ఇరాన్‌ పై పాకిస్తాన్‌ ప్రతీకార దాడులు : 9మంది మృతి

- January 19, 2024 , by Maagulf
ఇరాన్‌ పై పాకిస్తాన్‌ ప్రతీకార దాడులు : 9మంది మృతి

టెహరాన్‌: ఇరాన్‌ పై గురువారం పాకిస్తాన్‌ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది మరణించారు. బెలూచిస్తాన్‌పై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్‌లతో దాడికి దిగినందుకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్‌ ఈ దాడులకు దిగింది.

ఇరాన్‌లోని సియాస్తాన్‌-బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో తీవ్రవాద స్థావరాలపై మిలటరీ దాడులు నిర్వహించినట్లు తెలిపింది. అత్యంత సమన్వయంతో ఈ దాడులు జరిగాయని, ఎక్కడైతే లక్ష్యముందో కచ్చితంగా దానిపైనే దాడి చేసినట్లు పాక్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆ ప్రాంతంలో నిఘా, తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇరాన్‌ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తీవ్ర పర్యవసానాలు తప్పవని పాక్‌ హెచ్చరించింది. మరణించిన వారు ఇరాన్‌ పౌరులు కాదని సియాస్తాన్‌-బెలూచిస్తాన్‌ ప్రావిన్స్‌ డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు. పాక్‌ రాయబారిని ఇరాన్‌ పిలిపించినట్లు వార్తలు తెలిపాయి. ప్రస్తుతం దావోస్‌లో వున్న పాకిస్తాన్‌ తాత్కాలిక ప్రధాని అన్వరల్‌ హక్‌ తన పర్యటన కుదించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. సున్నితమైన సరిహద్దు ప్రాంతంలో ఇలా ఇరాన్‌, పాకిస్తాన్‌ దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.

ఇప్పటికే గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హుతీ రెబెల్స్‌ దాడులతో పరిస్థితి అత్యంత సున్నితంగా వుంది. ఈ దాడులకు ముందుగా ఇరాన్‌లోని తమ రాయబారిని పాకిస్తాన్‌ వెనక్కి పిలిపించింది. జరగాల్సి వున్న అన్ని ఉన్నతస్థాయి ద్వైపాక్షిక పర్యటనలను రద్దు చేసింది. ఇరాన్‌ దాడులకు దిగిన గంటల వ్యవధిలోనే ఈ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంతగా సంయమనం పాటించాల్సిందిగా రష్యా ఇరు దేశాలను కోరింది. దౌత్య మార్గాల ద్వారా తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది. లేదా ఈ ప్రాంతంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటన జారీ చేశారు. టర్కీ కూడా ఇదే రీతిలో పిలుపునిచ్చింది. ఇదిలావుండగా, అవసరమైతే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సుముఖంగా వున్నట్లు చైనా తెలిపింది. ముందుగా ఇరు పక్షాలు ప్రశాంతతను, సంయమనాన్ని పాటించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com