50 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న డైలాగ్ కింగ్

- November 23, 2024 , by Maagulf
50 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న డైలాగ్ కింగ్

తెలుగు సినీ చరిత్రలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విలన్ గా టర్న్ తీసుకొని.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా అలరించి.. మళ్లీ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ కింగ్ అనిపించుకున్న నటుడు మోహన్ బాబు. కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగా, విద్యావేత్తగా సైతం మారారు. పాత్రల వైవిధ్యం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో మోహన్ బాబు గారి ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అంకితభావం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.

మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. సినీ పరిశ్రలోకి అడుగుపెట్టిన తర్వాత మోహన్ బాబుగా మార్చుకున్నారు. 70వ దశకంలో ఆయన నట ప్రస్థానం మొదలైంది. ఆరంభంలో అందరికీ ఎదురైనట్టుగానే ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఆయన అకుంఠిత భావం, కష్టపడే తత్త్వం, అంకిత భావంతో కష్టపడి ఎదిగారు. ఆయన నాడు వేసిన పునాదులపై మంచు వారి ఘనత చెక్కు చెదరని భవనంలా నిలబడింది.

సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ జీవితాన్ని మొదలుపెట్టిన మోహన్ బాబు, ఆ తర్వాత నటుడిగా మారి 1975 - 90 వరకు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు. దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న ప్రతినాయకులలో ఒకరిగా నిలిచిన ఆయన నటన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. స్వర్గం నరకం చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయం అయినా.. విలన్ పాత్రలతోనే అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు.  

1990లో హీరోగా మారిన మోహన్ బాబు.. ‘అల్లుడుగారు’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘పెదరాయుడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆయనను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తెలుగు చిత్రాలలో ఆయన నటించిన అనేక సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి. ముఖ్యంగా ఆయన నటించిన ఎన్నో తెలుగు చిత్రాలను తమిళ్, హిందీలో కూడా రీమేక్ చేయాగా.. అక్కడ కూడా భారీ విజయాలు సాధించాయి.

మోహన్ బాబు తనదైన రీతో డైలాగ్స్ చెప్పడం, విలక్షణంగా నటించడం, నవ్వించడం, ఏడిపించడం, విలనిజంలో కొత్తదనం చూపించడంతో అతి కొద్ది కాలంలోనే తెలుగులో స్టార్‌గా ఎదిగారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా.. ఎంత క్లిష్టమైనదైనా సరే అనర్గళంగా ఒక్కసారి విని చెప్పగలిగిన సామర్థ్యం ఈయనది. అందుకే అభిమానులు ఆయన్ని ‘డైలాగ్ కింగ్’ అని పిలుచుకుంటారు. ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. పాత్రలకు ప్రాణం పోయడంలో ఆయన స్పెషలిస్ట్. ఆయన చేసిన కారెక్టర్‌లు తెలుగు వారి మదిలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి.

నటుడిగానే కాకుండా సినిమా పరిశ్రమ మీదున్న మక్కువతో ఆయన నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. నిర్మాతగా సుమారు 75 చిత్రాలను నిర్మించారు. ఓ నటుడు నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం అనేది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక అరుదైన రికార్డ్.

సినిమాలే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తుంటారు మోహన్ బాబు. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు మంచి చదువు అందిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా 25% ఉచిత విద్య అందిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా, 2016 ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.

సినిమా రంగంలో సామాన్య వ్యక్తిగా మొదలై.. అసామాన్య వ్యక్తిగా ఎదిగిన మోహన్ బాబు సినీ ప్రయాణం చాలా మందికి ఆదర్శనీయం. నటుడిగా ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్నా.. ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఎనర్జీతో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆయన చేయబోయే తదుపరి చిత్రాలు, రాబోయే అద్భుతాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తనయుడు మంచు విష్ణు  డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో మోహన్ బాబు  మహాదేవ శాస్త్రిగా అలరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలుస్తుందని ఆశిద్దాం.

 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com