హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి

- April 03, 2024 , by Maagulf
హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి

ఒక చిన్న బాలుడు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. అతని సిపాయిలు ఒక గ్రామాధికారిని పట్టుకొచ్చారు. అతను చేసిన నేరం ఒక అనాథ వితంతువుపై అత్యాచారం చేయడం. గ్రామాధికారి కాళ్ళు, చేతులు బంధించబడి వున్నాయి. తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది. దృఢ స్వరంతో ఆ బాల రాజ కుమారుడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. “ ఇతని రెండు కాళ్ళు, చేతులు నరికివేయండి.” అని. అందరూ నిశ్చేష్టులయ్యారు. రాజ కుమారుని యొక్క న్యాయ ప్రియత్వం చూసి ప్రజలు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు.

అతడే భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే మరాఠా రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ. నేడు ఛత్రపతి శివాజీ వర్ధంతి.1630లో పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి పుణ్యదంపతులకు శివాజీ జన్మించాడు. 

దాదాజీ ఖోండ్ దేవ్ వద్ద శస్త్ర, శాస్త్ర విద్యలు నేర్చాడు. భక్త తుకారాం బోధనలతో ఆధ్యాత్మిక భావధార, సమర్థ రామదాసు మార్గదర్శనంలో నైతికత, రాజనీతితో కూడిన ధార్మిక భావధార, తల్లి పెంపకంలో సాంస్కృతిక భావధారను  కలగలిసి   త్రివేణీ సంగమంగా  కలిగివున్నవాడు .

శివాజీ పన్నెండేళ్ళ చిరు ప్రాయంలోనే సహ్యాద్రి పర్వత సానువులలోని మావళీ తెగ వారిని సమీకరించి వారిలో దేశభక్తిని నింపి స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించాడు. 17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్లలో కొండన, రాజ్ ఘడ్ కోటలను సొంతం చేసుకొని.. పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. గెరిల్లా యుద్ధ వ్యూహాలకు ఆద్యుడిగా శివాజీ ప్రసిద్ధి.

శివాజీ గొప్ప పరిపాలనా దక్షుడు. శత్రువులను ఓడించి రాజ్య స్థాపన చేయడంతోనే శివాజీ పొంగిపోలేదు. ప్రజల సుఖ సంతోషాల కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. ప్రజలను భగవంతుని రూపంగా భావించాడు. తన ప్రజలందరినీ విద్యావంతులను చెయ్యాలని శివాజీ అభిలషించాడు.

శివాజీ ఎంతటి ధీరుడో అంతటి కరుణమూర్తి కూడా. హిందూ దేశంలో హిందువులు సగర్వంగా జీవించగలిగే స్థితికి తెచ్చాడు. ”అగర్ శివాజీ న హోతాతో సున్నత్ హోతీ సబకీ” [ శివాజీ లేకపోతే అందరికీ సుంతీ చెయ్యబడేది] అని సమకాలీనులు చెప్పుకునేలా ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ మొఘలులతో పోరాటం సలిపాడు.  దేశ, ధర్మ, గో, వేదాది రక్షణకు శివాజీ అంకితమయ్యాడు. 

దేశం కోసం, ధర్మం కోసం శివాజీ అనేక కష్ట నష్టాలు సహించాడు. తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. ఎన్నోసార్లు మృత్యువుకు దగ్గరగా వెళ్ళాడు. ఆఖరి క్షణం వరకు దేశం, ధర్మం కోసమే జీవించాడు. 

                          --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com