నక్క చెప్పిన ఉపాయం
- July 05, 2015
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలోకి వెళ్లాలంటే ఒక్కటే దారి. ఒక దట్టమైన అడవిని దాటిపోవాల్సిందే. ఆ అడవిలో భయంకరమైన సర్పాలు ఎక్కువగా ఉండేవి. ఒకరోజు ఆ ఊరికి సంబంధించిన బ్రాహ్మణ పండితుడు పొరుగూరు వెళ్లి పెళ్లి ముహూర్తాలు పెట్టి ఇంటికి తిరిగి వస్తుండగా మిట్టమద్యాహన్నం అయ్యింది. ఇప్పుడు ఆ అడవిని దాటుకుని తన ఊరు చేరుకోవాల్సి ఉంది. అయితే సూర్యుడు నడినెత్తిన ఎర్రగా కాల్చేస్తున్నాడు. చాలా వేడిగా ఉంది. ఆ దారిగుండా ఉన్న ఒక చిన్న గడ్డి పొదలో పొట్ట నిండా కప్పలను భుజించి ఒక నాగుపాము హాయిగా నిద్రపోతోంది. కదలలేని పరిస్థితిలో ఉంది. ఇంతలో ఎండ వేడికి ఆ పక్కనే ఉన్న ఎండుగడ్డి రాజుకుని మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ మంటలు మెల్లమెల్లగా ఆ పాము పడుకున్న పొదను కూడా చుట్టుముట్టడంతో అది మంటల్లో చిక్కుకుని బయటికి రాలేక ఎవరైనా సాయం చేస్తారని చూస్తోంది. ఇంతలో ఆ దారి గుండా వస్తున్న బ్రాహ్మణుడు కనిపించాడు. అయ్యా బ్రాహ్మణోత్తమా! నేను ఈ మంటల్లో చిక్కుకుని బయటికి రాలేక బాధపడుతున్నాను. దయచేసి నన్ను రక్షించవా? నీకు నేను ఏ హానీ తలపెట్టను అని వేడుకొనగా అందుకు ఆ బ్రాహ్మణుడు జాలిపడి తన చేతిలో ఉన్న సంచిని ఒక కర్రకి కట్టి ఆ కర్ర ఒక చివరను అతను పట్టుకొని, రెండవ చివరను మంటల్లో ఉన్న పాము వద్దకు వదిలాడు. దాంతో పాము చరచరా ఆ సంచిలోకి పాకింది. జాగ్రత్తగా ఆ పండితుడు దాన్ని బయటికి తీసాడు. బయటికి వచ్చిన పాము మీ మానవులను నమ్మరాదు. మీరు మాకు శత్రువులు అంటూ అతన్ని కాటేయ్యడానికి మీదకి వచ్చింది. దానికి ఆ బ్రాహ్మణుడు కోపంతో ఛీ.. నీచమైన నీ జన్మ. నీ బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు. పాపం అని సాయం చేసిన నన్ను చంపాలని చూస్తావా? నీకు పుట్టగతులుండవు. అని ప్రాణాలరచేత పట్టుకుని భయంతో పారిపోతున్నాడు. ఆ పాము అతన్ని వెంబడిస్తూనే ఉంది. ఇంతలో దారిలో ఒక నక్క కనిపించి ఎందుకలా పారిపోతున్నావు స్వామీ? అని అడగ్గా అతని ముఖంలోని భయాన్ని బట్టి వెనుక శత్రువేదో ఉందని తలంచి ఏమిటి కారణం అని అడుగగా..ఆ పాము మరింత కోపంతో బ్రాహ్మణుడి మీదకి బుసలు కొడుతూ రాసాగింది. అప్పుడు నక్క వారి మధ్యకు అడ్డంగా వచ్చి ఏం జరిగింది అని అడిగింది. ఎలాగైనా అతన్ని రక్షించాలని ఒక ఉపాయం ఆలోచించింది. బ్రాహ్మణుడు చేసిన సాయాన్ని, పాము చేసిన అన్యాయాన్ని తెలుసుకుని, ఈ పాముకి ఎలాగైనా అది చేసిన తప్పుకి తగిన శాస్తి చెయ్యాలని పాముతో సర్పరాజా నువ్వు అసలు ఆ బ్రాహ్మణుడి చేతి సంచిలో ఎలా దూరగలిగావు. ఆ సంచి చూస్తే ఆంత చిన్నది. నువ్వు చూస్తే ఇంత పొడుగున్నావు. లేదు లేదు నేను నమ్మను. నేను ఏదీ నా కళ్లతో చూస్తే గానీ నమ్మను అంది. అందుకు ఆ పాము కావాలంటే చూడు నేను ఎలా దూరానో చూపిస్తాను అని ఆ బ్రాహ్మణుడి చేతి సంచిని ముందుకు పెట్టమనగా ఆ పాము నక్క చూస్తుండగా మళ్లీ అందులోకి చరచరా పాకింది. ఇంతలో ఆ నక్క ఆ చేతి సంచి మూతిని తాడుతో గట్టిగా కట్టి మంటల్లోకి విసిరేసింది. దాంతో ఆ బ్రాహ్మణుడికి పాము బెడద తప్పినందుకు నక్కకు కృతజ్ఞత చెప్పి ఆక్కడ నుండి బయలుదేరాడు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









