అమెరికా నౌకపై డ్రోన్ దాడి..ర‌క్షించిన ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్ట‌ణం

- January 18, 2024 , by Maagulf
అమెరికా నౌకపై డ్రోన్ దాడి..ర‌క్షించిన ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్ట‌ణం

న్యూఢిల్లీ: అమెరికా నౌక జెన్‌కో పీకార్డీపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ బాంబులతో దాడి చేసిన విషయం తెలియగానే భారత నౌకాదళ సిబ్బంది వెంటనే స్పందించింది. అమెరికా నౌకకు సహాయంగా ఐఎన్ఎస్ విశాఖపట్నంను హుటాహుటిన ఘటనాస్థలికి పంపించింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో ప్రయాణిస్తున్న అమెరికా నౌకపై హౌతీ డ్రోన్ బాంబులు విడిచిపెట్టింది. దీంతో నౌక కొంతభాగం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ విశాఖపట్నంను వెంటనే అక్కడకు పంపించినట్లు భారత నావికాదళం ఓ ప్రకటనలో తెలిపింది.

గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌కు 70 మైళ్ల దూరంలో ఈ దాడి జరిగిందని మిడ్ఈస్ట్ జలమార్గాలను పర్యవేక్షించే బ్రిటిషన్ నావికాదళానికి చెందిన యునైటెడ్ కింగ్ డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. అక్కడ మంటలు వచ్చినట్లు ఓడ కెప్టెన్ తెలిపాడు.

అయితే హౌతి దాడికి గురైన అమెరికా నౌకలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, మంటలు అదుపులోకి వచ్చాయని భారత నౌకాదళం ఓ ప్రకటనలో తెలిపింది. ఐఎన్ఎస్ విశాఖపట్నంలో వెళ్లిన ఇండియన్ నేవీ ఎక్స్‌పోజల్ ఆర్డినెన్స్ డిస్పోజల్ నిపుణులు గురువారం ఉదయం అమెరికా నౌక దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారని పేర్కొంది. ప్రస్తుతం నౌక సురక్షితంగా ప్రయాణాన్ని తిరిగి మొదలు పెట్టినట్లు వెల్లడించింది. బుధవారం రాత్రి 11.11 గంటల సమయంలో మార్షల్ ఐలాండ్ జెండాతో ఉన్న ఎంవీ జెన్‌కో పికార్డీ నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలిసిందని పేర్కొన్నారు. సాయం కావాలని అభ్యర్థన రావడంతో ఐఎన్ఎస్ విశాఖపట్నంను పంపించినట్లు తెలిపింది. దాడి సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా ఇందులో తొమ్మిది మంది భారతీయులు. ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com