సినిమా రివ్యూ: ‘ఆపరేషన్ వాలెంటైన్’.!

- March 01, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ఆపరేషన్ వాలెంటైన్’.!

మొదటి సినిమా నుంచీ మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ ప్రయోగాలకు ముందుంటాడు. అలాగే ఆయన తొలి సినిమా ‘కంచె’ నుంచి తీసుకుంటే, ‘అంతరిక్షం’, ‘గని’ ఇలా పలు ప్రయోగాత్మక చిత్రాలు ఆయన లిస్టులో వున్నాయ్. తాజాగా అలాంటి ఓ ప్రయోగమే ‘ఆపరేషన్ వాలెంటైన్’తో చేశాడు వరుణ్ తేజ్. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా‌లోకి అడుగుపెట్టాడు కూడా. టాలీవుడ్‌లో ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌తో తెరకెక్కిన సినిమానే ‘ఆపరేషన్ వాలెంటైన్’. మరి, ఈ సినిమా వరుణ్ కెరీర్‌కి యూజ్ అయ్యిందా.? కమర్షియల్ హిట్టవుతుందా.? లేక ప్రయోగాత్మక చిత్రంగా విజయం సాధించిందా.? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
అర్జున్ రుద్ర (వరుణ్ తేజ్) ఎయిర్ ఫోర్స్‌లో ఎదురు లేని ఫైలట్ కమ్ ఫైటర్. ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడూ తన పై ఆఫీసర్స్‌తో చీవాట్లు కూడా తింటుంటాడు. కానీ, తన పంథా మార్చుకోడు. ఈ నేపథ్యంలోనే దేశం కోసం రుద్ర ఓ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తాడు. దాని పేరు ‘వజ్ర’. ఈ వినూత్న ప్రయోగం టెస్టింగ్ క్రమంలో తోటి పైలట్ అయిన నవదీప్ ప్రాణాలు కోల్పోతాడు. ఇది రుద్ర కెరీర్‌లో మాయని మచ్చలా మారుతుంది. అదే వైమానిక దళంలో రాడార్ ఆపరేటర్‌గా పని చేస్తుంది అసహన (మానుషి చిల్లర్). కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్రవాదులు, ఇండియన్ సైనికులు ప్రయాణిస్తున్న వెహికల్‌పై దాడి చేయడంతో 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోతారు. అదే పుల్వామా దాడి. ఈ దాడికి ప్రతిగా ఇండియన్ సేనలు చేపట్టిన మిషన్ పేరే ‘ఆపరేషన్ వాలెంటైన్’. మరి, ఆ మిషన్ సక్సెస్ అయ్యిందా.? తనపై పడిన మచ్చని రుద్ర తుడుచుకోగలిగాడా.? తెలియాలంటే, ‘ఆపరేషన్ వాలెంటైన్’ ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
రుద్ర క్యారెక్టర్‌లో పవర్ ఫుల్ పైలట్‌గా వరుణ్ తేజ్ చక్కగా ఒదిగిపోయాడు. ఆయన కటౌట్ ఈ పాత్రకు చక్కగా యూజ్ అయ్యిందనే చెప్పొచ్చు. యాక్షన్ సీన్లలోనూ, దేశభక్తికి సంబంధించి భావోద్వేగాలు పండించడంలోనూ వరుణ్ తేజ్ కంప్లీట్ సక్సెస్ అయ్యాడు. హీరోయిన్‌గా మానుషి చిల్లర్ పాత్ర బాగుంది. ప్రాధాన్యత వున్న పాత్రలోనే మానుషి నటించింది. కో పైలట్‌గా నటించిన నవదీప్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదనే చెప్పాలి. కానీ, ఓ పజిల్‌లా ఆ పాత్ర తాలూకు ప్రాధాన్యత సినిమా మొత్తం క్యారీ అవుతుంటుంది. అలీ రెజాకి మంచి స్క్రీన్ స్పేస్ దక్కింది. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
దేశభక్తి నేపథ్యం వున్న సినిమాలను కమర్షియల్ యాంగిల్‌లో చూడకూడదు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ కూడా ఆ కోవకు చెందిందే. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ తనకున్న లిమిటెడ్ బడ్జెట్ సోర్సెస్‌లో ఈ కథను తెరపై ఆవిష్కరించడంలో తన వంతు బాగానే కష్టపడ్డాడని చెప్పొచ్చు. కానీ, కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని వుంటే బావుండేది. ప్రేక్షకుల్ని ఎమోషనల్‌గా కట్టిపడేయడం.. అనేది ఈ నేపథ్యమున్న సినిమాలకు ప్రధానమైన అంశం. ఆ అంశం కాస్త వీక్ అయ్యింది ఈ సినిమాలో. ఎయిర్ ఫోర్స్ నేపథ్యమంటేనే బిగబట్టే స్ర్కీన్‌ప్లే వుండాలి. సడెన్‌గా వచ్చే ట్విస్టులుండాలి. మిషన్ల పేరు చెప్పి చేసే ఆపరేషన్లలో పట్టుండాలి. ఆ పట్టుతోనే ప్రేక్షకున్ని కట్టిపడేయాలి. అ బిగువు, పట్టు ఈ సినిమాలో ఆశించలేం. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా అనిపించినా, వాటిలో చిన్నపాటి లాజిక్ మిస్ కావడంతో, ఆ థ్రిల్‌ని ఎంజాయ్ చేయలేం. అయితే, మిక్కీ జె మేయర్ మ్యూజిక్ కథకి తగ్గట్లుగా వుంది. సినిమాటోగ్రఫీ కూడా వున్న బడ్జెట్‌లో బాగుందనే చెప్పొచ్చు. ఎడిటింగ్‌లో ఇంకాస్త పదునుంటే బాగుండేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా పరిమితమే. వున్నంతలో ఓకే అనిపిస్తాయ్.

ప్లస్ పాయింట్స్:
రొటీన్ సినిమాలకు భిన్నంగా కథా పాయింట్ ఎంచుకోవడం, అక్కడక్కడా కొన్ని థ్రిల్లింగ్ అంశాలు, వరుణ్ తేజ్ పర్‌ఫామెన్స్, కొత్త అటెంప్ట్..

మైనస్ పాయింట్స్:
మిస్ అయిన భావోద్వేగాలు, ఫ్లాట్ స్ర్కీన్‌ప్లే..

చివరిగా:
ఈ తరహా ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయాలి. కమర్షియల్ రంగు  పులమకూడదు. రొటీన్ రొట్ట సినిమాలకు భిన్నంగా ఆశించేవారికి ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com