెడ్‌రూమ్ ఒక్కటే 4వేల చదరపు అడుగులు ఉంటుంది. అంటే ఒక పెద్ద భవంతిని మించిన విస్తీర్ణం అన్నమాట. అలాగే 15 కార్ల గ్యారేజ్, ఇండోర్, అవుట్‌డోర్ స్మిమ్మింగ్ పూల్స్, 24-క్యారెట్ గోల్డ్ బాత్ టబ్, విశాలమైన స్టీమ్‌ బాత్ ఏరియా,19 రెస్ట్‌రూమ్‌లు, 2 రూఫ్‌లు ఉంటాయి. ఇంకా 80వేల లీటర్ లు నీరున్న కోరల్ రీఫ్ అక్వేరియం, క్రిస్టల్ డైనింగ్ టేబుల్‌లు ఈ భవనానికి అదనపు ఆకర్షణ. 160 మార్బుల్ స్తంభాలు, 2 వేల చదరపు అడుగుల ఇండోర్ టెక్నో-జిమ్ వంటివి ఈ ప్యాలెస్‌లో ఉన్నాయి. దీనిబట్టి ఈ భవనంలో ప్రతి అణువు లగ్జరీగా ఉంటుంది అని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న ఫీచర్లు సరిపోకపోయినా, తగినంతగా ఆకట్టుకోకపోయినా, ఇంకేవైనా యాడ్‌ చేయాలని కొనుక్కున్న వారు భావించినా ఎటువంటి సమస్యా లేదు. ఎందుకంటే ఈ భారీ ప్యాలెస్‌కి అదనంగా ఎనిమిది గదులను జోడించే అవకాశం ఉంది. బ్రోకర్ కునాల్ సింగ్ అంచనా ప్రకారం, కేవలం ఐదు నుంచి పది మంది సంపన్నులు మాత్రమే దీన్ని కొనుగోలు చేయగలరు. అంతేకాదు గత మూడు వారాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంటిని చూశారు. ఇందులో రష్యాకు చెందిన కొనుగోలు ప్రతినిధి ఒకరు కాగా, రెండో కస్టమర్ ఎమిరేట్స్ హిల్స్‌లో ఇప్పటికే మూడు నివాసాలను కలిగి ఉన్న ఇండియన్‌ కావడం గమనార్హం. ఆయన భార్య ఇంకొంచెం మెరుగైన దాని కోసం చూస్తోందని అందుకే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సింగ్ పేర్కొన్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com