తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం

- June 29, 2023 , by Maagulf
తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు , తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గురువారం తెల్లవారు జామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సాయిచంద్‌కు 39ఏళ్లు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సాయిచంద్ అర్ధరాత్రి సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సాయిచంద్ చనిపోయినట్లు నిర్ధారించారు.

సాయిచంద్ వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20న జన్మించారు. పీజీ వరకు చదువుకున్న సాయిచంద్ విద్యార్థి దశ నుంచే కళాకారుడు, గాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన గళంతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించారు. జానపద పాటలతో‌సాగే పలు టీవీ షోలలోనూ సాయిచంద్ సందడి చేశారు. 2021 డిసెంబర్ నెలలో సాయిచంద్‌ను రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సాయిచంద్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. సాయిచంద్ హఠాన్మరణం కుటుంబ సభ్యుల్లో,  బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సాయిచంద్ ఆకస్మిక మృతివార్త తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఆస్పత్రికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

సాయిచంద్‌కు బీఆర్ఎస్‌లోని ముఖ్యనేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. చిన్నవయస్సులోనే సాయిచంద్ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ పలువురు నేతలు పేర్కొన్నారు. సాయిచంద్ మృతికి సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సాయిచంద్ భౌతికకాయానికి కేర్ ఆస్పత్రిలో మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పారు. సాయిచంద్ మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాత్ర విస్మరించలేనిదని, సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. పలువురు నేతలు, కళాకారులు, ఉద్యమకారుల సాయిచంద్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com