తప్పెవరిది

- June 28, 2015 , by Maagulf
తప్పెవరిది

నీ ఇల్లు వాకిలి తాకట్టు,ఏజంట్ చేతులతో

నైట్ క్లబ్బుల్లో డాన్సర్ భామలకు

పూలమాలలవుతుంటే

 

నీ అమ్మా నాన్నల దుఖ్ఖ పూరిత ఆశీస్సుల

నడుమ ,నీ ఆలి అశ్రు నయనాల నడుమ

నీ పిల్లల బెంగ చూపులలో

 

నీ కలల విమానం సాగిపోతూనే ఉంటుంది

నీ లేని తనం నుండి దూరపు కొండల నునుపును

వెదుకుతూ,పరాయి దేశాల వైపూ ...

 

కానీ,త్వరలోనే నువ్వు ఓనిజాన్ని తెలుసుకుంటావు మిత్రమా ఏ దేశమేగినా ఎందుకాలిడినా నీ రెక్కల కష్టాన్ని నమ్మిన నువ్వు చిరకాల శ్రమకు వారసుడవే అని,మోసాలు దోపిడిలు అన్ని నీ వెన్నంటే ఉంటాయని,

 

నీ కుటుంబ కష్టాలు నీ కళ్ళలో నలుసుగా మారితే ఇక కాలానికి తలొగ్గి కన్న కలలు సాకారం కాక వెనక్కి రాలేక ముందుకు పయనించలేక, నిద్ర లేని రాత్రులు గడుపుతూ నిద్ర పుచ్చే తక్కువ ధరతో  ఎక్కువకిక్కు నిచ్చే మధ్యానికి బానిసవై

 

ముడుతలు పడిన చర్మంతో కాంతి విహీనమైన

మోముతో,నీ పెళ్ళాం బిడ్డల ఎదురు చూపువై

కాలయాపన చేస్తూనే ఉంటావు 

 

మరి దీనికి తప్పెవరిదని నన్ను అడుగుతే,

నేనెలా చెప్పగలను సోదర ఈ చిక్కుముళ్ళ

వైకుంఠ పాళీ లో,నేను నీలా ఓ పావునే గా...

 

నీ సమస్యలు పూరించి నీకు ఉపాదిని కలిగించని నీ దేశానిదా? అకాశంలో నీళ్ళుజూపి ముంతలో నీళ్ళు పారబోయించిన ఆ ఏజెంటుదా?నీ శ్రమను దోపిడీ జేసి నిన్ను నిలువునా దోచిన నీ సేటుదా?

ఉన్నంతలో సర్దుకోలేని నీ వాళ్ళను సుఖ పెట్టాలనే, నీ అత్యాశదా?తప్పెవరిదో నువ్వే తేల్చుకోవాలి సుమా!

 

--జయ రెడ్డి(అబుధాబి)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com