సినిమా రివ్యూ ‘ఊరు పేరు భైరవకోన’

- February 16, 2024 , by Maagulf
సినిమా రివ్యూ ‘ఊరు పేరు భైరవకోన’

చాలా ఫెయిల్యూర్స్ తర్వాత బారీ అంచనాలతో సందీప్ కిషన్ చేసిన సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ప్రచార చిత్రాలు, ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచాయ్. అయితే, ఆ అంచనాల్ని సినిమా అందుకుందా.? లేదా.? తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
సినిమా హీరోలకు డూప్‌లా పని చేసే బసవ (సందీప్ కిషన్) తన బాబాయ్ కోసం ఓ పని మీద ఊరికి బయలు దేరతాడు. మార్గ మధ్యంలో భూమి (వర్ష బొల్లమ్మ) ఓ ప్రమాదంలో ఇరుక్కుంటుంది. దొంగలు ఆమె హ్యాండ్ బ్యాగ్ దొంగిలించి పారిపోతుంటే వాళ్లని పట్టుకుని కొట్టి.. ఆమె బ్యాగ్ అప్పగిస్తాడు బసవ. అయితే, ఆ బ్యాగ్‌లో కొన్ని ఆశ్చర్యకరమైన వస్తువులు చూసి బసవ షాకవుతాడు. అదే క్రమంలో భూమితో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు కూడా. భూమి ఊరు ‘భైరవకోన’. భూమి కోసం మరో సన్నివేశంలో స్నేహితుడితో కలిసి దొంగతనానికి పాల్పడిన బసవ.. దొంగిలించిన నగలు పట్టుకుని పోలీసులు వెంటాడుతుంటే పారిపోతాడు. మార్గ మధ్యంలో స్పృహ తప్పి పడిపోయిన గీత (కావ్య థాపర్)ని చూస్తాడు. ఆమెను కూడా తమతో పాటూ తీసుకెళతారు. దారి తప్పి భైరవకోనలో ప్రవేశిస్తారు. అక్కడంతా వారికి వింత వింతగా తోస్తుంది. గరుడపురాణంతో లింక్ వున్న భైరవకోనలో ఏదో తెలియని అతీంద్రియ శక్తి వుంటుంది. ఆ శక్తికీ బసవకీ ఏంటి సంబంధం.? భూమి తన బ్యాగులో పెట్టుకుని తిరుగుతున్న ఆ వింత వస్తువులేంటీ.? ఒక్కసారి భైరవకోనలో అడుగు పెట్టిన వారు తిరిగి బయటికి రాలేరా.? మరి, హీరో బసవ తన స్నేహితుడు ఆ ఊరు నుంచి ఎలా బయట పడ్డారు.? బసవ తాను కోరుకున్న అమ్మాయిని దక్కించుకున్నాడా.? తెలియాలంటే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
సందీప్ కిషన్ మంచి నటుడు. ఎలాంటి పాత్రలోనైనా ఈజీగా ఒదిగిపోగలడు. అలాగే ఈ సినిమాలోనూ బసవ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కాస్త ఇబ్బందిగా అనిపించింది. రెస్పాన్స్ డైలాగ్ చాలా లేట్‌గా పలుకుతాడు ఎందుకో. కావ్య థాపర్ మోడ్రన్ అమ్మాయి పాత్రలో బాగుంది. కానీ, పెద్దగా స్కోప్ లేదు ఆమె పాత్రకి. అలాగే, గిరిజన యువతి పాత్రలో వర్ష బొల్లమ్మ అస్సలు సెట్ కాలేదు. ఆమె పాత్రలో ఎలాంటి ఎమోషన్, కనెక్షన్ లేదు. ఫ్రెండ్ పాత్రలో వైవా హర్ష, డాక్టర్ పాత్రలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల పరిధి మేర వినోదం పండించే ప్రయత్నం చేశారు. తమిళ సీనియర్ నటి వడివుక్కరసి చాలా కాలం తర్వాత పెద్దమ్మ పాత్రలో కనిపించింది కానీ, ఆమె పాత్రకు డబ్బింగ్ సెట్ కాలేదు. రవిశంకర్ తనకు కొట్టిన పిండి అయిన పాత్రలో నటించి మెప్పించాడు. కానీ, ఆయన పాత్రలోనూ బలం సరిపోలేదు. మిగిలిన పాత్రధారులు పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
వి.ఐ.ఆనంద్ తన సినిమాల్లో ఎక్కడో చోట అతీంద్రియ శక్తుల ప్రస్థావన తీసుకొస్తాడు. అయితే, గతంలో చేసిన సినిమాలు వర్కవుట్ అయ్యాయ్. కానీ, ఈ సినిమాలో ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ ఆసక్తికరంగా వున్నప్పటికీ, కథనం నడిపించిన తీరు ఆకట్టుకోలేదు. కొన్ని సన్నివేశాలు చాలా పేలవంగా అనిపిస్తాయ్. భైరవకోన ఆర్ట్ డిజైన్ వర్క్ ఆకట్టుకుటుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది. వున్నవి రెండు పాటలే అయినా విజువల్‌గానూ వినసొంపుగానూ అనిపిస్తాయ్. యాక్షన్ ఘట్టాల్లో ఆయన చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్‌లెంట్. ఎడిటింగ్‌కి చాలా చాలా కత్తెరలు అవసరం. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ పరంగా ఇంకాస్త ఖర్చు పెట్టి వుంటే బాగుండేది. లిమిటెడ్ బడ్జెట్‌లో విజువలైజేషన్ అయితే బాగుంది. కానీ, కథలో విషయం లేకుండా పోయింది.

ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్, భైరవ కోన ఊరు ఆర్ట్ డిజైనింగ్ వర్క్, యాక్షన్ బ్లాక్స్‌లో నేపథ్య సంగీతం.

మైనస్ పాయింట్స్:
 మరీ పేలవంగా సాగిన హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ర్టీ, సెకండాఫ్, అస్సలు భావోద్వేగాల్లేని కథ, కథనం,

చివరిగా:
‘ఊరు పేరు భైరవకోన’ ఫస్టాఫ్‌లో కొంత మేర వినోదం ఓకే.. కానీ, సెకండాఫ్ మాత్రం సహనానికి పరీక్షే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com