వెండితెర గుండమ్మ...!
- October 28, 2024
తెలుగు సినిమాల్లో ఇప్పటికీ అత్త పాత్ర అంటే ఠక్కున గుర్తోచ్చే నటి సూర్యకాంతం. గయ్యాళి పాత్రల్లో ఆమె తన సహజ నటనతో ప్రేక్షకులను అలరించింది. అసలు వెండితెరకు గయ్యాళి అత్త పాత్రలను పరిచయం చేసిన విలక్షణ నటి సూర్యకాంతం. తెలుగు నేలపై ఆమె పేరు పెట్టుకోవడానికి గానీ…పిలిపించుకోవడానికి గానీ ఎవరు ఇష్టపడరు. అంతలా తన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశారు. పాత్ర ఏదైనా సరే తన సహజమైన నటనతో ఆ పాత్రకు వన్నె తేవడమే కాదు.. ఆమె తప్ప మరో నటి ఆ పాత్రను చేయ్యలేరు అన్నంతగా ఇమిడిపోయేవారు. తెరపై ఆమె పోషించిన ప్రతి పాత్రలో హాస్యం, వ్యంగ్యం, చిలిపితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. పాత్ర ఏదైన అందులో స్వాభావికంగా నటించడం ఆమెకు నటనతో పెట్టిన విద్య. నేడు ఆ మహానటి శత జయంతి సందర్భంగా "మా గల్ఫ్" ఇస్తున్న ప్రత్యేక కథనం...
సూర్యకాంతం గారు 1924, అక్టోబర్ 28న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణ రాయపురం గ్రామంలో పొన్నాడ అనంతరామయ్య, వెంకట రత్నమ్మ దంపతులకు 14వ సంతానంగా జన్మించారు.ఆరోజుల్లో సరైన టీకాలవంటి వైద్య సదుపాయాలు లేకపోవడంతో బాలారిష్టాలవలన శిశుమరణాలు ఎక్కువగా వుండేవి. చివరికి అనంతరామయ్య సంతానంలో మిగిలినవారు నలుగురు మాత్రమే. వారిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి కాగా, సూర్యకాంతం గారు కడగొట్టు సంతానం. ఆమె ఆరో ఏటనే తండ్రి స్వర్గస్తులయ్యారు. తండ్రి మరణంతో ఆవిడ పోషణ భారాన్ని ఆమె పెద్దక్క, పెద్ద బావగారైన చాగంటి శేషమ్మ, సుబ్బారావులు తీసుకున్నారు.
చిన్నతనం నుంచి సూర్యకాంతం కాస్త గారాబంగానే పెరిగారు. ఆమెకు చిన్నతనం నుంచే నటనమీద, సంగీతంమీద ఆసక్తి మెండుగా ఉండేది. డిటెక్టివ్ నవలల పాత్రల ప్రభావం ఆమె మీద బాగా పనిచేయడంతో ధైర్యంతోబాటు గడుసుతనం బాగా అబ్బింది. పాఠశాల వార్షికోత్సవాలలో ఆమె తరచూ నాటకాల్లో పాల్గొనేవారు… పాటలు పాడేవారు. ఆమెకు హిందీ సినిమాల మీద, పాటల మీద ఆసక్తి మెండుగా ఉండేది. ఆమె బంధువైన బాలాంత్రపు ప్రభాకరరావు కాకినాడలో ‘హనుమాన్ నాట్యమండలి’ పేరిట ఒక నాటక సంస్థను నెలకొల్పి, తద్వారా కేవలం ఆడపిల్లలతోనే నాటకాలు నిర్వహిస్తుండేవారు. ఆ సంస్థ ప్రదర్శించే సతీసక్కుబాయి, చింతామణి, శ్రీకృష్ణతులాభారం వంటి అనేక నాటకాల్లో సూర్యకాంతం పాల్గొంటూ రంగస్థలి నటిగా మంచి పేరుతెచ్చుకున్నారు.
1945 ప్రాంతంలో జెమిని సంస్థ వారు ‘చంద్రలేఖ’ చిత్రాన్ని భారీ తారాగణంతో తమిళం, హిందీ భాషల్లో సమాంతరంగా నిర్మిస్తూ, నటనమీద ఆసక్తిగల కళాకారులను, నృత్యకారులను పత్రికాముఖంగా స్వాగతించారు. ఆ ప్రకటనకు ఆకర్షితులైన హనుమాన్ నాట్యమండలిలో సభ్యురాలైన దాసరి సుభద్ర, యండమూరి సుభద్ర అనే తోటి అమ్మాయిలు మద్రాసుకు ప్రయాణం కడుతూ సూర్యకాంతానికి కూడా ఆహ్వానం పలికారు. అలా వారితో కలిసి సూర్యకాంతం మద్రాసు చేరి జెమినీ స్టూడియోలో నృత్య తారగా నెల జీతానికి కుదిరారు. ‘చంద్రలేఖ’ (1948) సినిమాలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన డ్రమ్ డాన్స్ సన్నివేశంలో పాల్గొన్న 500 మందిలో సూర్యకాంతం ఒకరుగా నృత్యం చేశారు.
ప్రముఖ నేపథ్య గాయని పి.లీలతో సూర్యకాంతంకు పరిచయమేర్పడింది. ఆమె సిఫారసుతో సూర్యకాంతం 1946లో ఫేమస్ ఫిలిమ్స్ వారు పి. పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన ‘నారద నారది’ అనే పౌరాణిక చిత్రంలో ఒక చిన్న వేషంలో కనిపించారు. ఆ తర్వాత జెమినీ సంస్థలో అప్పటివరకు నెలజీతానికి కాంట్రాక్టు లోవున్న సూర్యకాంతం అందులోనుంచి తప్పుకున్నారు. 1946లో శ్రీసారథి స్టూడియోస్ వారు ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన ‘గృహప్రవేశం’ చిత్రంలో పోషించిన సహాయనటి పాత్రకు సూర్యకాంతంకు గుర్తింపు వచ్చింది. దర్శకుడు పి.పుల్లయ్య గారి సిఫార్సు మేరకు 1949లో స్వస్తిక్ బ్యానర్ మీద హెచ్.వి. బాబు దర్శకత్వంలో మీసాల పులిగా కీర్తించే హెచ్.ఎం. రెడ్డి నిర్మించిన ‘ధర్మాంగద’ జానపదచిత్రంలో సూర్యకాంతం ఒక మూగపిల్ల పాత్రను పోషించారు.
1950లో సాధనా వారు నిర్మించిన ‘సంసారం’ సినిమాలో రేలంగి తల్లిగా, నిర్దయ కలిగిన అత్తగారి పాత్రలో సూర్యకాంతం తొలిసారి నటించి ఆ పాత్రలో జీవించారు. కేవలం పాతిక సంవత్సరాల వయసులో అరవై యేళ్ళ అత్తగారి పాత్రను పోషించడం చిన్న విషయం కాదు. ఆ పాత్రకు సూర్యకాంతానికి మంచి పేరొచ్చింది.1951లో రాజరాజేశ్వరి ఫిలిమ్ కంపెనీ నిర్మాత కె.బి. నాగభూషణం నిర్మించిన ‘సౌదామిని’ చిత్రంలో సూర్యకాంతం హీరోయిన్ పాత్రకు ఎంపికైంది. దురదృష్టవశాత్తూ ఒక కారు ప్రమాదంలో గాయపడి ఆమె ముఖానికి పెద్ద దెబ్బలు తగలడంతో, ఆ పాత్ర ఎస్. వరలక్ష్మి పరమైంది. ఆమెకు స్వస్తత చేకూరిన తర్వాత అదే చిత్రంలో సూర్యకాంతం రూప అనే పాత్రను పోషించారు.
సూర్యకాంతంకు మొదటినుంచి హిందీ సినిమాలలో నటించాలనే బలీయమైన కోరిక వుండేది. కానీ ఆమెకు పరిస్థితులు అనుకూలించక ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు.అయితే దీపావళి పండుగరోజుల్లో ఒక హిందీ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు సూర్యకాంతంకు అవకాశం వచ్చింది. పాత్ర ఒప్పుకున్న కొద్దిరోజులలోనే తను ధరించబోయే ఆ పాత్రను మరొకరితో చిత్రీకరించి, కారణాంతరాలవలన ఆమెను తొలగించి సూర్యకాంతంను బుక్ చేశారని తెలిసి, సూర్యకాంతం ఆ ఆఫర్ ని త్రోసిపుచ్చారు. తన మానవత్వమే ఈ నిర్ణయం తీసుకునేందుకు ఆమెకు ఉపకరించింది. ‘ఒకరిని బాధపెడుతూ తను సంతోషంగా వుండలే’నని నిర్మాతకు ఆమె తెగేసిచెప్పేశారు.
1953లో శ్రీ గజాననా ప్రొడక్షన్స్ సంస్థ కె.ఎస్. రామచంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన ‘కోడరికం’ సినిమాలో అత్తగా ఆమె స్థిరపడిపోయారు. అప్పట్లో గయ్యాళి అత్త పాత్రలను పోషిస్తున్న శేషమాంబను వెనక్కునెట్టి అత్తపాత్రలకు పెట్టింది పేరుగా సూర్యకాంతం రాణిస్తూ మంచి పేరుతెచ్చుకున్నారు. పెళ్ళిచేసి చూడు చిత్రంలో చుక్కాలమ్మగా, చంద్రహారంలో రాజకుమార్తెగా, అమ్మలక్కలు చిత్రంలో శేషమ్మగా, చక్రపాణి చిత్రంలో మనోరమగా గయ్యాళి పాత్రలు పోషించి నిలదొక్కుకున్నారు. ధర్మాంగద, గృహప్రవేశం, రత్నమాల, మదాలస, సంసారం, రూపవతి, చిన్నకోడలు, ప్రేమ, దాసి, దొంగరాముడు, కన్యాశుల్కం, చిరంజీవులు, బ్రతుకుతెరువు, పరదేశి, వారసత్వం, చరణదాసి, మాయాబజార్, తోడికోడళ్ళు, అప్పుచేసి పప్పుకూడు, మాంగల్యబలం, వెలుగునీడలు, భార్యాభర్తలు, ఇద్దరుమిత్రులు, ఆత్మబంధువు, కులగోత్రాలు, దాగుడుమూతలు వంటి సినిమాలలో వైవిధ్యమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలను చూరగొన్నారు.
జానపద బ్రహ్మ విఠలాచార్య కన్నడంలో నిర్మించిన ‘మనే తుంబిద హెణ్ణు’ సినిమా హక్కులను విజయా సంస్థ అధినేతలైన నాగిరెడ్డి, చక్రపాణిలు కొనుగోలు చేసి, కథకు కొన్ని మార్పులు చేసి, నరసరాజు చేత డైలాగులు రాయించి 1962లో ‘గుండమ్మ కథ’ సినిమా నిర్మించారు. అందులో అగ్రనటులు అక్కినేని, ఎన్టీఆర్ హీరోలైనా సినిమా టైటిల్ కు మాత్రం సూర్యకాంతం పోషించిన ‘గుండమ్మ’ పాత్ర పేరు పెట్టారు. ఆ చిత్రం తెలుగు సినీచరిత్రలో ఒక కలికి తురాయిగా మిగిలింది. అసలు గుండమ్మ తెలుగు పేరు కాదు. అయినా ప్రేక్షకులు ఆ చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. అన్నపూర్ణా వారి తోడికోడళ్ళు చిత్రంతో మొదలెట్టి చివరిదాకా ఆ సంస్థ సినిమాలలో సూర్యకాంతం నటించారు. భరణీ వారి సినిమాలలో కూడా ఆమెకు వేషం తప్పనిసరిగా వుండేది.
జెమిని వాసన్ నిర్మాణ దర్శకత్వంలో తెలుగులో నిర్మించిన ‘బాలనాగమ్మ’ చిత్రాన్ని 1954లో హిందీలో ‘బహుత్ దిన్ హుయే’ పేరుతో పునర్నిర్మించగా అందులో సూర్యకాంతం నటించి హిందీలో నటించాలనే కోరిక తీర్చుకున్నారు. 1955లో కె.జె. మహదేవన్ దర్శకత్వంలో నిర్మించిన ‘దో దుల్హనే’ హిందీ సినిమాలో కూడా సూర్యకాంతం నటించారు. ఇక 50 కి పైగా తమిళ చిత్రాలలో వైవిధ్య పాత్రలను సూర్యకాంతం పోషించారు. ఆమె దాదాపు ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లా డేవారు. బొంబాయిలో కొన్ని సినిమా షూటింగులకు హాజరైనప్పడు, ఆ స్వల్ప వ్యవధిలోనే మరాఠీ భాషను నేర్చుకున్నారు. తరువాతి రోజుల్లో “యమగోల, బుచ్చిబాబు, గుండమ్మగారి కృష్ణులు, గయ్యాళి గంగమ్మ, ప్రేమ మందిరం, పెళ్ళీడు పిల్లలు, పెళ్ళిచూపులు” వంటి చిత్రాలలోనూ అభినయించి ఆకట్టుకున్నారు. ఆమె వెండితెర మీద చివరగా కనిపించిన చిత్రం చిరంజీవి హీరోగా రూపొందిన ‘ఎస్పీ పరశురామ్’.
సవతి తల్లి, తోడికోడలు, గయ్యాళి అత్త ఇలా ఏపాత్రైలోనైన చక్కగా ఒదిగిపోవడం సూర్యకాంతం స్పెషాలిటి. కొన్ని పాత్రలు కొంతమంది కొరకే సృష్టించారనిపిస్తుంది. ఒకే రకం పాత్రల్ని ఎక్కువ సినిమాల్లో నటించిన నటి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సూర్యకాంతమే. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా, ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. ఒక గొప్ప నటిగానే గుర్తించాలి.కేవలం గయ్యాళి పాత్రలే కాదు. నటిగా సూర్యకాంతంలో ఎన్నో కోణాలున్నాయి. సాత్విక పాత్ర చేసినా…హాస్యపాత్రలో నటించినా…ఇలా ఏపాత్ర చేసినా ఆ పాత్రే కనబడుతుంది. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లబొల్లి కబుర్లతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు. గయ్యాళి అత్తగా కోడళ్ళను ఆరడిపెట్టడంతో అమ్మాయిలు ఆ పేరు వింటేనే భయపడేవారు. తన దరికి చేరిన పాత్రలకు తగిన న్యాయం చేయడానికి ఆమె తపించేవారు.
తెరపై అందరినీ భయపెట్టే పాత్రల్లో నటించిన సూర్యకాంతం గారు, తన చుట్టూ ఉన్నవారిని ఎంతో బాగా చూసుకొనేవారు. ఇంటి నుండి ప్రత్యేకంగా వంటలు చేసి తీసుకు వచ్చి సహనటీనటులకు పెట్టి ఆనందించేవారు. ఇక ఎవరైనా కొత్త దంపతులు ఉంటే, వారిని అదే పనిగా ఇంటికి పిలిచి, విందు ఏర్పాటు చేసి కొత్తబట్టలతో సత్కరించేవారు. ఇలా తెరపై గయ్యాళిగా నటిస్తూ, తెరవెనుక ఆప్యాయతలు పంచుతూ సూర్యకాంతం కడదాకా సాగారు. ఆమెకు చదువుమీద ఎంతో ఆసక్తి వుండేది. చిన్నవయసులోనే చదువుకు స్వస్తి చెప్పడంతో ఆమెకు గ్యాడ్యుయేట్ కావాలనే కోరిక అలాగే వుండిపోయింది. సినిమారంగంలో అడుగుపెట్టగానే ఆమె ఇంగ్లీషు నేర్చుకున్నారు. యాభైయేళ్ల వయసులో ఫ్రెంచ్ భాషను కూడా నేర్చుకోవడం ఆమెకు భాష మీద వున్న ఆసక్తికి తార్కాణమని చెప్పుకోవాలి. ఆమె వంటలమీద ఒక అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించారు కూడా. జీవిత చరమాంకంలో ఆమెకు తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించారు.
సూర్యకాంతం మంచి వ్యాపార పటిమగల మహిళ. మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేవారు. ఆమె అందర్నీ నమ్మేవారు కాదు. ఆవిడ పాత ఇళ్ళు కొనుగోలుచేసి, వాటిని ఆధునీకరించి మంచి ధరకు అమ్మేవారు. అంతేకాదు, పాత కార్లను కొని వాటికి రేపేర్లు చేయించి, రంగులు వేసి సెకండ్ హ్యాండ్ బజార్లలో అమ్మకానికి వుంచేవారు. ఇది కేవలం ధనార్జనకోసం చేసిన ప్రవృత్తి కాకపోయినా, వ్యాపార సరళి మీద ఆమెకు వున్న ఆసక్తికి గుర్తు మాత్రమే.
సూర్యకాంతం గారి వ్యక్తిగత జీవితానికి వస్తే, ఆమెది పెద్దల అంగీకారంతో కుదిరిన ప్రేమ వివాహం. 1950లో ప్రముఖ మద్రాస్ హైకోర్టు న్యాయవాది పెద్దిభొట్ల చలపతిరావు గారితో ఆమెకు వివాహం జరిగింది. గుంటూరుకు చెందిన చలపతిరావు గారు మద్రాసు హైకోర్టులో వకీలుగా ప్రాక్టీస్ చేస్తూ, కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు న్యాయ సలహాదారుగా కూడా వ్యవరిస్తూ ఉండేవారు. ఆయనకు నాటకాలన్నా, సినిమాలన్నా చాలా ఇష్టం. అలా సూర్యకాంతంతో పరిచయమై, ఆ పరిచయం వారి వివాహానికి దారితీసింది. ఆ తర్వాత కాలంలో ఆయన మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. అయితే వీరికి సంతానం కలుగకపోవడంతో సూర్యకాంతం గారి అక్క సత్యవతి గారి అబ్బాయి అనంత పద్మనాభమూర్తిని చిన్నతనంలోనే దత్తత తీసుకోని పెంచి పెద్దచేశారు.
750 సినిమాలకు పైగా నటించిన సూర్యకాంతం గారు 1993 ప్రాంతంలో సూర్యకాంతం మధుమేహ వ్యాధితో బాధపడ్డారు. ఆ వ్యాధి ముదిరి మూత్రపిండాలను దెబ్బతీసింది.1994 డిసెంబర్ 18 న తన 70వ ఏట చెన్నైలో కన్నుమూశారు. ఆమె భౌతికంగా మనమధ్య లేకపోయిన..నటన రూపంలో ఆమె ప్రేక్షక హృదయాలలో చిరంజీవిగానే నిలిచే ఉంది. ఒక నటీగా వేరెవ్వరు భర్తీ చేయలేని స్థానాన్ని అందుకుంది.ఏది ఏమైనా సూర్యకాంతం అభినయం భయపెట్టినా, ఆమె నటనను ఎంతగానో తెలుగువారు అభిమానించారు. అందుకే ఈ నాటికీ ‘గుండమ్మ’గానూ జనం మదిలో నిలచిపోయారామె.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స