న‌వంబ‌ర్ 8 నుంచి ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. ఫ్రీగా ఇలా చూసేయండి

- November 05, 2024 , by Maagulf
న‌వంబ‌ర్ 8 నుంచి ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. ఫ్రీగా ఇలా చూసేయండి

న్యూఢిల్లీ: స్వ‌దేశంలో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భార‌త్ ఘోర ప‌రాభ‌వాన్ని చ‌విచూసింది. న్యూజిలాండ్ జ‌ట్టు 3-0 తేడాతో భార‌త్ పై విజ‌యాన్ని సాధించింది. ఈ ఓట‌మి నుంచి తేరుకోక‌ముందే టీమ్ఇండియా మ‌రో స‌వాల్‌కు సిద్ధ‌మైంది. టెస్టు సిరీస్‌లో ఆడిన జ‌ట్టు కాకుండా సూర్య‌కుమార్ యాద‌వ్ నేతృత్వంలో కుర్రాళ్ల‌తో కూడిన భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది.

తొలి టీ20 మ్యాచ్ న‌వంబ‌ర్ 8 శుక్ర‌వారం డ‌ర్బ‌న్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఇప్ప‌టికే టీమ్ఇండియా డ‌ర్బ‌న్ చేరుకుంది. ఇరు జ‌ట్లు త‌మ ప్రాక్టీస్‌ను మొద‌లెట్టాయి. శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో పూర్తి స్థాయి టీ20 సార‌థిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సూర్య‌కుమార్ లంక ప‌ర్య‌ట‌న‌లో 3-0తో సిరీస్‌ను గెలిపించాడు. ఆ త‌రువాత స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశాడు. ఇక ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ పై కూడా విజ‌యాల‌ను అందుకోవాల‌ని ఆరాట‌ప‌డుతున్నాడు.

న‌వంబ‌ర్ 22 నుంచి భారత జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో గంభీర్ ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్ర‌మంలో తాత్కాలిక కోచ్‌గా ఎన్‌సీఏ డైరెక్ట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు.

ఫ్రీగా ఎలా చూడొచ్చంటే?
భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. ఈ సిరీస్‌ను స్పోర్ట్స్ 18 నెట్‌వ‌ర్క్ బ్రాడ్‌కాస్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో టీవీల్లో స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18 హెచ్‌డీ ఛానెల్‌లో చూడొచ్చు. ఇక ఓటీటీలో జియో సినిమాలో ఫ్రీగా మ్యాచుల‌ను వీక్షించ‌వ‌చ్చు.

షెడ్యూల్ ఇదే..
తొలి టీ20 – న‌వంబ‌ర్ 8 – డ‌ర్బ‌న్‌
రెండో టీ20 – న‌వంబ‌ర్ 10 – సెయింట్ జార్జ్ పార్క్‌
మూడో టీ20 – నవంబ‌ర్ 13 – సెంచూరియ‌న్‌
నాలుగో టీ20 – న‌వంబ‌ర్ 15 – జోహెన్నెస్ బ‌ర్గ్‌

ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రమన్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com