కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్...!
- September 20, 2024ఆయన పుట్టిపెరిగింది సంపన్న కుటుంబంలో కాదు. ఉన్నత చదువులు చదువుకో లేదు. ఓ పూట తిండి కోసం కష్టాలు పడిన రోజులు కూడా ఆయన జీవితంలో ఉన్నాయి. అలాంటి ఓ పేద రైతుబిడ్డ తెలుగు చలనచిత్ర చరిత్రకు మూలస్థంభంగా ఎదగడానికి ఎన్నో ఆటంకాలు దాటారు. నాటక రంగం నుండి సినిమాల వైపు వచ్చి తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. చిన్ననాటి నుంచి క్రమశిక్షణ, పట్టుదల, స్వయంకృషితోనే తెలుగు తెర మీద స్టార్ హీరోగా ఎదిగారు ఏఎన్నార్. నేడు నటసామ్రాట్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి.
ఏఎన్నార్ గా సుపరిచితులైన అక్కినేని నాగేశ్వరరావు 1924, సెప్టెంబర్ 20న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం దగ్గర్లోని రామాపురం(వెంకట రాఘవాపురం) గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. అక్కినేని చిన్నతనంలోనే తండ్రి మరణించడం, పెద్దన్నలు ఆస్తులు పంచుకొని వేరు పడటంతో చదువుకునేందుకు స్థోమత లేక తన వాటాగా వచ్చిన కొద్దిపాటి భూమిలోనే వ్యవసాయం చేస్తూ, సాయంకాలం పూట ఊళ్ళో జరిగే భజనలు, నాటకాలు చూస్తూ పెరిగారు. పెరిగేకొద్దీ నాటకాల మీద ఆసక్తి పెరగడంతో 10వ యేట రంగస్థల ప్రవేశం చేశారు.
నాటకాల్లో అక్కినేని వారిని స్త్రీ పాత్రలే ధరించేవారు. అందుకు కారణం, వారి తల్లిగారు ఆడపిల్ల లేని లోటును తీర్చుకునేందుకు తమ ఆఖరి సంతానమైన అక్కినేని వారిని ఆడపిల్లగా అలంకరణ చేసి ముచ్చట తీర్చుకునేవారు. అలా, వారిలో స్త్రీ రూప లావణ్యం పెంపొందింది. నాటకాల్లో సైతం అదే పాత్రలను పోషించడం మూలాన వారిలో ఆ పాత్ర లక్షణాలు హెచ్చాయి. సినిమాల్లో అడుగుపెట్టిన ఆ లక్షణాలు తన నటన మీద ప్రభావం పడకుండా శ్రమించి తనను తాను నటుడిగా తీర్చిదిద్దుకున్నారు. ప్రజానాట్య మండలి నాటకాల్లో సైతం అక్కినేని వారు నటించారు. అక్కడ పరిచయం అయిన దుక్కిపాటి మధుసూదన్ రావు ద్వారా అక్కినేని జీవితం మలుపు తిరిగింది.
దుక్కిపాటి వారి మార్గదర్శనంలో అక్కినేని వారు నటనలో సంపూర్ణత సాధించారు. అప్పటి వరకు గుడివాడ తాలూకా ప్రాంతాల్లో నాటకాలు వేస్తూ వచ్చిన అక్కినేని, దుక్కిపాటి ప్రోత్సాహంతో బెజవాడ(నేటి విజయవాడ), ఏలూరు వంటి సుదూర ప్రాంతాల్లో సైతం నాటక ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు. ఒక నాడు బెజవాడ రైల్వే స్టేషన్లో ఆనాటి ప్రముఖ సినీ నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు అక్కినేని చూసి వారితో పాటు ఉన్న దుక్కిపాటి వారితో మాటలు కలిపి, తాను నూతన నటీనటులతో తీయబోయే చిత్రంలో అక్కినేనిని సినీ రంగానికి పరిచయం చేస్తానని కోరగానే, అక్కినేని శ్రేయోభిలాషి అయిన దుక్కిపాటి వారు సరేనన్నారు.
ఘంటసాల వారి ద్వారా మద్రాస్ వచ్చినప్పటికి ఆయన తోలి చిత్రం మాత్రం వాహిని వారి ధర్మపత్ని. పదిహేడేళ్ల కౌమారప్రాయంలో 1941లో విడుదలయిన ధర్మపత్ని అనే సినిమాద్వారా రంగప్రవేశం చేసినా, ఆ తరువాత ఏడెనిమిదేళ్ళకు విడుదల అయిన కీలుగుఱ్ఱం, బాలరాజు అనే సినిమాలతో స్టార్ డమ్ సాధించారు.ఇక అప్పటినుంచి ఆయనకు తిరుగే లేకుండా పోయింది. ఆయన సినిమా జీవితం మరణించేంతవరకు కొనసాగుతూనే ఉన్నది.
తెలుగువారి నవలానాయకుడు ఎవరంటే ముందుగా వినిపించే పేరు అక్కినేనిదే. తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ నవలల ఆధారంగా తెరకెక్కిన అనేక తెలుగు చిత్రాల్లో అక్కినేని కథానాయకునిగా నటించి మురిపించారు. ఆ స్థాయిలో నవలానాయకునిగా అలరించిన నటుడు తెలుగునాట మరొకరు కనిపించరు. ఇక ఏయన్నార్ పేరు వినగానే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది ‘దేవదాసు’ చిత్రమే. ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రాసిన ‘దేవదాసు’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో అక్కినేని అభినయం ఆయనను జనం మదిలో ‘ట్రాజెడీ కింగ్’గా నిలిపింది. ఆ తరువాత మరెన్నో నవలల ఆధారంగా రూపొందిన చిత్రాల్లోనూ అక్కినేని అభినయం అభిమానులను ఎంతగానో అలరించింది.
నిజానికి సుఖాంత ప్రేమకథలకే జనం బ్రహ్మరథం పడతారు. అందులోని అభినయమూర్తుల నటననూ శ్లాఘిస్తారు. కానీ, విషాదాంత ప్రేమకథలను చూసి కన్నీరు కారుస్తారే తప్ప, అభినందించి, జేజేలు పలుకరు. అయితే అక్కినేని అభినయ ఫలితంగా విషాదాంత ప్రేమకథలు సైతం తెలుగునాట విజయం సాధించాయి. ఆయన నటజీవితంలోనే అద్భుత విజయం సాధించిన చిత్రంగా నిలచిన ‘ప్రేమాభిషేకం’ విషాదాంతమే. ఈ చిత్రం ప్లాటినమ్ జూబ్లీ (75 వారాలు) చూసిన తొలి తెలుగు చిత్రంగా నిలచిపోయింది.
అక్కినేని ఆరంభంలో జానపద నాయకునిగా రాణించారు. నటరత్న ఎన్టీఆర్ ఆగమనంతో జానపద నాయకుడంటే ఎన్టీఆరే అన్నపేరు లభించింది. నెమ్మదిగా సాంఘికాలవైపు మరలారు. అప్పుడే ఆయనకు ‘దేవదాసు’ వంటి ఛాలెంజింగ్ రోల్ తారసపడింది. జానపద చిత్రాల్లో నటించే అక్కినేని ‘దేవదాసు’గా అలరించలేడని ఎందరో విమర్శించారు. ఆ విమర్శలను సవాల్ గా తీసుకొని ‘దేవదాసు’ పాత్రలో జీవించారు ఏయన్నార్. ‘దేవదాసు’ గా నటించిన ట్రాజెడీ కింగ్ అనిపించుకున్న ఏఎన్నార్, ఆ ముద్రనుండి బయట పడటానికి ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘మిస్సమ్మ’లో కామెడీ రోల్ చేశారు.
నిజజీవితంలో విగ్రహారాధన అంటే గిట్టని అక్కినేని తెరపై ‘విప్రనారాయణ’గానూ అలరించారు. పెద్దగా చదువుకోని నాగేశ్వరరావు అనేక చిత్రాల్లో విద్యాధికునిగా నటించి మెప్పించారు. ఇలా తన నటజీవితంలో ఎదురైన సవాళ్ళను అక్కినేని ఎదుర్కొని గెలిచారు, చిత్రసీమలో ఎంతో కాలం నిలిచారు. “స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య” అన్నారు మీర్జా గాలిబ్. ఆ వాక్యాన్ని ఏఎన్నార్ ఎంతగానో అభిమానించారు. తనలోని లోపాలేంటో తెలుసుకున్నారు. వాటిని తన కెరీర్ కు అనువుగా మలచుకున్నారు.ఒకవేళ పౌరాణిక, జానపద, చారిత్రకాల్లో నటించే అవకాశం వచ్చినా, వాటిలో తనకు సరిపోయే పాత్రలయితేనే అంగీకరించేవారు. ఎదురుగా ఎంతోమంది మేటి నటులు ఉన్నా, అక్కినేని ఎంతో కాలం చిత్రసీమలో రాణించగలగడానికి మీర్జా గాలిబ్ చెప్పిన మాటను పాటించడమే కారణం. అదే విషయాన్ని ఏఎన్నార్ ఎన్నో వేదికలపై సగర్వంగా చెప్పుకున్నారు.
విమర్శలు ఎదురైన ప్రతీసారి పనితోనే సమాధానమిచ్చారు అక్కినేని. తనకెదురైన ప్రతీ సవాల్‌ను స్వీకరించారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించుకున్నారు. తనకంటూ ప్రత్యేకమైన ఓ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే ఏఎన్నార్ కు ఏఎన్నారే సాటి. తెలుగు తెరకు స్టెప్పులు పరిచయం చేసిన కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. ఇప్పుడు చూస్తున్న బ్రేక్ డాన్సులు, షేక్‌డాన్సులు రావడానికి కారణం అక్కినేని. హీరో అనేవాడు స్టెప్పులేయాలని చూపించిన స్టైలిష్ హీరో ఏఎన్నార్. ఇవన్నీ ఆయన్ని "కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్" గా మార్చాయి.
1960ల వరకు దక్షిణభారతదేశ సినిమారంగానికి పట్టుగొమ్మగా నిలిచిన మద్రాసును విడిచిపెట్టి వదిలిపెట్టి హైదరాబాద్ లో నివాసాన్ని ఏర్పరచుకుని, తనతో సినిమాలు తీయాలంటే హైదరాబాద్ వచ్చి తియ్యాలని నిర్మాతలను కోరారు. అక్కినేనిని వదులుకోలేని రామానాయుడు, వి.బి.రాజేంద్ర ప్రసాద్, ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనుమోలు వెంకట సుబ్బారావు లాంటి నిర్మాతలు హైద్రాబాద్ లోనే అక్కినేనితో సినిమాలు తీశారు. ఆయన హైదరాబాద్ తరలిన వేళావిశేషం ఏమిటో కానీ, సినిమా రంగం మొత్తం హైదరాబాద్ లోనే స్థిరపడింది. జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డి లాంటి ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో బంజారాహిల్స్ లాంటి ఎత్తైన ప్రదేశంలో ఎంతో శ్రమకోర్చి అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించారు. ఉత్తమాభిరుచి కలిగిన నిర్మాతగా మరో ప్రపంచం, సుడిగుండాలు వంటి కళాత్మక సినిమాలను నిర్మించారు.
మూకీ చిత్రాలప్పుడే ఏఎన్నార్ సినీ ప్రయాణం మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమ తొలితరం సూపర్ స్టార్స్ ఎంతోమందికి సాధ్యం కాని చరిత్ర అక్కినేని సొంతం. మూకీతో మొదలై టాకీని ముందుకు నడిపించారు అక్కినేని. తెలుగు సినీపరిశ్రమ దాటిన ప్రతీ మలుపును దగ్గర్నుంచి చూసిన వ్యక్తి అక్కినేని. మూకీ, టాకీ, కలర్, సౌండ్, 70 ఎంఎం, డిటీఎస్, ఐమాక్స్, 3డి ఇలా సినిమా రంగంలో ఇన్ని కోణాల్ని.. ఇంత అభివృద్ధిని చూసిన వ్యక్తి ప్రపంచంలో అక్కినేని తప్ప మరో నటుడు లేరు.
తన సినిమా జీవితంలో సుమారు 225 సినిమాల్లో నటించిన అక్కినేని సినిమారంగానికి సంబంధించి అన్ని పురస్కారాలను పొందారు. పద్మ పురస్కారాలు అన్నీ దక్కాయి. తెలుగునాట ‘పద్మవిభూషణ్’ అందుకున్న తొలి నటుడు కూడా ఆయనే. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా వరించింది. ఒక్క భారతరత్న మాత్రమే ఆయనను వరించలేదు. ఎన్ని అవార్డులు లభించినా ప్రేక్షకులు ఆయనకు అభిమానంతో అందించిన “నటసామ్రాట్” బిరుదు ఆయనకు ఎంతో ఇష్టం. ఆయనకు లభించిన సన్మానాలు, సత్కారాలు మరెవ్వరికీ లభించలేదేమో? ఒక దశలో సన్మానం అంటూ తన దగ్గరకు ఎవ్వరూ రావొద్దని సున్నితంగా సంస్థలను హెచ్చరించేవారు.
ఎన్నెన్నో సాంస్కృతిక సంస్థలతో ఆయనకు అనుబంధం ఉన్నది. నెలకు పదిసార్లైనా హైదరాబాద్ లోని రవీంద్ర భారతి, త్యాగరాయగానసభల్లో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేవారు. సాహిత్యసభలకు కూడా హాజరై ఉపన్యసించేవారు.తనకు విద్యాగంధం అబ్బలేదనే బాధతో ఆయన విశ్వవిద్యాలయాలకు అరవై అయిదేళ్ల క్రితమే భూరి విరాళాలను అందించారు. గుడివాడలో ఏఎన్నార్ కాలేజ్ స్థాపనకు విరాళం ఇచ్చారు.
ఎప్పుడూ మోముపై చెరగని చిరునవ్వు.. ఇదే అక్కినేని ఆరోగ్య రహస్యం. అందరికీ చెప్పిన జీవిత సూత్రం. మనిషికి సంతోషానికి మించిన మందు లేదని నిరూపించిన మహా మనిషి అక్కినేని. కోపం ఆయన దరికి చేరదు.. అసహనం ఆయన్ను చేరడానికి ఆలోచిస్తుంది. ప్రశాంతతకు ప్రతిబింబం అక్కినేని రూపం.. అక్కినేని చదివింది ఐదో తరగతి అయినా తెలుగు, ఆంగ్ల భాషల మీద మంచి పట్టును సాధించారు. ఆంగ్లంలో కూడా అనర్గళంగా ప్రసంగించేవారు. తెలుగునాట భారీ సంఖ్యలో అభిమాన సంఘాలు కలిగిన తోలి నటుడు కూడా ఆయనే.
కష్టాల్లోనే సుఖాలను వెతుక్కునేవాళ్లే మహానుభావులు. ఇందులో అక్కినేని ముందు వరసలో ఉంటారు. సవాల్‌ను స్వీకరించడం అంటే అక్కినేనికి మహా ఇష్టం. అందుకే నీవిక నటించలేవంటూ 40 ఏళ్ల క్రితం గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్లు చెప్పినా.. ఆ సవాల్‌ను స్వీకరించి అధిగమించారు అక్కినేని. గుండె ఆపరేషన్ తర్వాత ఇన్నేళ్ళు బతికిన మనిషి ప్రపంచంలో అక్కినేని మాత్రమే అంటే ఆయన నిబద్ధత ఎలాంటిదో అర్థమవుతుంది.
నాగేశ్వరరావు అంటే అదృష్టం కాదు.. అంగబలం కాదు.. అర్ధబలం కాదు.. నాగేశ్వర రావు అంటే దీక్ష, కృషి, క్రమశిక్షణ. నాగేశ్వరరావు నటుడిగా పుట్టలేదు. నటుడు కావాలనుకున్నాడు. శరీరాన్ని, మనసును, అలవాట్లను, అభిరుచులను, ఆశలను, ఆకర్ణణలను అదుపులో పెట్టుకుని లక్ష్యానికి తగ్గట్లుగా తీర్చిదిద్దుకుని నటుడయ్యాడు. 9 దశబ్దాల తెలుగు సినీ చరిత్రలో బహుదూరపు బాటసారి అక్కినేని. నటనలో 75 ఏళ్ల వజ్రోత్సవాలు జరుపుకున్న అతికొద్ది మంది నటుల్లో అక్కినేని ఒకరు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో అక్కినేని ఓ శకం. అతడి గురించి రాయడానికి పేజీలు కాదు.. గ్రంథాలు కావాలి. తెలుగు సినిమా ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వరరావు అభినయాన్ని స్మరించుకుంటూ ఉండవలసిందే!
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్