సామాజిక దృక్పథం కలిగిన శాస్త్రవేత్త...!

- September 10, 2024 , by Maagulf
సామాజిక దృక్పథం కలిగిన శాస్త్రవేత్త...!

మహనీయులకు మరణమనేది ఉండదు. దేశం, సమాజం కోసం వారు చేసే పనులు.. వారిని చిరస్మరణీయంగా నిలిచేలా చేస్తాయి. ఈ కోవలో ముందుండే వ్యక్తి డాక్టర్ యలవర్తి నాయుడమ్మ. మారుమూల గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి.. శాస్త్రవేత్తగా ఎదిగి, అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. తోలు పరిశ్రమలో విశేష పరిశోధనలు చేసి.. వేలాది మందికి ఉపాధి మార్గం చూపారు. దేశానికి కోట్లాది రూపాయల ఆదాయం సృష్టించిన ఘనడు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలపై ప్రత్యేక కథనం.

డాక్టర్ యలవర్తి నాయుడమ్మ 1922, సెప్టెంబర్ 10న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి తాలూకా  తెనాలి తాలూకా యలవర్రు గ్రామంలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. రాఘవమ్మ, అంజయ్యలు వీరి తల్లిదండ్రులు. యలవర్రు, తురుమెళ్ల గ్రామాల్లో హైస్కూల్ విద్యను పూర్తిచేశారు. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదివి, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశారు.

ఆ రోజుల్లో ఆంధ్ర ప్రాంతంలో కెమికల్ పరిశ్రమలు పెద్దగా లేనందున, యువ నాయుడమ్మకు ఉద్యోగం రాలేదు. ఆ కాలంలో లాయర్ వృత్తికి గౌరవం ఉండేది. సమీప బంధువు యడ్లపాటి వెంకట్రావు మద్రాసు లా కళాశాలలో విద్యార్థిగా ఉన్న కారణంగా తండ్రి అంజయ్య నాయుడమ్మను మద్రాస్‌లో లా కోర్సులో చేర్పించారు. అయితే న్యాయశాస్త్ర విద్య మీద ఏమాత్రం ఆసక్తి లేని నాయుడమ్మ కాలేజీకి వెళ్లేవారు కాదు. ఆ మహానగరంలో ఆయనకు యాదృచ్ఛికంగా ‘మద్రాస్ లెదర్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‘ హెడ్‌గా ఉన్న ప్రొఫెసర్ కాట్రగడ్డ శేషాచలం పరిచయమయ్యారు.

నాయుడమ్మ ప్రతిభా పాటవాలను గుర్తించిన శేషాచలం, ఆ యువ శాస్త్రవేత్తకు తమ సంస్థలోనే నెలకు రూ.17 జీతంపై కెమిస్ట్రీ డిమాన్‌స్ట్రేటర్‌గా ఉద్యోగమిచ్చారు. ఆయనే, లండన్‌లోని లెదర్ సెల్లర్స్ టెక్నికల్ కాలేజీలో నాయుడమ్మ ఏడాది పాటు శిక్షణకు వెళ్లేందుకు కూడా సహకరించారు. ఇంగ్లాండ్‌లో శిక్షణ తీసుకోవడం వల్ల, మద్రాస్‌లోని తమ సంస్థలో ప్రమోషన్ వస్తుందని తెలిసినా, ఆ ట్రైనింగ్ వల్ల పెద్ద ఉపయోగంలేదని అర్థం చేసుకున్న నాయుడమ్మ అమెరికాలోని లిహాయ్ యూనివర్సిటీలో ఎమ్ఎస్ డిగ్రీకోసం 1947లో ఇంగ్లాండ్ నుంచి అమెరికా వెళ్లారు.

 1949లో ఎంఎస్ పూర్తి చేసి, అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఎడ్విన్ రే థయిశ్ వద్ద పరిశోధన చేశారు. ఆయన పరిశోధన విషయం చర్మ శుద్ధి ప్రక్రియలో ఉత్పన్నమయ్యే రసాయన మార్పులు, చర్మం కుంచించుకుపోతే తలెత్తే సమస్యలు, చేపట్టాల్సిన ప్రతిచర్యలు. శాస్త్ర పరిశోధనల్లోనూ, శాస్త్ర విజ్ఞానాన్ని పారిశ్రామిక కార్యకలాపాలకు అనువర్తింప చేయడంలోనూ అనుభవం సాధించి నాయుడమ్మ 1951లో స్వదేశం చేరుకొని, మద్రాసులోని సెంట్రల్‌ లెదర్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎల్ఆర్ఐ)లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు.

తోళ్ల పరిశ్రమను అంటరానిదిగా భావింపబడిన ఆ కాలంలో ఆ పరిశ్రమకి గుర్తింపు, గౌరవం తీసుకువచ్చిన ఘనత నాయుడమ్మదే. తోళ్లను, కాలుష్యరహితంగా శుద్ధి చేసి వాటి నుంచి వస్తువులు, దుస్తులు తయారు చేసే ఒక బృహత్తర పరిశ్రమగా ఆ రంగాన్ని అభివృద్ధిపరచడంలో ఆయన ప్రశస్త పాత్ర నిర్వహించారు. అంటరానితనం చర్మ పరిశ్రమకు దూరమయింది. చర్మకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకుని ఆర్థికంగా బాగుపడ్డారు. ఇది నిశ్శబ్ద విప్లవం. ఇప్పుడు ఆ పరిశ్రమ 33 లక్షల మంది జీవనోపాధికి ఆలంబనగా ఉంది. ఏటా రూ. 88,000 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఆ పరిశ్రమవారు ఆయన్ని దైవసమానుడుగా గౌరవిస్తారు.

నాయుడమ్మ 34 సంవత్సరాల పిన్న వయసులోనే సీఎల్ఆర్ఐ ఇంచార్జి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే సిఎల్ఆర్ఐ కార్యకలాపాలలో పెనుమార్పులు ప్రవేశపెట్టారు. తోళ్ల నుంచి వెలువడే దుర్గంధాన్ని నిరోధించేందుకు తేలికపాటి శుద్ధి విధానాలను అమలులోకి తీసుకువచ్చారు. తోటి శాస్త్రవేత్తలతో గ్రామాల బాట పట్టారు. చర్మకార వర్గం ప్రజలు తమకు వస్తున్న లాభాల దృష్ట్యా ఆయన సూచనలన్నీ ఆమోదించారు. 1958లో సిఎల్ఆర్ఐ డైరెక్టర్ పదవికి నాయుడమ్మ పేరు పరిశీలనకు వచ్చినప్పుడు అయన వయసు 35 ఏళ్లే. అంత చిన్న వయసులో ఒక పరిశోధనా సంస్థకి ఎవరూ డైరెక్టర్ అయిన దాఖలాలు లేవు.

నవ భారత నిర్మాత నెహ్రూ నాయుడమ్మను స్వయంగా ఇంటర్వ్యూ చేశారు. ‘మీరు ఇంత చిన్న వయసులో ఏ విధంగా ఈ సంస్థను నడపాలని అనుకుంటున్నారు?’ అని నెహ్రూ ప్రశ్నించగా సంస్థ పరిశోధనలతో తోళ్ల పరిశ్రమ రూపురేఖలే మార్చి ఆ పరిశ్రమపై ఆధారపడ్డ వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడేందుకు తాను రూపొందించిన ప్రణాళికను నాయుడమ్మ వివరించారు. నెహ్రూ సంతోషించి అభినందనలు తెలిపారు. నెహ్రూతో నాయుడమ్మ సమావేశం భారతదేశ తోళ్ల పరిశ్రమకే ఒక కీలక మేలు మలుపు. ఈ రోజు సిఎల్ఆర్ఐ ప్రపంచంలోనే అతిపెద్ద తోలు పరిశోధనా సంస్థగా విరాజిల్లుతుందంటే అది నాయుడమ్మ కృషి ఫలితమే.

1958లో నెహ్రూ సిఎల్ఆర్ఐని సందర్శించినపుడు, ఆయనకు, తోలుతో తయారు చేసిన ఒక పువ్వును నాయుడమ్మ బహుకరించారు. దాన్ని నిజమైన పువ్వుగా నెహ్రూ భ్రమించారు. నిజం తెలిసిన తరువాత అబ్బురపడ్డారు. పేద చర్మకారుల ఆర్థికాభ్యున్నతికి సంస్థ తోడ్పడుతున్న తీరును తెలుసుకుని నాయుడమ్మను నెహ్రూ అభినందించారు. విదేశీ శాస్త్రవేత్తల సందర్శనాలు, నాయుడమ్మ విదేశీ పర్యటనలు, కాన్ఫరెన్స్‌లతో, ప్రపంచ తోలు పారిశ్రామిక రంగంలో సిఎల్ఆర్ఐ ఒక వెలుగు సంతరించుకుంది. పరిశ్రమ వర్గాల వారికి, ఆధునిక పరిజ్ఞానం మీద నమ్మకం కలిగించడానికి ఆయన ‘సంస్థ సలహాలు, సూచనలు పాటించాలి. లాభం వస్తే అంతా మీకే, నష్టం వస్తే మేము భరిస్తామని’ నాయుడమ్మ ప్రతిపాదించారు. ఇది మంచి ఫలితాల నిచ్చింది.

సిఎల్ఆర్ఐ సహకారం కోసం చర్మ కార్మికులు, చిన్న తరహా తయారీదారులు ముందస్తు అనుమతి లేకుండా నాయుడమ్మను కలవడానికి వచ్చేవారు. ఆయన ఏమాత్రం విసుక్కోకుండా సందేహాలు తీర్చి పంపేవారు. మిగిలిన సిబ్బంది కూడా అదే పద్ధతి అనుసరించి పరిశ్రమతో పరిశోధనను అనుసంధానం చేశారు. ఒక్కోసారి, ఎక్కువమంది రావడం వల్ల అందరికీ కుర్చీలు సరిపోని కారణంగా, ఉన్న కుర్చీలు కూడా తీసివేయించి, తాను కూడా వారితో పాటు నేల మీద కూర్చుని వారి సమస్యలు తెలుసుకున్న ఉదారుడు నాయుడమ్మ.

సిఎల్ఆర్ఐ డైరెక్టర్‌గా 13 సంవత్సరాలు పని చేసిన అనంతరం 1971లో ‘కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్’ డైరెక్టర్ జనరల్‌గా వెళ్లే అవకాశం నాయుడమ్మకు వచ్చింది. ఆ బాధ్యతలను చేపట్టేందుకు ఆయన రెండు షరతులు పెట్టారు. అవి: ఆ పదవిలో 5 సంవత్సరాలకన్నా ఎక్కువ పనిచేయను; వివిధ దేశాల ప్రయోగశాలలతో ఒప్పందాల ప్రకారం సంవత్సరానికి 3 వారాలు విదేశీ ప్రయాణాలకు అనుమతులు ఇవ్వాలి. ఈ షరతులకు నాటి ప్రధాని ఇందిర తొలుత చిరాకుపడినా అంతిమంగా అంగీకరించారు. ఆ తరువాత కాలంలో అయనను తన సలహాదారుగా కూడా ఆమె నియమించుకున్నారు.48 సంవత్సరాల అతి చిన్న వయసులో ఆ పదవిని అలంకరించిన నాయుడమ్మ శాస్త్ర పరిశోధనా రంగంలో ఎన్నో సంస్కరణలకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. పరిశ్రమలకు ఉపయోగపడే పరిశోధనలు విరివిగా సాగేందుకు ఆయన ప్రథమ ప్రాధాన్యమిచ్చారు.

ఐక్యరాజ్య సమితి సలహాదారుగానూ నియమితులైన నాయుడమ్మ.. సూడాన్, సోమాలియా, నైజీరియా, టర్కి, ఇరాన్‌ వంటి దేశాల్లో తోలు పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశారు. వీరిలోని నిశిత మేధా శక్తిని, నిరాడంబరతను గుర్తించిన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు  గారు రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుగా నియమించి గౌరవించారు. ఆ తర్వాత గద్దెనెక్కిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆయన్ను ఆ  గౌరవ పదవిలో కొనసాగిస్తూ వారి పరిణతను, సుదీర్ఘ అనుభవసారాన్ని వినియోగించుకున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆర్ధికంగా ప్రజల వెనుక బాటుతనాన్ని రూపుమాపేందుకు వెనుకబడిన జిల్లాల దత్తత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అనూహ్యంగా సత్ఫలితాలను సాధించిన ఈ కార్యశీలి పలు విశిష్ట గౌరవాలు అందుకున్నారు. ఇంకా వివిధ విదేశీ ప్రభుత్వాలకు, మన దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారుగా పనిచేసారు.

1981లో ఇందిరాగాంధీ అభ్యర్థనపై నాయుడమ్మ న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ (జె.ఎన్.యూ) వైస్ ఛాస్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు.జె.ఎన్.యూ వైస్-ఛాన్సలర్‌గా పనిచేసిన మొదటి తెలుగువారు నాయుడమ్మ. భారతదేశంలో పోస్ట్ గ్రాడ్యుయేషను స్థాయిలో ఇంజనీరింగులో నాణ్యమైన విద్యను అందించే సంకల్పంతో భారత ప్రభుత్వం 1978 లో ఒక సమీక్షా సంఘాన్ని వేసినపుడు దానికి డా. యలవర్తి నాయుడమ్మను చైర్మనుగా నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకే నేటి ఇంజనీరింగ్ పట్టభద్రుల యోగ్యతా పరీక్ష (గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ - గేట్) పరీక్షను ప్రారంభించారు.

నాయుడమ్మ చేసిన సేవలకు గాను 1971లో 'పద్మశ్రీ' అవార్డు అందుకున్నారు. బరోడా విశ్వవిద్యాలయం డాక్టర్‌ కేజీ నాయక్‌ స్వర్ణ పథకాన్ని బహూకరించింది. 1981లో ప్రతిష్టాత్మక రాజ్యలక్ష్మీ ఫౌండేషన్‌ అవార్డును పొందారు. ఆంధ్ర, నాగార్జున, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి.

1985 జూన్ 23న. ఎయిర్ ఇండియా కనిష్క విమానం మోంట్రియల్ నుంచి లండన్ మీదుగా ఢిల్లీ చేరాల్సి ఉండగా ఐర్లాండ్ తీరాన అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయి, నాయుడమ్మ సహా ప్రయాణికులందరూ  అమరులయ్యారు. ‘చరిత్ర పుటల్లో అఖండ మేధో సంపత్తితో పాటు సమాజ శ్రేయస్సు పట్ల ఆసక్తి మేళవించి ఉండటం అరుదుగానే జరుగుతుంది. ఒకే వ్యక్తి శాస్త్రవేత్తే కాకుండా గొప్ప సంఘ సంస్కర్తగా ఉండటం అరుదుగా సంభవిస్తుంది. నాయుడమ్మ అలాంటి అరుదైన వ్యక్తి’ అని విద్యావేత్త మాల్కం ఆదిశేషయ్య  పేర్కొన్నారు. సాధారణ కుటుంబంలో జన్మించి దేశం గర్వపడే శాస్త్రవేత్తగా ఎదిగిన నాయుడమ్మ ఎందరికో ఆరద్శంగా నిలిచారు.

- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com