సైమా 2024 : 11 నామినేషన్లతో ముందున్న నాని దసరా, రజినీకాంత్ జైలర్ చిత్రాలు

- July 17, 2024 , by Maagulf
సైమా 2024 : 11 నామినేషన్లతో ముందున్న నాని దసరా, రజినీకాంత్ జైలర్ చిత్రాలు

దుబాయ్: దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు మకుటాయమానంగా నిలుస్తున్న సైమా ప్రోగ్రాం, మరికొద్ది రోజుల్లో 12వ ఎడిషన్ అట్టహాసంగా దుబాయిలో జరగబోతుంది. దక్షిణాది బాషల చిత్రాలను, ఆయా  స్టార్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ప్రతి యేటా అవార్డులను సైమా అందజేస్తుంది. ఈ ఏడాది జరగబోయే సైమా 2024 కార్యక్రమానికి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తెలుగు నుంచి దసరా, తమిళం నుంచి జైలర్, కన్నడ నుంచి కాటేరా మరియు మలయాళం నుంచి 2018 చిత్రాలకు పలు కేటగిరీల్లో అత్యధిక నామినేషన్లు అందుకున్నాయి. ఈ నాలుగు చిత్రాలు ఆయా భాషల్లో సంచలన విజయాలను నమోదు చేయడం జరిగింది.

నాచురల్ స్టార్ నానికి 2023 బాగా కలిసివచ్చింది అనే చెప్పాలి. ఆయన నటించిన దసరా, హాయ్ నాన్న చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలవడమే కాకుండా, సైమా అవార్డ్స్ 2024 నామినేషన్స్ తెలుగులో దసరా చిత్రానికి 11, హాయ్ నాన్న చిత్రానికి 10 విభాగాల్లో  నామినేషన్స్ దక్కాయి. ఈ నామినేషన్స్ లో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి మరియు ఉత్తమ దర్శకుడు వంటి కీలకమైన విభాగాల్లో ఈ చిత్రాలు పోటీ పడటం విశేషం.

తమిళంలో సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం మనందరికి తెలిసిందే! నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చిత్రానికి 11 విభాగాల్లో నామినేషన్స్ దక్కాయి. జైలర్ తర్వాత మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన మమన్నన్ చిత్రానికి 9 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి.

కన్నడంలో శాండిల్ వుడ్ సూపర్ స్టార్ దర్శన్ నటించిన కాటేరా చిత్రానికి 8 విభాగాల్లో నామినేషన్స్ దక్కగా, రక్షిత్ శెట్టి ఎమోషనల్ లవ్ డ్రామా సప్త సాగర సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ ( తెలుగులో సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ) చిత్రానికి 7 విభాగాల్లో నామినేషన్స్ దక్కాయి.

ఇక మలయాళంలో గత ఏడాది యువ కథానాయకుడు టోవినో థామస్ నటించిన 2018 సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి 8 విభాగాల్లో నామినేషన్స్ దక్కగా, మలయాళ  సూపర్ స్టార్ మమ్ముట్టి , జ్యోతిక నటించిన కాథల్ - ది కోర్ చిత్రానికి 7 విభాగాల్లో నామినేషన్స్ దక్కాయి.

 దుబాయ్ లో ఈ ఏడాది సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జరగబోయే సైమా 2024 కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆన్లైన్ ఓటింగ్ ద్వారా 12వ ఎడిషన్ విజేతలను నిర్ణయిస్తారు. సైమా వెబ్సైట్ లేదా సైమా ఫేస్బుక్ పేజీలో కూడా ఆన్లైన్ ఓటింగ్ వేయొచ్చు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com