భారత్ లో కొత్తగా 116 కరోనా కేసులు నమోదు

- December 26, 2023 , by Maagulf
భారత్ లో కొత్తగా 116 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: భారత దేశంలో రోజూ వందల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. అయితే, గత రెండు, మూడు రోజులతో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 116 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,170కి చేరింది.

ఇక నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో మహమ్మారి కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,33,337కి ఎగబాకింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి 4,44,72,153 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరోవైపు ప్రస్తుతం దేశంలో కేసులు పెరుగుదలకు కొవిడ్‌-19 సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కారణమని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జేఎన్‌.1 (JN.1) కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం వరకు ఈ తరహా కేసులు 63 నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com