కళాభారతికి నీరాజనం

- February 04, 2024 , by Maagulf
కళాభారతికి నీరాజనం

వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజానటి కళాభారతి డాక్టర్ జమున రమణారావు నటించిన సినిమాలలో ఆమె నటనా వైదుష్యంపై విశ్లేషణా ప్రసంగాలతో "మీరజాలగలడా నా యానతి" కార్యక్రమం అంతర్జాల వేదికపై శనివారం ఘనంగా నిర్వహించబడింది. 

భారత్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, హాంకాంగ్, ఖతార్ , యుగాండా, కెనడా, అమెరికా దేశాల నుండి 35 మంది ప్రఖ్యాత రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని జమున నటించిన చిత్రరాజాల నుండి 35 ఆణిముత్యాలు అయిన సినిమాలను ఎంపిక చేసుకొని, వాటిలో ఆమె కనబరిచిన నటనా ప్రావీణ్యం, వివిధ రకాల పాత్రలలో ఆమె ఇమిడిపోయిన తీరు గురించి విశ్లేషిస్తూ అద్భుతమైన ప్రసంగాలను చేశారు. 

ముఖ్యఅతిథిగా చెన్నై నుండి ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర పాల్గొని జమున నటనా ప్రభావ విశేషాలను గూర్చి, నిజ జీవితంలో ఆమె కనబరిచిన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని గూర్చి ప్రసంగించారు. 

జమున కుమారులు, అమెరికా వాస్తవ్యులైన డా.వంశీ కృష్ణ ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా పాల్గొని తన మాతృమూర్తి  చిత్రపటం ముందు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించి, అందరి ప్రసంగాలను విని ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వంశీ -సింగపూర్ సంస్థలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విదేశాల వారితోపాటు  హైదరాబాద్ నుండి ప్రముఖ రచయితలైన ఆచార్య టీ గౌరీ శంకర్, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, డాక్టర్ కె వి కృష్ణకుమారి, డాక్టర్ తిరునగిరి దేవకీదేవి మొదలైన వారు కూడా ప్రసంగవ్యాసాలను అందించడం విశేషం. 

"తాము కార్యక్రమం ఉద్దేశాన్ని తెలియపరచగానే పది దేశాల నుంచి స్పందించి 35మంది రచయితలు ముందుకొచ్చి విశ్లేషణ వ్యాసాలను అందించడం చాలా సంతోషకరంగా ఉందని, త్వరలో ఈ వ్యాసాలు అన్నింటితో వంశీ ప్రచురణగా, పుస్తకాన్ని ప్రచురిస్తామని" కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. 

రచయిత్రి రాధిక మంగిపుడి సభా నిర్వహణ గావించగా అలనాటి మేటి చిత్రాలైన మిస్సమ్మ, శ్రీకృష్ణతులాభారం, గుండమ్మ కథ, అప్పుచేసి పప్పుకూడు, యశోదా కృష్ణ, మంగమ్మ శపథం, మూగమనసులు, చిరంజీవులు, బంగారు తల్లి.. వంటి చిత్రాలలో జమున నటించిన వైవిధ్యభరితమైన పాత్రల ఔచిత్యాన్ని చక్కగా రచయితలు ఆభివర్ణించారు. సినిమాలతో పాటు జమున గారితో వీరందరికీ ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గూర్చి కూడా తలచుకుంటూ ఆమెకు నివాళులు అర్పించారు.

వంశీ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధా దేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజా సుంకరపల్లి నిర్వహణా సహకారం అందించారు. కల్చరల్ టీవీ మరియు శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com