వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు....

- September 20, 2024 , by Maagulf
వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు....

ఆయన చిత్రాల్లో ప్రకృతి పరిమళిస్తుంది. గోదారి నాగరికత ప్రతిబింబిస్తుంది. అణువణువు నవ్యతకు అన్వేషణ. నవరసాల మేళన.. నదీమతల్లి లాలన. ఆ హృదయం గోదావరి గోపిక వెండితెర వెలుగు దీపిక. ఇంతకీ ఈ పరిచయం ఎవరి గురించో మీకు అర్థం అయిపోయుండాలిగా.. ఆయనే వైవిధ్య చిత్రాల దర్శకుడు వంశీ.నేడు సీనియర్ డైరెక్టర్ వంశీ జన్మదినం సందర్భంగా వారి సినీ ప్రస్థానం గురించి మీకోసం..

 వంశీ అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి. 1956,నవంబరు 20న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం పట్టణానికి దగ్గరలోని  పసలపూడి గ్రామంలో జన్మించారు. కుటుంబ పరిస్థితుల కారణంగా వంశీ హై స్కూల్ విద్యతోనే ఆపేశారు. ఉన్నత చదువులు చదవకపోయినా తమ ఊర్లోని గ్రంథాలయంలో చదివిన పుస్తకాలు, తన చుట్టూ జరిగిన సంఘటనలు ఆయన్ని రచయితగా అయ్యేందుకు దోహదపడ్డాయి. 15వ యేట రాసిన "సత్య సుందరి నవ్వింది" కథ ఆలిండియా రేడియా పోటీల్లో విజయం సాధించింది. ఆ ఉత్సాహంతో యదార్థ కథా వస్తువులను తీసుకోని రాసిన "మంచుపల్లకి", "కర్మసాక్షి" నవలలు ఆంధ్రజ్యోతి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.

వంశీలోని ప్రతిభను గుర్తించిన ఒక ప్రముఖుడు, చెన్నై నగరానికి తీసుకెళ్లి టెంపరరీ ఉద్యోగం ఇచ్చారు. అయితే, సినిమాల మీద ఆసక్తి ఉన్న వంశీ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కొత్తవారిని పరిచయం చేసే దర్శకులు విక్టరీ మధుసూదన్ రావు గారి వద్ద సహాయ దర్శకుడిగా చేరారు. ఆయన వద్ద దర్శకత్వంలో మెళుకువలు నేర్చుకున్న తర్వాత కళాతపస్వి విశ్వనాథ్ వద్ద శంకరాభరణం చిత్రానికి పనిచేశారు. చివరిగా తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన సీతాకోకచిలుక చిత్రానికి పనిచేశారు.

1982లో వంశీ తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన చిత్రం మంచుపల్లకీ. 1982 నవంబర్ 19న విడుదలైన "మంచుపల్లకీ" యువత మదిని దోచింది. ఈ చిత్రానికి తమిళంలో రూపొంది ఘనవిజయం సాధించిన "పాలైవాన సోలై" చిత్రం ఆధారం. తమిళంలో తాను పోషించిన పాత్రనే తెలుగులో సుహాసిని ధరించారు.1984లో తనకు ఆత్మీయులైన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారి సారథ్యంలో  తెరకెక్కించిన "సితార"తో విజయం సాధించారు. ఆయన రాసిన మహల్లో కోకిల అనే నవలను కొద్దిపాటి మార్పులతో ఈ చిత్రాన్ని తీశారు. సితార చిత్రంతోనే సీనియర్ హీరోయిన్ భానుప్రియ పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి.

1985లో వంశీ తెరకెక్కించిన అన్వేషణ, ప్రేమించు పెళ్లాడు, ఆలాపన చిత్రాలు కల్ట్ క్లాసిక్స్. 1986లో లేడీస్ టైలర్ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని హీరోగా నిలబెట్టింది. 1987లో వచ్చిన మహర్షి, లాయర్ సుహాసిని వంటి చిత్రాలు కూడా ఆదరణ పొందాయి. ఆ తర్వాత వచ్చిన "శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్", "చెట్టు కింద ప్లీడర్", "ఏప్రిల్ 1 విడుదల", "జోకర్", "ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు", "గోపి గోపిక గోదావరి" చిత్రాలు వంశీ దర్శకత్వంలో అద్భుతమైన చిత్రాలు.

వంశీ చిత్రాలంటే ముందుగా గుర్తొచ్చేది సంగీతం. సినిమాలు ఫ్లాపైన పాటలు మాత్రం 80,90వ దశకంలో యువతను ఊర్రుతలుగించింది. మొదట్లో కె.వి.మహదేవన్, ఆ తర్వాత ఇళయరాజా, చక్రిలు ఆయన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఒకానొక దశలో ఆయనే సంగీత దర్శకుడిగా మారి "శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్", "స్వరకల్పన", "డిటెక్టివ్ నారద" మరియు "అనుమానాస్పదం" సినిమాలకు సంగీతం అందించారు.  

వంశీ సినిమాలతో పాటుగా రచయితగా రాణించారు. ఆయన సినిమాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా అనేక కథలు, నవలలు రాశారు. ఆయన రాసిన మంచు పల్లకి, వెన్నెల బొమ్మ,ఆనాటి వాన చినుకులు, రవ్వలకొండ, గాలికొండాపురం రైల్వే గేట్, మా పసలపూడి కథలు, మా దిగువ గోదావరి కథలు, ఆకుపచ్చని జ్ఞాపకం, వంశీకి నచ్చిన కథలు, నల్లమిల్లోరిపాలెం కథలు, పొలమారిన జ్ఞాపకాలు వంటివి  పాఠకుల ఆదరణ పొందాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో జరిగిన సంఘటనల మూలాధారంగా ఆయన రచనలు సాగాయి.    

 యదార్థ సంఘటనలను తన సినిమాలకు కథా రూపంగా తీసుకుంటారు. తేనె తెలుగులో ముంచి, పల్లె సీమల ఆత్మీయతలను పట్టితెచ్చి.. వెండితెరపై దృశ్యకావ్యాలు విరచించిన విపంచి ఆయన... పాపికొండల బోటు, ఆత్రేయపురం పూతరేకు, ఆర్టోసు కూల్ డ్రింకు, కథానాయకి కట్టుబొట్టులో ఆత్మవిశ్వాసం, కడియం పూలబుట్ట, మాఘమాసంలో నారింజ పరిమళం ఆయన ట్రేడ్‌మార్కులు.ఆయన కావ్యనాయిక సినీ కథానాయక. తళుకులీనే తటిల్లత, వెండితెర విద్యుల్లత. పల్లెదనానికి, పచ్చదనానికి నెచ్చెలి. వంశీ చిత్రాల ద్వారా రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, భానుమతి స్టార్ డమ్ అందుకున్నారు. తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్, కొండవలస, మల్లిఖార్జునరావు, రాళ్ళపల్లి, ఎంఎస్ నారాయణ వంటి హాస్య నటులు తెలుగు తెర మీద కనువిందు చేశారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com