సంగీత చక్రవర్తి....!

- September 08, 2024 , by Maagulf
సంగీత చక్రవర్తి....!

తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో పేరుకు తగ్గట్టు చక్రవర్తిలాగానే చరించారు సంగీత దర్శకులు చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం శాసించారు చక్రవర్తి. ఆ రోజుల్లో ఏవీయమ్ రికార్డింగ్ థియేటర్స్ అన్నిటా చక్రవర్తి సంగీతమే వినిపిస్తూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అగ్రకథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరి చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది. దాదాపు 800 చిత్రాలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఆయన గాత్రం, నటన సైతం పులకింపచేశాయి.నేడు సంగీత దర్శకుడు చక్రవర్తి పుట్టినరోజు. 

చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు.1936 సెప్టెంబరు 8వ తేదీన గుంటూరు జిల్లా, పొన్నెకల్లు గ్రామంలో జన్మించారు. 1958లో గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రముఖ దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు ఈయన సోదరుడే. అన్నదమ్ములిద్దరూ బాల్యం నుంచీ నాటకాలు ఆడేవారు. ఆ రోజుల్లో హార్మోనియం మీద మంచి పట్టు సాధించారు చక్రవర్తి. తన మిత్రులతో కలసి నాటకాలు వేసే రోజుల్లో కింద కూర్చుని నాటకానికి తగ్గట్టుగా హార్మోనియంపై వేళ్ళు కదిలించేవారు. ఆయన సైతం పలు నాటకాల్లో నటించారు. అసలు నటుడు కావాలనే చక్రవర్తి చెన్నపట్టణం చేరారు. అయితే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటీ అన్నట్టు చక్రవర్తికి నటునిగా అవకాశాలేవీ లభించలేదు. దాంతో కొన్ని అనువాద చిత్రాలకు గాత్రదానం చేశారు. కొన్ని డబ్బింగ్ చిత్రాలకు రీ-రికార్డింగ్ లో పనిచేశారు. పలువురు సంగీత దర్శకుల వద్ద హార్మోనియం కూడా వాయించారు. మిత్రుల సలహా మేరకు సంగీత దర్శకునిగా మారారు. ‘చక్రవర్తి’ అని ఆయనకు నామకరణం చేసిందీ మిత్రులే. ‘మూగప్రేమ’ (1970) చిత్రంతో తొలిసారి చక్రవర్తి పేరుతో సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. 

చక్రవర్తికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన చిత్రం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘శారద’ (1973). ఈ చిత్రంలోని పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. తరువాత ప్రముఖ దర్శకనిర్మాత కె.ఎస్.ప్రకాశరావు (కె.రాఘవేంద్రరావు తండ్రి) చక్రవర్తిని ప్రోత్సహించారు. తాను తీసిన ‘ఇదాలోకం’ చిత్రానికి చక్రవర్తితోనే స్వరకల్పన చేయించారు. ఇందులోని పాటలూ భలేగా అలరించాయి. ఆ తరువాత పలు చిత్రాలకు స్వరాలు సమకూర్చినా అంతగా పేరు రాలేదు. కె.రాఘవేంద్రరావు తొలి చిత్రం ‘బాబు’ (1975)కు కూడా చక్రవర్తి బాణీలు కట్టారు. అందులోని పాటలు మాస్ ను అలరించాయి. అదే సమయంలో కె.ఎస్.ప్రకాశరావు తెరకెక్కించిన ‘చీకటివెలుగులు’ లోనూ చక్రవర్తి స్వరాలు మంచి ఆదరణ పొందాయి. ఇక యన్టీఆర్ ‘అన్నదమ్ముల అనుబంధం’ (1975) చిత్రం ‘యాదోంకీ బారాత్’ హిందీ సినిమాకు రీమేక్. అందులో మాతృకను అనుసరిస్తూనే, తనదైన బాణీ పలికించారు చక్రవర్తి. ఆ పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు చక్రవర్తిని బాగా ప్రోత్సహించారు. 

నటరత్న ఎన్టీఆర్ కూడా తన చిత్రాలకు చక్రవర్తి పేరును సిఫార్సు చేసేవారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘యమగోల’ (1977) అనూహ్య విజయం సాధించింది. ఆ సినిమాకు చక్రవర్తి సమకూర్చిన బాణీలు జనాన్ని కుర్చీలలో కుదురుగా కూర్చోనివ్వకుండా చేశాయి. దాంతో చక్రవర్తి సంగీతానికి క్రేజ్ పెరిగింది.చక్రవర్తికి ఏ ముహూర్తాన ఆయన మిత్రులు ఆ పేరు పెట్టారో కానీ, నిజంగానే తెలుగు సినిమా సంగీతాన్ని ఆయన శాసించారు. యన్టీఆర్ సినిమాలతో చక్రవర్తికి మంచి గుర్తింపు లభించింది. ఆ నాటి టాప్ హీరోస్ చిత్రాలకే కాదు, వర్ధమాన కథానాయకుల సినిమాలకు, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కు కూడా చక్రవర్తి సంగీతం ప్రాణం పోసింది. 

ఆ రోజుల్లో యేడాది 60 నుండి 75 శాతం తెలుగు చిత్రాలకు చక్రవర్తి సంగీతమే పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. ఆయన స్వరకల్పన చేసిన వందలాది చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఆ రోజుల్లో రికార్డుల అమ్మకాల్లోనూ చక్రవర్తి సినిమాలు పలు రికార్డులు క్రియేట్ చేశాయి. నాలుగు తరాల స్టార్ హీరోస్ చిత్రాలను చక్రవర్తి బాణీలు మ్యూజికల్ హిట్స్ గా నిలిపాయి. ఆయన తరువాత తెలుగునాట ఆ స్థాయిలో అలరించిన సంగీత దర్శకుడు మరొకరు కానరారు. తనకు సంగీతపరిజ్ఞానం లేదంటూనే తెలుగు సినిమా సంగీతాన్ని శాసించారు చక్రవర్తి. ఆయన వద్ద అసోసియేట్స్ గా పనిచేసిన వారెందరో తరువాతి కాలంలో అగ్రసంగీత దర్శకులుగా పేరు సంపాదించారు. 

నటుడు కావాలని మదరాసు చేరిన చక్రవర్తి తాను ఎంత బిజీగా ఉన్నా అడపా దడపా తెరపై కనిపించేవారు. ఎన్టీఆర్ ‘గజదొంగ’లో కాసేపు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించి అలరించారు. ఆ తరువాత ‘పక్కింటి అమ్మాయి’లో కామెడీతో కడుపుబ్బ నవ్వించారు. చక్రవర్తి సంగీతానికి క్రేజ్ తగ్గి, కొత్త తరం మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్న రోజుల్లోనే ఆయన నటనలోకి దిగారు. ఆయన స్వరకల్పనలో రూపొందిన చివరి చిత్రం ‘అమ్మోరు’. ఆ తరువాత పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు చక్రవర్తి. చివరి సారిగా ‘నిన్నే ప్రేమిస్తా’ చిత్రంలో చక్రవర్తి తెరపై కనిపించారు. తొలి రోజుల్లో అనువాద కళాకారునిగా, గాయకునిగా, తరువాత నటునిగా సాగిన చక్రవర్తి సంగీత దర్శకునిగానే సుప్రసిద్ధులు. ప్రముఖ యువ సంగీత దర్శకుడు స్వర్గీయ శ్రీ కొమ్మినేని వీరి కుమారుడు


చక్రవర్తి పేరు వినగానే ఈ నాటికీ నాటి అభిమానులకు ఆయన స్వరకల్పనలో రూపొందిన పాటలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఆ నాటి టాప్ హీరోస్ అందరి అభిమానులు చక్రవర్తి సంగీతాన్ని అభిమానించారు. చక్రవర్తి సంగీతం ఉంటే చాలు తమ హీరో సినిమాలు భలేగా ఆడతాయనే నమ్మకంతో ఉండేవారు ఫ్యాన్స్.1000 చిత్రాల సంగీత దర్శకుడిగా రికార్డు నెలకొల్పాలని చక్రవర్తికి ఆశగా వుండేది. అమ్మోరు చిత్రానికి చివరి సారిగా సంగీతాన్ని అందించిన చక్రవర్తి 2002 ఫిబ్రవరి 3న కన్నుమూశారు. తనపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ఏ నాడూ వమ్ము చేయకుండానే చక్రవర్తి అందరు హీరోల సినిమాలకు వినసొంపైన సంగీతం సమకూర్చారు. అందుకే ఈ నాటికీ చక్రవర్తి సినీఫ్యాన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకొనే ఉన్నారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com