సినిమా రివ్యూ: ‘టైగర్ నాగేశ్వరరావు’

- October 20, 2023 , by Maagulf
సినిమా రివ్యూ: ‘టైగర్ నాగేశ్వరరావు’

మాస్ రాజా రవితేజ నుంచి భారీ అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ తొలిసారి నటించిన బయోపిక్ ఇది. స్టువర్ట్‌పురం దొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించారు ఈ సినిమాలో. అయితే, ఈ సినిమా ఆశించిన అంచనాల్ని అందుకుందా.? రవితేజ కెరీర్‌కి ఉపయోగపడుతుందా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
స్టువర్ట్‌పురం అనే ఊరిని ఎలమంద (పేరడీ హరీష్) ఏలుతుంటాడు. స్టువర్ట్‌పురంలో ఏ చిన్న దొంగతనం జరిగినా ఎలమందకు కమీషన్ వెళ్లాల్సిందే. అలాంటి టైమ్‌లో నాగేశ్వరరావు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ.. పెద్ద దొంగగా మారతాడు. స్టువర్ట్‌పురం నాగేశ్వరరావు అన్న ట్యాగ్ నుంచి ‘టైగర్ నాగేశ్వరరావు’గా పాపులర్ అవుతాడు. ఈ టైమ్‌లో జరిగిన నాటకీయ పరిణామాల క్రమంలో పీఎం ఆఫీస్‌లో దొంగతనానికి స్కెచ్ వేస్తాడు. ముందుగా హెచ్చరించి మరీ, ఈ దొంగతనానికి ప్లాన్ చేస్తాడు నాగేశ్వరరావు. ఈ దొంగతనాన్ని పీఎం సెక్యూరిటీ ఛీఫ్ అయిన ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్ (అనుపమ్ ఖేర్) ఈ దొంగతనాన్ని అడ్డుకున్నాడా.? ఈ క్రమంలోనే నాగేశ్వరరావుకు పరిచయమైన సారా (నుపుర్ సనన్), మణి (గాయత్రీ భరద్వాజ్) పాత్రలేంటీ.? హేమలత లవణం (రేణూ దేశాయ్) పాత్రకీ, టైగర్ నాగేశ్వరరావుకీ సంబంధం ఏంటీ.? తెలుసుకోవాలంటే, ‘టైగర్ నాగేశ్వరరావు’ ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
రవితేజ ఇంతవరకూ పలు మాస్ రోల్స్‌లో ఆకట్టుకున్నాడు. వాటన్నింట్లోకీ ఈ పాత్రలో కాస్త కొత్తదనం చూపించాడు. టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ చేసిన అడ్వెంచర్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయ్. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతారు. ప్రధమార్ధంలో కాస్త క్రూరమైన పాత్రలో కనిపించిన రవితేజ, అలా ఎందుకు కనిపించాల్సి వచ్చిందన్నది క్లైమాక్స్‌లో రివీల్ చేయడం బాగుంది.  బీభత్సమైన యాక్షన్ అడ్వెంచర్లు చూస్తున్నంతసేపూ బోర్ కొట్టించవు. హీరోయిన్లలో నుపుర్ సనన్ పాత్ర కొంతవరకూ బెటర్. గాయత్రీ భరద్వాజ్ జస్ట్ ఓకే. కీలక పాత్రలో కనిపించిన రేణూ దేశాయ్ హేమలత లవణం‌గా తన పాత్రకు న్యాయం చేసింది. చాలా హుందాగా కనిపించింది. అనుపమ్ ఖేర్ తన సీనియారిటీనంతా రంగరించి నటించారు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర బాగా నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
దర్శకుడు వంశీ కృష్ణ ఈ కాన్సెప్ట్‌ని టేకప్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే, రన్ టైమ్ ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చేమో. కానీ, తనదైన స్క్రీన్‌ప్లేతో ఆ లోపాన్ని పెద్దగా హైలైట్ కాకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. స్టువర్ట్‌పురం అంటేనే దొంగతనాలు గుర్తుకొస్తాయ్. కానీ, నాగేశ్వరరావు ఆ దొంగతనాలు ఎందుకు చేయాల్సి వచ్చింది.? అక్కడి దళారులు, రాజకీయ నాయకులు, పోలీసులు.. ప్రజల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న సెంటిమెంట్ ఈ సినిమాలో చూపించారు. ధనికుల దగ్గర దోచేసి పేదోళ్లకు పంచి పెట్టడమే దొంగ పాత్ర పోషించిన హీరో లక్ష్యం.. ఇది మనం చాలా సినిమాల్లో చూసేశాం. అందుకు ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా అతీతం కాదు. కానీ, ఏదో కొత్తదనం కోసం ప్రయత్నించాడు డైరెక్టర్. రియల్ స్టోరీని బేస్ చేసుకుని అక్కడక్కడా డ్రమటిక్ యాడ్ చేశాడు. కానీ, అది హృదయానికి హత్తుకునేలా వుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాకి మాటలు ప్రాణం. డైలాగ్స్ వెంటాడుతుంటాయ్.  యాక్షన్ బ్లాక్స్ అన్నీ సూపర్‌గా చిత్రీకరించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయ్. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ కథకి తగ్గట్లుగా వుంది.

ప్లస్ పాయింట్స్:
రవితేజ పర్ఫామెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ డైలాగులు,  క్లైమాక్స్ సన్నివేశాలు..

మైనస్ పాయింట్స్:
సాగతీతలా అనిపించిన ఫస్టాఫ్, అక్కడక్కడా తేలిపోయిన గ్రాఫిక్స్.. 2.52 గంటల రన్ టైమ్..

చివరిగా:
‘టైగర్ నాగేశ్వరరావు’..  స్టువర్ట్‌పురం ఊరికి దొంగే కానీ, జనాలకి మాత్రం దేవుడు.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com