భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి

- September 26, 2024 , by Maagulf
భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి

భూమ్మీద మానవులు పుడతారు, గిడతారు. వారిలో కొంతమంది మాత్రమే తమ జీవితాన్నే ఫణంగా పెట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు  చేసి మానవ జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ కోవలోకే వస్తారు భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన సంస్కరణల వాదిగా మన్మోహన్ సింగ్ ప్రజల మన్ననలను అందుకున్నారు. ఆర్థికవేత్తగా, దేశ ప్రధానిగా భారతదేశ యవనికపై చెరగని ముద్రవేసిన డా.మన్మోహన్ సింగ్ గారి జన్మదినం నేడు.  

మన్మోహన్ సింగ్ 1932, సెప్టెంబర్ 26న బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లో భాగమైన చక్వాల్ జిల్లాలోని గాహ్ అనే కుగ్రామంలో మధ్యతరగతి సిక్కు కుటుంబంలో జన్మించారు(చక్వాల్ జిల్లా ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉంది). మన్మోహన్ ప్రాథమిక విద్య మొత్తం ఉర్దూ మధ్యమంలో చదువుకున్నారు. దేశ విభజన తర్వాత కట్టుబట్టలతో భారతదేశంలో భగమైన పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ పట్టణానికి వలస వచ్చారు. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో తన అమ్మమ్మ వద్దే పెరిగిన మన్మోహన్ చదువుల్లో మాత్రమే ప్రతిభావంతుడైన రాణిస్తూ ప్రభుత్వ ఉపకార వేతనల మీద పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

 కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివేందుకు భారత ప్రభుత్వ ఉపకార వేతనం పొంది కేంబ్రిడ్జ్ అనుబంధ సెయింట్ జాన్స్ కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో బి. ఫిల్ పూర్తి చేసిన ఆయన ఇండియాకు తిరిగి వచ్చి పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా కొద్దీ కాలం పనిచేశారు. 1960లో లండన్ వెళ్ళి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డి.ఫిల్ పూర్తి చేశారు. UNCTAG సెక్రటేరియట్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలో సలహాదారుగా కొంత కాలం పనిచేశారు.1969-71 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అధ్యాపకుడిగా పనిచేశారు.

1970-80ల వరకు భారత ప్రభుత్వంలో అనేక కీలక పదవులు నిర్వహించారు.ప్రధాన ఆర్థిక సలహాదారు (1972-76), రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (1982-85), ప్రణాళికా సంఘం ఛైర్మన్ (1985-87) గా పనిచేశారు. ఇందిరా, రాజీవ్ గాంధీల ప్రభుత్వాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేశారు. నాబార్డ్ ఏర్పాటు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వ్యవస్థ స్థిరీకరణ వంటి విషయాల్లో మన్మోహన్ పాత్ర కీలకం. 1987 నుంచి 1990 మధ్య జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ కమిషన్ సంస్థకు సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. 1990 చివర్లో దేశ ప్రధాని చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు ఆర్థిక సలహాదారుగా, యూజీసీ కమిషన్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు.
 
1991లో ప్రధాని పి.వి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ భారతదేశంలో ఆర్థిక సరళీకరణ తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. పివి మద్దతుతో ‘లైసెన్స్ రాజ్’ విధానాన్ని రద్దు చేసి నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేసిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా ఆర్థిక సంస్కరణలకు కారణభూతుడైన మన్మోహన్ సింగ్ దేశ ప్రజల మన్ననలు అందుకున్నారు. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.  

2004 ఎన్నికల్లో యూపీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ప్రధానిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మన్మోహన్ సింగ్ తీసుకున్న విధానపరమైన సంస్కరణలను అంతర్జాతీయవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఒకవైపు ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తూనే ప్రజా సంక్షేమం మీద దృష్టి సారించి రేషన్ వ్యవస్థ బలోపేతం, జాతీయ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సర్వశిక్షా అభియాన్, సమాచార చట్టం వంటివి రూపొందించారు. 2004-09 వరకు మన్మోహన్ ఐదేళ్ళ పాలనలో దేశ జీడీపీ పెరగడమే కాకుండా రూపాయి మారక విలువ కూడా పెరిగింది. 2008లో జరిగిన తాజ్ హోటల్స్ ఉగ్రవాద సంఘటన మన్మోహన్ ప్రభుత్వానికి పెద్ద మాయని మచ్చ.

2009 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి రెండోసారి ప్రధానిగా మన్మోహన్ బాధ్యతలు చేపట్టారు. మొదటి టరం ప్రభుత్వంలో అవినీతి రహిత పాలనకు నాంది పలికినా రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రులు ప్రేమయంతో జరిగిన వరుస అవినీతి కుంభకోణాలు మన్మోహన్ సింగ్ ప్రతిష్టను మసకబరిచింది. ఇదే సమయంలో అవినీతి వ్యతిరేక ఉద్యమాలు ఊపందుకోవడం, యూపీఏ పదేళ్ళ పాలనపై ప్రజలకు విముఖత ఏర్పడటం వంటి పలు కారణాల వల్ల 2014 ఎన్నికల్లో యూపీఏ కూటమి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి మన్మోహన్ సింగ్ గారిని మానసికంగా క్రుంగిపోయేలా చేసింది. 2019 వరకు రాజ్యసభలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆయన కరోనా తర్వాత వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరమయ్యారు.  

1991నుంచి మూడున్నర దశాబ్దాల పాటు అస్సాం, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ 2024లో పదవి విరమణ పొందారు. రాజ్యసభ సభ్యుడిగా అధికార, విపక్ష నేతగా ఆయన పలు కీలకమైన బిల్లుల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. సభలో తనపై వచ్చిన విమర్శలను హుందాగా స్వీకరించేవారు. అయితే, తమ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద మౌన మునిగా వ్యవహరించడం సభలో ఆయన్ని తీవ్ర విమర్శల పాలయ్యేలా చేసింది.  

మన్మోహన్ వ్యక్తిగత జీవితానికి వస్తే ఢిల్లీ యూనివర్శిటీ మాజీ హిస్టరీ ప్రొఫెసర్ అయినటువంటి గురుశరణ్ కౌర్ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉపేందర్ సింగ్, దమన్ సింగ్, అమృతా సింగ్. ఆర్థిక రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు,ఏషియా మనీ అవార్డులను అందుకున్నారు. 2017లో ఇందిరా గాంధీ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు.

 
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com