సినిమా రివ్యూ: ‘కమిటీ కుర్రోళ్లు’.!

- August 10, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘కమిటీ కుర్రోళ్లు’.!

హీరోయిన్‌గా తన ప్రతిభను చాటుకోవాలనుకుంది మెగా డాటర్ నిహారిక. కానీ, సాధ్యం కాలేదు. హీరోయిన్‌గా పెద్దగా రాణించలేకపోయింది. ఇప్పుడు నిర్మాతగా తన అభిరుచిని చాటుకోవాలనుకుంది. అలా సెలెక్ట్ చేసుకున్న కథే ‘కమిటీ కుర్రోళ్లు’. మరి, నిర్మాతగా నిహారిక ఎంపిక సక్సెస్ అయ్యిందా.? లేదా.? తెలియాలంటే ‘కమిటీ కుర్రోళ్లు’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
పశ్చిమ గోదావరి జిల్లాలోని పురుషోత్తంపల్లి అనే ఓ పల్లెటూరిలో ఈ కథ స్టార్ట్ అవుతుంది. 11 మంది స్నేహితుల మధ్య సాగే కథనమే ఈ సినిమా కథ. చిన్నతనం నుంచీ ఎలాంటి తారతమ్యాలూ లేకుండా ఎంతో స్నేహంగా వుండే ఆ 11 మంది కుర్రోళ్లు పెరిగి పెద్దోళ్లవుతారు. యుక్త వయసుకు చేరతారు. వారిలో ఓ కుర్రోడికి ఎమ్‌సెట్‌లో మంచి ర్యాంకు వచ్చినప్పటికీ రిజర్వేషన్ లేని కారణంగా యూనివర్సిటీలో సీటు రాదు. అక్కడితో కులం ప్రస్థావన వచ్చి ఆ కుర్రోళ్ల మధ్య చిన్నగా స్టార్ట్ అయిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారి కులం పేరు చెప్పి విడిపోయే వరకూ చేరుతుంది. అలా అన్నేళ్లు ఎంతో సరదాగా వున్న ఆ స్నేహితులు  రెండు వర్గాలుగా విడిపోతారు. సాంప్రదాయంగా ప్రతీ ఏడాదీ వచ్చే జాతర కారణంగా ఈ గొడవ మరింత పెద్దదవుతుంది. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలూ, ఊరిలోని కొన్ని రాజకీయ కారణాలతో ఆ స్నేహితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయ్. చివరికి ఈ స్నేహితుల బృందం జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయ్. చివరికి ఈ కుర్రోళ్లంతా ఒక్కటయ్యారా.? లేదా.? తెలియాలంటే ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
ఇలాంటి ఓ కథని నిర్మించేందుకు ఒప్పుకున్న నిహారికను ముందుగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక నటీ నటుల విషయానికి వస్తే.. ఈ సినిమాలో అందరూ కొత్తోళ్లే. సాయి కుమార్, గోపరాజు రమణ, సీనియర్ నటి శ్రీలక్ష్మి వంటి ముగ్గురు నలుగురు తెలిసిన నటీనటులు తప్ప మిగిలిన వాళ్లంతా కొత్తోళ్లూ యంగ్‌స్టర్స్.  అయినా కానీ ప్రతీ పాత్ర చాలా ప్రత్యేకంగా వుంటుంది. చిన్నా పాత్ర పెద్ద పాత్ర అనే తేడా లేకుండా ప్రతీ పాత్ర తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆయా పాత్రల పేర్లు తెలియకపోయినప్పటికీ తమ తమ పాత్రల పేర్లతోనే ప్రేక్షకుడికి బాగా గుర్తుండిపోతారు. ముఖ్యంగా మెయిన్ లీడ్ పోషించిన శివ, విలియం, సూర్య, సుబ్బు పాత్రలు చాలా బాగా ఆకట్టుకుంటాయ్. అలాగే వీరికి జోడీగా నటించిన ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించిన అమ్మాయిలు సైతం సహజమైన నటనతో మెప్పించారు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు యదు వంశీ కొత్త డైరెక్టర్. కానీ, కథను తాను అనుకున్న రీతిలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరపై ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. పాత కథే అయిన ఎక్కడా బోర్ కొట్టించకుండా కథనం నడిపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడా రొటీన్‌గా అనిపించిన సన్నివేశాలే అయినా ఇంటెన్స్‌గా చూపించాడు. బోర్డర్ దాటకుండా కేవలం పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌కే పరిమితమై కథను సుఖాంతం చేసిన తీరు విమర్శకు ప్రశంసలు దక్కించుకుంటోంది. ముఖ్యంగా ఈ కథ 90స్ జనరేషన్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతీ పాత్ర హార్ట్‌ని టచ్ చేసే విధంగా వుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ వర్క్ ఈ సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. పాటలు కానీ, సన్నివేశాలకు తగ్గట్టుగా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ చాలా చాలా బాగుంది.  నిహారిక అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయ్. అలాగే పల్లెటూరి అందాల్ని సహజ సిద్ధంగా ఎంతో అందంగా చూపించిన సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఎడిటింగ్‌లోనూ పెద్దగా వంకలు పెట్టడానికేమీ లేదు. ఓవరాల్‌గా ఈ సినిమాకి టెక్నికల్ టీమ్ వర్క్ బాగా సెట్ అయ్యింది. అక్కడక్కడా చిన్న చిన్న లోపాలున్నప్పటికీ ఓ మంచి కథని అందరికీ కనెక్ట్ అయిన కథని నేచురల్‌గా రాజీ పడకుండా తెరపై ఆవిష్కరించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
ఫస్టాఫ్, యంగ్‌స్టర్స్ పర్‌ఫామెన్స్, పాత్రల చిత్రీకరణ, కామెడీ సన్నివేశాలతో పాటూ, కనెక్టింగ్ భావోద్వేగాలు.. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో వచ్చే సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లో కాస్త సాగతీతగా అనిపించిన సన్నివేశాలు, రొటీన్ కథ,

చివరిగా:
కమిటీ కుర్రోళ్లు.. చాలా విషయమున్నోళ్లు.. కుర్రోళ్లు, ఫ్రెండ్‌‌షిప్ పాత కథే అయినప్పటికీ ధియేటర్లలో ఒక్కసారైనా చూసి మంచి కాఫీ‌లాంటి ఆ ఫీల్‌ని అనుభూతి చెందొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com