దుబాయ్ లో అశేష అభిమానుల నడుమ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఎస్పీ శైలజ

- November 05, 2024 , by Maagulf
దుబాయ్ లో అశేష అభిమానుల నడుమ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఎస్పీ శైలజ

దుబాయ్: దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు నివాళిగా మ్యూజిక్ ఇండియా దుబాయ్ వారు ఏటేటా నివహిస్తున్న 'గీతాంజలి' కార్యక్రమం దుబాయ్ లో జెమ్స్ మోడరన్ అకాడమీ స్కూల్ లో వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి ఎస్పీ శైలజ విచ్చేయటం జరిగింది.ఈ సందర్భంగా యూఏఈ లో నివసిస్తున్న గాయకులు ఆలపించిన పాటలు శ్రోతలను మంత్రముగ్దులను చేశాయి.  గాయకులు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలకు చెందిన ఎస్పీ బాలు పాడిన ఆణిముత్యాలను ఆలపించి; సంగీతానికి భాష లేదు..సంగీతానికి పరవశించని మనసు లేదు అన్నట్టుగా అందరినీ ఆకట్టుకున్నారు. 

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గాయని శైలజ; వివిధ భాషలకు చెందిన తమ పాటలను ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తెలంగాణ పాట 'లాలూ దర్వాజ లస్కర్ బోనాల్..' ఆలపించడంతో తెలుగు ప్రేక్షకుల చప్పట్లు-కేరింతలతో వేదిక మార్మోగిపోయింది.

'మ్యూజిక్ ఇండియా దుబాయ్' వారు 'గీతాంజలి - సీసన్ ౩', అనగా ఈ సంవత్సరం నుండి ఎస్పీ బాలు పేరుమీద సంగీత ప్రపంచంలోని ప్రముఖులకు 'జీవిత సాఫల్య పురస్కారం' అందించనున్నారు. ఆ సందర్భంగా ఎస్పీ శైలజ కు 'ఎస్పీబీ జీవిత సాఫల్య పురస్కారం' ఇచ్చి సత్కరించడం జరిగింది.మ్యూజిక్ ఇండియా దుబాయ్, ఇండెక్స్ బెర్రీ ఎండీ గణేష్ రాయపూడి మరియు TEPA అధ్యక్షుడు పాల్ ప్రభాకర్..ఈ అవార్డును శైలజ కు అందజేశారు.అంతేకాకుండా ఆమెను తమ ఆడపచుగా భావించి సువాసినీ తాంబూలం ఇచ్చి గౌరవిచడం అందరిని ఎంతో ఆకట్టుకుంది.

అనేక పురస్కారాలు పొందిన శైలజ, నేడు 'మ్యూజిక్ ఇండియా దుబాయ్' వారు ఇచ్చిన ఈ జీవిత సాఫల్య పురస్కారం ను అందుకుంటూ.. "అన్నయ్య పేరు మీదుగా ఇచ్చిన ఈ పురస్కారం నాకు ఎంతో అత్యంత ప్రియం. ఇంతటి గౌరవాన్ని నాకు ఇచ్చిన అభిమానులకు నేను సర్వదా కృతజ్ఞురాలిని. నన్ను ఆడపచుడుగా భావించి సత్కరించిన కార్యనిర్వాహకులకు నా కృతఙ్ఞతలు. ప్రపంచపు నలుమూలలా ఉన్న అన్నయ్య అభిమానులు ఇలా మాపై ప్రేమను చూపిస్తూ అన్నయ్య లేని లోటును తీరుస్తున్నారు; అది మా అదృష్టం." అని అన్నారు.

మ్యూజిక్ ఇండియా దుబాయ్ ఫౌండర్ ప్రశాంతి చోప్రా మాట్లాడుతూ "శైలజ గారికి ఇలా మా ఆలోచన తెలుపగానే వెంటనే ఆమె అందుకు ఒప్పుకొని మా సంగీత అభిమానులను మరీ ముఖ్యంగా ఎస్పీ బాలు గారి అభిమానులను కలిసేందుకు విచ్చేయటం మా అదృష్టం.ఆమె సమక్షంలో మేము ఈ విభావరి నిర్వహించటం అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తోంది" అని అన్నారు.

మ్యూజిక్ ఇండియా దుబాయ్ ఫౌండర్ మెంబెర్ రాకేష్ మారింగంటి మాట్లాడుతూ "లెజెండరీ గాయకులు ఎస్పీ బాలు గారి పేరు మీద ఇలా జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వటం అనేది మేము చేసుకున్న అదృష్టం. మా సంకల్పానికి తమ ఆమోదం తెలిపిన శైలజ గారికి కృతఙ్ఞతలు. శైలజ గారు ఇచ్చిన సూచనలు మాకు సదా మార్గదర్శకం." ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగటంతో ప్రోత్సహించిన కమిటీ సభ్యులకు, స్పాన్సర్లకు, మీడియా ప్రముఖులకు మరియు అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

గీతాంజలి - ౩ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబాయ్ పోలీసు విభాగం నుండి అహ్మద్ సాలెహ్ విచ్చేయటం జరిగింది. 

మ్యూజిక్ ఇండియా దుబాయ్ వ్యవస్థాపకురాలు ప్రశాంతి చోప్రా, వ్యవస్థాపక సభ్యుడు రాకేష్ మారింగంటి మరియు కోర్ సభ్యులు శ్రీనివాసన్ గోవిందరాజన్, జయలక్ష్మి బాలసుబ్రమణియన్ అధ్యక్షన, M R గ్లోబల్ కన్సల్టెన్సీ ఈ కార్యక్రమం నిర్వహించింది. స్పాన్సర్లుగా ఇండెక్స్ బెర్రీ వ్యవహరించగా, కమ్యూనిటీ పార్టనర్ గా TEPA  వ్యవహరించింది. మీడియా పార్టనర్ గా మాగల్ఫ్, TV5 వ్యవహరించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com