సినిమా రివ్యూ: ‘భోళా శంకర్’

- August 11, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘భోళా శంకర్’

నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీముఖి, సత్య, గెటప్ శీను, ఉత్తేజ్..
దర్శకుడు: మెహర్ రమేష్
నిర్మాత: అనిల్ సుంకర, రామ్ బ్రహ్మం సుంకర, అజయ్ సుంకర
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న డ్రీమ్‌తో వున్న మెహర్ రమేష్‌కి దక్కిన అద్భుతమైన అవకాశమే ‘భోళా శంకర్’. ఫ్యాన్స్‌, చిరంజీవిని ఎలా చూడాలనుకుంటారో అచ్చం అలాగే ‘భోళా శంకర్’‌లో చిరంజీవిని మెహర్ రమేష్ చూపించాడనీ, ఖచ్చితంగా ఫ్యాన్స్ మెచ్చి, నిర్మాతలకు బాగా లాభాలు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని ‘భోళా శంకర్‌’ పై మంచి అంచనాలున్నాయ్. మరి, ఆ అంచనాల్ని ‘భోళా శంకర్’ అందుకున్నాడా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
చెల్లెలె మహాలక్ష్మి (కీర్తి సురేష్) తో కలిసి కలకత్తా వస్తాడు శంకర్ (చిరంజీవి). చెల్లెలిని కాలేజీలో చదివించడం కోసం ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తాడు. శంకర్‌కి చెల్లెలు మహాలక్ష్మి అంటే ప్రాణం. మహాని తొలి చూపులోనే ప్రేమిస్తాడు శ్రీకర్ (సుశాంత్). శంకర్‌ని ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అందుకు శంకర్ కూడా ఒప్పుకుంటాడు. కానీ, ఓ క్రమంలో ఆమె శంకర్‌కి సొంత చెల్లెలు కాదని తెలుస్తుంది. మరోవైపు సిటీలో హ్యూమన్ ట్రాఫికింగ్ బాగా పెరిగిపోతుంది. ఈ మాఫియాని పట్టుకోవడానికి పోలీసులు తలమునకలవుతుంటారు. కానీ, ఫెయిలవుతుంటారు. ఈ క్రమంలో పోలీసులకు శంకర్, హెల్ప్ చేస్తూనే ఆ మాఫియా హెడ్ అయిన అలెగ్జాండర్ (తరుణ్ అరోరా) సోదరుల్లో ఒక్కొక్కరినీ చంపేస్తుంటాడు. ఇదంతా కళ్లారా చూస్తుంది అడ్వకేట్ లాస్య (తమన్నా భాటియా). తర్వాత లాస్య ఏం చేసింది.? అసలు ఆ మాఫియాతో శంకర్‌కి గతంలో వున్న వైరం ఏంటీ.? మహాలక్ష్మి ఎవరు.? ఇవన్నీ తెలియాలంటే ‘భోళా శంకర్’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
‘భోళా శంకర్’ ఆల్రెడీ తెలిసిన కథే. అజిత్ హీరోగా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘వేదాళం’కి రీమేక్. ఒరిజినల్‌లో అజిత్ నటనకు భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. మరి, ఆ పాత్రలో నటించిన చిరంజీవి గురించి చెప్పాలంటే.. 150 సినిమాలు చేసిన అనుభవం ఆయనది. నటనలో విశ్వరూపమే. అలాంటి చిరంజీవిని ‘భోళా శంకర్’ పాత్రలో చూస్తే ఇంకేముంది.! తనదైన స్టైలిష్ పర్‌ఫామెన్స్‌తో ఫ్యాన్స్‌ని ఎప్పటిలాగే ఆకట్టుకున్నారాయన. తెరపై శంకర్ పాత్రలో చెలరేగిపోయారు. చాలా చాలా హుషారుగా కనిపించారు. యాక్షన్ సీన్లలో శివాలెత్తేశారు. కామెడీ టైమింగ్‌లో చిరంజీవిని కొట్టేదెవ్వరు.? ఇక ఎమోషనల్ సీన్స్‌లో అయితే చంపేశారంతే.
ఇక, సినిమాలో మరో లీడ్ రోల్ పోషించిన కీర్తి సురేష్.. ఈమె గురించి చెప్పాలంటే మహానటి కదా. ఆ పాత్రకు హండ్రెడ్ కాదు కాదు టూ హండ్రెడ్ పర్సంట్ న్యాయం చేసేసింది. చిరంజీవితో కీర్తి సురేష్ పండించిన ఎమోషనల్ సీన్లు న భూతో న భవిష్యతి అనిపించేలా వున్నాయ్. నిజంగా అన్నా చెల్లెల్ల మధ్య సంబంధం ఇలా వుంటుందా.? అనేలా సహజ సిద్ధంగా ప్రాణం పెట్టేసింది. 
తమన్నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ, పాటల్లో చాలా క్యూట్‌గా గ్లామరస్‌గా అందంగా కనిపించింది. ఒరిజినల్‌లో హీరోయిన్‌తో పోల్చితే, తెలుగులో తమన్నాకి కాస్త ప్రాధాన్యత ఎక్కువే అని చెప్పొచ్చు. ఇక జబర్దస్త్ బ్యాచ్ అయిన గెటప్ శీను, హైపర్ ఆది, తాగుబోతు రమేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. శ్రీముఖితో నడుము సీన్ తెరపై బాగా పండింది.

సాంకేతిక వర్గం పని తీరు:
రెండేళ్లుగా ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాడు డైరెక్టర్ మెహర్ రమేష్. అన్నయ్యను ప్రాణంగా భావించే మెహర్ రమేష్.. తెరపై ఎలా చూపిస్తే ఆడియన్స్ ఆయనను మెచ్చుతారో ఆ పల్స్ బాగా తెలిసినోడు కాబట్టి.. ఎక్కడా తొనకలేదు. డైరెక్టర్‌గా తన బెస్ట్ ఇచ్చాడు. చాలా వరకూ మార్పులు చేసినప్పటికీ, కొన్ని ఒరిజినల్ సీన్స్ యాజ్ ఇట్ ఈజ్‌గా తెరకెక్కించాల్సి వచ్చింది. కథ అలా డిమాండ్ చేస్తుంది మరి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌లో కాస్త చెక్ చేసుకుని వుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయ్.

ప్లస్ పాయింట్స్:
ఆరు పదుల వయసులోనూ చిరంజీవి ఎంతో వుత్సాహంగా కనిపించడం.. కీర్తి సురేష్, చిరంజీవి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్.. యాక్షన్ సన్నివేశాలు.. సెకండాఫ్..

మైనస్ పాయింట్స్:
కొన్ని రెగ్యులర్ కమర్షియల్ సన్నివేశాలు..  

చివరిగా:
‘భోళా శంకర్’ హండ్రెడ్ పర్సంట్ మాస్ మెగా ఎంటర్‌టైనర్.. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్.. కాదు కాదు, అన్ని వర్గాల వారికీ (కావాలని నెగిటివిటీ ఎత్తి చూపాలనుకునేవారికి కాదు).

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com