అనుపమాన చిత్రాల తిలక్‌

- September 23, 2024 , by Maagulf
అనుపమాన చిత్రాల తిలక్‌

ఆయన నిర్మించిన సినిమాలు తక్కువే. దర్శకత్వం వహించిన సినిమాల సంఖ్య కూడా పరిమితమే. కానీ సినిమా నిర్మాణంలో ఒక ‘ట్రెండ్’ను సృష్టించిన దర్శక నిర్మాతగా గణుతికెక్కారు.విలువలను వీడకుండా ఓ సంకల్పంతో సినిమాలు తెరకెక్కించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో బాలగంగాధర తిలక్ ఒకరు. ఇలా అంటే ఎవరికీ తెలియదు కానీ, కె.బి.తిలక్ అనగానే సినీ అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలని తపించేవారు తిలక్. ఆ తపనే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. నేడు ప్రముఖ నిర్మాత కె.బి.తిలక్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని గురించి కొన్ని విశేషాలు.  

కె.బి.తిలక్ పూర్తి పేరు కొల్లిపర బాలగంగాధర్ తిలక్. 1926, జనవరి 14న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్వయాన అక్క కుమారుడే తిలక్. వీరి అక్కనే మళ్ళీ ఎల్వీ ప్రసాద్ వివాహమాడారు. అలా ఎల్వీ ప్రసాద్, తిలక్ కు మేనమామ, బావ కూడా అవుతారు. తిలక్ తండ్రి వెంకటాద్రి గారు పెద్ద రైతుగానూ, స్వాతంత్య్ర సమర యోధునిగానూ మంచి  పలుకుబడిని కలిగి ఉండేవారు. తండ్రి స్పూర్తితో 1939-47 వరకు స్వాతంత్య్ర సంగ్రామంలో తిలక్ చురుగ్గా పాల్గొన్నారు.

1942 నాటి ‘క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొని  జైలు కెళ్లారు. జైలు నుండి విడుదలయింతర్వాత, జేబులో చిల్లిగవ్వ కూడా లేని తిలక్, కాలినడకన తన స్వగ్రామమైన దెందులూరు వెళ్లారు. రంగస్థల నటుడు ముదిగొండ జగ్గన్న శాస్త్రి ప్రోద్బలంతో, సహకారంతో, ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితుడైన శ్రీతిలక్ అతివాద పంథా కళాకారుల ఉద్యమాలతో చేతులు కలిపారు.నాటకాలు వేయటం, వేయించటంతోపాటు, డప్పులు మ్రోగించుతూ ప్రజానాట్య మండలి విప్లవ గీతాలను ఆలపించుతూ గ్రామగ్రామాన తిరిగేవారు. పశ్చిమ గోదావరి కమ్యూనిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలోనే పోలీసుల నిఘా అధికంగా ఉండటంతో బొంబాయిలో ఉంటున్న తన బావ గారైన ఎల్.వి.ప్రసాద్ వద్దకు చేరుకున్నారు. ప్రసాద్ స్ఫూర్తితోనే తిలక్ చిత్రసీమలో అడుగు పెట్టారు.

ఎల్.వి.ప్రసాద్ వద్ద కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన తిలక్, 1956లో ‘ముద్దుబిడ్డ’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జగ్గయ్య, జమున నటించిన ఈ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. అప్పటికే యన్టీఆర్, ఏయన్నార్ టాప్ హీరోస్ గా సాగుతున్నందున్న తిలక్, తన మిత్రుడు జగ్గయ్యతోనే సినిమాలు తీస్తూ ఆయననూ ఓ ప్రముఖ కథానాయకునిగా నిలిపారు. జగ్గయ్య, సావిత్రితో తరువాత తిలక్ తీసిన ‘ఎమ్.ఎల్.ఏ.’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. ‘అత్తా ఒకింటి కోడలే’ చిత్రాన్ని తమిళంలోనూ ‘మామియరుమ్ ఒరు వీట్టు మరుమగలే’ రూపొందించి, రెండు చోట్లా ఆదరణ సంపాదించారు. జగ్గయ్య హీరోగా, ఆరుద్ర రచన, పెండ్యాల సంగీతంతో సాగారు తిలక్. “ఈడు-జోడు, ఉయ్యాల-జంపాల, పంతాలు – పట్టింపులు” వంటి చిత్రాలు తెరకెక్కించారు. “ఛోటీ బహు, కంగన్” వంటి హిందీ చిత్రాలనూ రూపొందించారు.

తిలక్ రూపొందించిన ‘భూమికోసం’ చిత్రంతోనే జయప్రద పరిచయమయ్యారు. కృష్ణ, ప్రభ జంటగా తిలక్ తెరకెక్కించిన ‘కొల్లేటి కాపురం’ కూడా అలరించింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘ధర్మవడ్డీ’. సినిమా రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు, అన్నిటా పెరిగిపోయిన వేగం ఆయనకు నచ్చలేదు. దాంతో 1982 తరువాత నుంచీ సినిమాలకు దూరంగా ఉన్నారాయన. “సినిమాను ఒక శక్తివంతమైన సాధనంగా చూశానే కాని, వ్యాపారాత్మకంగా చూడలేదు. అందుచేతే ఎక్కువ సినిమాలు నేను తీయలేదు” అని ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తిలక్ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాల్సినవే!  

సినిమా అనే శక్తివంతమైన మాధ్యమం ద్వారా మానవాభ్యుదయానికి, సంఘ సంస్కరణకు, సమాజ ప్రగతికి పాల్పడవచ్చుననే ఆశయాన్ని నమ్మి ఆ దిశగా అడుగులేసిన అతికొద్ది నిర్మాతల్లో తిలక్ ముఖ్యులు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తిలక్ చేసిన సేవలను గుర్తిస్తూ 2008లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిలక్ ను బి.యన్.రెడ్డి జాతీయ అవార్డుతో గౌరవించింది. 2010 సెప్టెంబర్ 23న తిలక్ కన్నుమూశారు. ఈ నాటికీ తిలక్ చిత్రాల్లోని కథావస్తువును, సంగీత సాహిత్యాలను అప్పటి సినీ ఫ్యాన్స్ నెమరువేసుకుంటూనే ఉన్నారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com