రాయలసీమ గళం..!

- September 23, 2024 , by Maagulf
రాయలసీమ గళం..!

మనిషికి చాలా డిగ్రీలు ఉండవచ్చు.కానీ సమాజం అతణ్ని గుర్తించేందుకు ఆ డిగ్రీలేవీ ఉపయోగపడవు. అతని ప్రవృత్తి ఏమిటన్న దాంతోనే సమాజం అతణ్ని పిలుస్తుంది. అలా సమాజం గుర్తుంచుకునేందుకు చాలా విశేషణాలే వదిలి వెళ్లారు రాయలసీమ తొలితరం కథకుల్లో ప్రముఖుడు, స్వాతంత్య్ర సమరయోధులు గుత్తి రామకృష్ణ. విద్యార్థిదశలోనే జాతీయోద్యమంలో పాల్గొని హరిజనోద్ధరణ, సంఘ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతి కోసం తుదిశ్వాస వరకు కృషి చేసిన ఆదర్శ ధ్రువతార రామకృష్ణ.

గుత్తి రామకృష్ణ ఆనాటి ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లో భాగమైన అనంతపురం పట్టణం పాతూరులోని అంబారపువీధిలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన  గుత్తి వెంకటప్ప, నారాయణమ్మ దంపతులకు జన్మించారు.వీరి చిన్నతనంలోనే తండ్రి వెంకటప్ప సన్యాసం స్వీకరించి ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ హంపిలో మరణించారు.అప్పటికి రామకృష్ణ వయసు 3 సంవత్సరాలు మాత్రమే. తండ్రి మరణంతో ఆయన తన మేనమామ వెంకటరమణప్ప వద్ద పెరిగారు. రామకృష్ణ ప్రాథమిక విద్యాభ్యాసం నగరంలోని మున్సిపల్‌ స్కూల్‌లో సాగింది. చదువుకునే రోజుల్లో రామ కృష్ణ తరగతి పుస్తకాలకంటే బయటి పుస్తకాలనే ఎక్కువగా చదివేవారు.

అనంతపురం కాలేజీలో దఫేదారుగా పనిచేసిన ఇతని మేనమామ రామకృష్ణకు లైబ్రరీ నుంచి మంచి పుస్తకాలు తెచ్చిచ్చేవారు. హైస్కూల్‌ చదివే రోజుల్లోనే సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు గారి సమగ్ర రచనలు చదివారు. రామకృష్ణకు చిన్ననాటి నుంచే ఆంగ్లేయులంటే ద్వేష భావం ఉండేది. అందుకే ఈయన ఇంగ్లీష్‌ భాషపట్ల కూడా ద్వేషభావంతో ఆ సబ్జెక్టును చదివేవారు కాదు. ఫలితంగా ఎస్‌ఎల్‌సీ పరీక్షలో ఇంగ్లీషు తప్పారు. మేనమామ సహాయంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో నెలకు రూ.8ల ఉపకార వేతనంతో ఉన్నత విద్యను పూర్తిచేశారు.

ఆనాడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉదృతంగా సాగుతున్న స్వాతంత్య్ర పోరాటంలో రామకృష్ణ సైతం విద్యార్థిగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీజీ సిద్ధాంతాల పట్ల మక్కువ ఏర్పడింది. చదువుకునే రోజుల్లోనే అనంతపురం తిరిగి వచ్చిన రామకృష్ణకు, నగరంలో స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఐదుకల్లు సదాశివన్ గారితో పరిచయం ఏర్పడింది. సదాశివన్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం ప్రారంభించారు. గాంధీజీ స్పూర్తితో హరిజనోద్ధరణలో భాగంగా హరిజన హాస్టల్ నిర్వహణకు పూనుకున్నారు. సదాశివన్ ప్రోత్సాహంతో  రైతు బాంధవుడు, ఆచార్య ఎన్.జి.రంగా గారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విశ్వవిద్యాలయం వేసవి రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.

ప్రముఖ గాంధేయవాది ఎర్రమల కొండప్ప అనంతరపురంలో తనకున్న రెండు ఎకరాల స్థలాన్ని హాస్టల్ నిర్మాణం కోసం దానం చేయగా, దాతల సహకారంతో రామకృష్ణ, సదాశివన్ హాస్టల్ ఏర్పాటు చేశారు.ఉన్నత చదువుల కోసం అనంతపురం వచ్చే హరిజన విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. రామకృష్ణ హాస్టల్ వార్డెన్ బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా నడిపించారు. నేటికి ఆ హాస్టల్ విజయవంతంగా నడుస్తూ ఎందరో హరిజన విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ ఉండటం విశేషం.  

సదాశివన్ ద్వారా ఆనాటి అనంతపురం కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతలైనఎర్రమల కొండప్ప,కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులు గార్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ అనుబంధ విభాగమైన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న యువ నేతలు  తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి, ఐదుకల్లు సదాశివన్ గార్ల ప్రభావం రామకృష్ణ మీద అధికంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీలో మితవాద వైఖరిని విమర్శిస్తూ వీరందరూ కమ్యూనిస్టు పార్టీలో చేరారు.  అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ అరెస్ట్ అయ్యి  బళ్ళారి, అల్లీపురం జైళ్లలో ఏడాది అనుభవించారు రామకృష్ణ. విడుదలైన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు.

కమ్యూనిస్టు రాజకీయాలనుండి తప్పించాలనే ఉద్దేశంతో రామకృష్ణ బంధువులు ఆయన్ని 1943లో ఉల్లిగడ్డల (ఉల్లిపాయలు) వ్యాపారం నెపంతో సిలోన్ (శ్రీలంక) పంపించారు. ఆరోజుల్లో అనంతపురం జిల్లాలో ఉల్లిగడ్డలను విస్తారంగా పండించేవారు. వాటికి శ్రీలంకలో మంచి గిరాకీ ఉండడంతో ఆ దేశ రాజధాని కొలంబోలో ఉంటూ అనంతపురం నుంచి తెప్పించిన ఉల్లిగడ్డలతో హోల్ సెల్ వ్యాపారాన్ని రామకృష్ణ నిర్వహించారు. కొలంబోలో ములాస్‌ అనే వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారికి మిలటరీ కాంట్రాక్టు ఉండేది. ఆయనతో ఏర్పడ్డ పరిచయం రామకృష్ణ వ్యాపారానికి మరింత ఊపు వచ్చింది. కొలంబోలో సైతం కమ్యూనిస్టు పార్టీ నాయకులతో సంబంధాలు పెట్టుకొని అక్కడి పోలీసుల కంట్లో పడటంతో, వ్యాపారానికి స్వస్తి చెప్పి ఇండియా వెళ్లిపోతున్న సమయంలో తన స్నేహితుడైన ములాస్‌ అభ్యర్థన మేరకు అతని తరుపున కమిషన్ ఏజెంటుగా ఉంటూ అనంతపురం నుంచి కొలంబోకు ఉల్లిగడ్డల ఎగుమతి వ్యాపారం నిర్వహించారు. వ్యాపారంలో వచ్చిన లాభాలను సైతం కమ్యూనిస్టు పార్టీకి విరాళంగా ఇస్తూ వచ్చారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో కమ్యూనిస్టు పార్టీ మీదున్న నిషేధం కారణంగా, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాహిత్యాన్ని ప్రచారం సాధనంగా వాడాలని కమ్యూనిస్టు నేతలు నిర్ణయించారు. అనంతపురంలో సైతం ఈ సాహిత్యాన్ని విక్రయించేందుకు ఒక పుస్తకాల షాప్ ఏర్పాటు బాధ్యతను రామకృష్ణ భుజాన వేసుకున్నారు. ఉల్లిగడ్డల వ్యాపారంలో ఉంటూనే, అనంతపురంలో  కృష్ణా బుక్‌స్టాల్‌ను ప్రారంభించారు. అయితే సంవత్సరం తిరగకముందే పోలీసులు కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లో ఉన్నాడనే నెపంతో  రామకృష్ణను నిర్బంధించి ఖైదీగా కడలూరు జైలుకు పంపడంతో బుక్‌స్టాల్‌ మూతపడింది.

1952లో జైలు నుంచి విడుదలైన తర్వాత కృష్ణా బుక్‌స్టాల్‌ను తిరిగి పార్రంభించారు. కమ్యూనిస్టు పుస్తకాలతో పాటు ఇతర సాహిత్య పుస్తకాలు, వేదాలు, పురాణాలు, తదితర పుస్తకాలను ఇక్కడ విక్రయించేవారు. 15 ఏళ్లపాటు ఈ బుక్‌స్టాల్‌ బాగా నడిచింది. ఆరోజుల్లో కృష్ణా బుక్‌స్టాల్‌ కమ్యూనిస్టు పార్టీకి సమన్వయ కేంద్రంగా ఉండేది. వామపక్ష నాయకులైన తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖర్‌రెడ్డి, నీలం రామసుబ్బారెడ్డి తదితర నాయకులు, పలువురు మేధావులకు కృష్ణా బుక్‌సెంటర్‌ ఒక చిరునామాగా ఉండేది. అనంతపురం పట్టణంలో జరిగే అనేక రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడే రూపుదిద్దుకునేవి. ఆవిధంగా ఆంటి జిల్లా రాజకీయ, సాంస్కృతిక వికాసంలో కృష్ణా బుక్‌స్టాల్‌ పాత్ర కీలకమైంది. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చిన నేపథ్యంలో కృష్ణా బుక్‌స్టాల్‌ మూతపడింది. రామకృష్ణ సైతం క్రియాశీలక రాజకీయాల నుంచి విరమించుకున్నారు.

రాయల సీమ ప్రాంతంలో తోలి పాత్రికేయుడిగా రామకృష్ణ గారు చరిత్రలో నిలిచిపోయారు. స్వాతంత్య్రం పూర్వమే బ్రిటీష్‌ హయాంలోనే స్వతంత్రభారత్, ఆకాశవాణి పత్రికలకు సీమ ప్రాంత సమస్యల గురించి వ్యాసాలు, వార్తలు రాస్తూ వచ్చారు. ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, దక్కన క్రానికల్‌, ఆంధ్రభూమి, ఈనాడు, జనశక్తి, ఉజ్వల, జనత తదితర పత్రికలకు అనంతపురం జిల్లా స్టాప్ రిపోర్టరుగా పనిచేశారు. అఖిల భారత బంజార సంఘం ప్రోత్సాహంతో బంజారా పత్రికను అనంతపురం నుంచి రెండేళ్లపాటు సంపాదకుడిగా ఉండి నడిపారు.దాదాపు 70 సంవత్సరాల పాటు పాత్రికేయ వృత్తిలో గడిపిన రామకృష్ణ గారు నీతి, నిజాయితీలతో కూడిన నైతిక నిబద్ధతకు మారుపేరుగా నిలిపోయారు.  

పాత్రికేయుడుగానేకాక కథా రచయితగానూ రామకృష్ణ రచనారంగంలో రాణించారు. రాసినవి 10 కథలే అయినప్పటికీ... అవి తెలుగు సాహిత్య వనంలో మంచి ఖ్యాతిని గడించాయి. గంజికోసరం, చిరంజీవి, శిల్పి, వడ్లగింజలో, జొన్నచేను, కూటికోసం రచనల ద్వారా సీమ సాహిత్యానికి ఎంతో ప్రజాదరణ లభించింది. ఆయన నడిపిన కృష్ణా బుక్‌స్టాల్‌ కేంద్రం అరసం రచయితలకు అడ్డాగా ఉండేది. రాయలసీమ ప్రాంత అభ్యున్నతి కోసం, సమానత్వం కోసం పోరాడిన గుత్తి రామకృష్ణ గారు ఆ ప్రాంత వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.  

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com