ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: హోమ్ మంత్రి మహమూద్ అలీ
- June 23, 2023
హైదరాబాద్: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళా సంరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన ఉప్పల్ మహిళా పోలీస్ స్టేషన్ మరియు చర్లపల్లి పోలీస్ స్టేషన్ లను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం మరియు రాష్ట్ర ప్రజల ఎన్నో ఏళ్ళ పోరాటం వల్ల తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సాధ్యం అయిందని, సమైక్య రాష్ట్రంలో అభివృద్ధిలో అన్ని రకాలుగా వెనుకపడ్డ తెలంగాణ, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలను అదుపులో ఉంచడంతోనే అభివృద్ధి సాధ్యం అయిందని పేర్కొన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఉప్పల్ లో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసామన్నారు. ఈ సందర్భంగా మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణా పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని, ఈ రోజున సిసిటివిల ద్వారా నేర నియంత్రలో దేశం మొత్తంలో నంబర్ వన్ గా తెలంగాణ పోలీస్ నిలుస్తోందని పేర్కొన్నారు. మహిళా భద్రత కోసం షి టీములు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్ల మీద, మెట్రో రైళ్ళలో, బస్టాండు వంటి ప్రయాణ ప్రదేశాల్లో, ఆకతాయిల నుండి ఎదురయ్యే వేధింపుల నుండి మహిళలకు రక్షణ ఇస్తున్నామన్నారు.
శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అని, అందుకే స్వరాష్ట్రంలో నూతనంగా ఎన్నో కొత్త పోలీస్ స్టేషన్లు, ఏసీపీ, డీసీపీ జోన్లు, కమిషనరేట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గరగా ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. పెట్రోలింగ్ కోసం ఇన్నోవాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది అని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మరిన్ని పోలీస్ స్టేషన్ల ఏర్పాటు జరుగుతుందని, పోలీసు శాఖకు అవసరమైన అన్ని రకాల తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని పేర్కొన్నారు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చెల్ జిల్లాలో మొదటి మహిళా పోలీస్ స్టేషన్ ఉప్పల్ లో రావడం మరియు చర్లపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారన్నారు. స్వరాష్ట్రంలో నూతనంగా ఎన్నో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గరగా ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగా 70 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని సిసిటివి కెమెరాలు అనుసంధానం చేయబడ్డాయని, తద్వారా నేర పరిశోధన వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేర పరిశోధన వేగవంతం అయిందని, నేరశాతం కూడా తగ్గుముఖం పట్టిందని, పోలీసు శాఖలోని వివిధ విభాగాల సమన్వయంతో ఎటువంటి నేరం అయినా ఒకే రోజులో నేరస్తులను పట్టుకునే స్థాయికి రాష్ట్ర పోలీసు శాఖ చేరుకుందని పేర్కొన్నారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల సమయంలోనే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్ నూతన మహిళా పోలీస్ స్టేషన్ మరియు చర్లపల్లి పోలీస్ స్టేషన్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రపంచ స్థాయి కార్పోరేట్ కంపెనీలు, ప్రముఖ ఐటి కంపెనీలు పని చేస్తున్నాయని, వారి క్షేమం కోసం ఇరవై నాలుగు గంటలపాటు పోలీసు వారి పటిష్టమైన పెట్రోలింగ్ ద్వారా ఇక్కడ నేరాలు అదుపులో ఉన్నాయని తెలిపారు.
డ్రగ్స్ అక్రమ రవాణా మీద, కల్తీ విత్తనాల మీద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎన్నో కేసులు నమోదు చేసామని తెలిపారు. ఈవ్ టీజింగ్, మహిళల మీద వేధింపులు, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా, వాహనాల తప్పుడు నంబర్ ప్లేట్లు వంటి ఎన్నో రకాల నేరాల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అందువల్లే రాచకొండ పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. రోడ్ల మిద, కళాశాలల్లో, పని చేసే చోట ఎదురయ్యే వేధింపులు మరియు సామాజిక మాధ్యమాల్లో అపరిచితుల నుండి ఎదురయ్యే వేధింపుల గురించి భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, డిప్యూటి మేయర్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, డిసిపి ట్రాఫిక్ అభిషేక్ మొహంతి, డిసిపి మల్కాజిగిరి జానకి ఐపిఎస్, డిసిపి మురళీధర్, డిసిపి అడ్మిన్ ఇందిర, డిసిపి అడ్మిన్ నర్మద, డీసీపీ శ్రీ బాల, ఏడీసీపీలు, ఎసిపిలు, ఇతర అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?







