అభ్యుదయ దర్శకుడు-తాతినేని
- November 24, 2024
తెలుగు సినిమా స్వర్ణయుగానికి చెందిన దర్శకుల్లో ఒకరు, ఉత్తమాభిరుచితో విజయవంతమైన చిత్రాలను అందించిన వ్యక్తి తాతినేని ప్రకాశరావు. ప్రకాశరావు ప్రజానాట్యమండలి కళాకారుడు. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. నికార్సయిన ప్రజావాది. సినిమాల ద్వారా తన భావాలను ప్రజలకు చెప్పాలనీ, వారిని చైతన్యవంతుల్ని చేయాలనే ఉద్దేశంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నాటి సమాజంలోని సమస్యలకు అద్దం పట్టిన చిత్రాలనే ఎక్కువగా రూపొందించారు. అందుకే ఆయన సామాన్య ప్రేక్షకుడికి దగ్గర కాగలిగారు. తను అనుకున్న లక్ష్యం సాధించగలిగారు. నేడు అభ్యుదయ దర్శక దిగ్గజం తాతినేని ప్రకాశరావు గారి జయంతి.
తాతినేని ప్రకాశరావు 1924, నవంబర్ 24న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణాజిల్లా గన్నవరం దగ్గర్లోని కపిలేశ్వరపురంలో జన్మించారు. తండ్రి వీరరాఘవయ్య కాంగ్రెస్‌వాది. తండ్రి నుంచి రాజకీయం, విప్లవ భావాలతో పాటుగా సినిమాల మీద ఆసక్తి వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారు. సినిమాల పట్ల ఉన్న అభిమానం కారణంగానే, తమ ఉరికి దగ్గర్లో ఉన్న టూరింగ్ టాకీస్‌లో అసిస్టెంట్ ఆపరేటర్ వుద్యోగం సంపాదించుకున్నారు. విద్యార్థిగా వుంటూనే రాజకీయాల వైపు అడుగులు వేశారు. ప్రజానాట్యమండలిలో చేరి నాటకాలు వేసేవారు.
1946లో మద్రాస్ వెళ్ళినప్పుడు దిగ్గజ దర్శకుడు ఎల్.వి.ప్రసాద్‌తో ఏర్పడ్డ పరిచయం ఆయన్ను చిత్రపరిశ్రమ వైపు నడిపించింది. ఎల్వీ ప్రసాద్ దగ్గర శిష్యుడిగా చేరి మనదేశం, సంసారం, షావుకారు, పెళ్ళి చేసి చూడు చిత్రాలకు పని చేశారు. కె.వి.రెడ్డి వద్ద పాతాళభైరవి చిత్రానికి సహాయ దర్శకుడుగా పనిచేసారు. పీపుల్స్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ‘పల్లెటూరు’ చిత్రంతో దర్శకుడయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంబరాలు, గ్రామాల్లో ఉండే చెడుగుడు ఆట వంటివి అత్యంత సహజంగా చిత్రీకరించడమే కాకుండా సంక్రాంతి పండుగ గురించి ఒక పాట, దేశభక్తిని ప్రబోధించే పాట ఒకటి, తెలుగు తేజం వివరించే చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. పాటని చిత్రీకరించారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, నాగభూషణం ఈ చిత్రాలకి ముఖ్య పాత్రధారులు. పల్లెటూరు అందాలు, ఆనందాలు వర్ణించిన ఈ చిత్రం 1952లో విడుదలై ఘన విజయం సాధించింది.
1953లో ఎన్టీఆర్ హీరోగా ‘పిచ్చిపుల్లయ్య’ చిత్రాన్ని తీశారు. ఇది నిర్మాతగా ఎన్టీఆర్‌కు తొలి సినిమా కావడం విశేషం. మాస్ హీరోగా ఇమేజ్‌ను పక్కన పెట్టి పూర్తి విభిన్నంగా ఉండే పల్లెటూరి బైతు పాత్రను ఎన్టీఆర్ ఇందులో పోషించారు. తెలుగు నాట మల్టీస్టారర్ చిత్రాలకు ఊపు తీసుకొచ్చిన దర్శకుల్లో ప్రకాశరావు ఒకరు. నాటి అగ్రనటులైన ఎన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన రెండు చిత్రాలు ‘చరణదాసి’, ‘పరివర్తన’ తాతినేని దర్శకత్వంలోనే రూపుదిద్దకున్నాయి. ‘చరణదాసి’ చిత్రంలోని ఓ స్వప్న సన్నివేశంలో ఎన్టీఆర్ శ్రీరాముడిగా, అంజలీదేవి సీతగా కనిపిస్తారు. ఎన్టీఆర్ తొలిసారిగా శ్రీరాముడి గెటప్ వేసుకుంది ఈ చిత్రంలోనే. అలాగే ‘పరివర్తన’ చిత్రంలో ఏయన్నార్ హీరో అయితే, విలన్‌గా ఎన్టీఆర్ నటించడం మరో విశేషం. ఇందులో అక్కినేనికి చెల్లెలిగా, ఎన్టీఆర్‌కు భార్యగా సావిత్రి నటించారు. పరివర్తన చిత్రం తమిళంలో డబ్ అయి ఘన విజయం సాధించింది.
తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్ మొదలైన అగ్రనటులతో ఎన్నో తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో దాదాపు పెద్ద నటులందరితోనూ సినిమాలు తీశారు. ఒకానొక దశలో తెలుగు, తమిళ సినిమాల జోలికి పోకుండా ఆయన ఎనిమిదేళ్ల పాటు హిందీ చిత్రాల మీదే దృష్టి పెట్టడం గమనార్హం. ముగ్గురు ముఖ్యమంత్రులు ఎమ్జీఆర్, ఎన్టీఆర్, జయలలితలను డైరెక్ట్ చేసిన ఘనత ప్రకాశరావు గారికే దక్కింది.
30 ఏళ్ల పాటు దర్శకుడిగా, నిర్మాతగా ప్రకాశరావు సినీజీవితం విజయవంతంగా సాగింది. రాశి కంటే వాసికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ 30 ఏళ్ల కాలంలో కేవలం 30 చిత్రాలు మాత్రమే రూపొందించగలిగారు ప్రకాశరావు. ఇందులో తెలుగు చిత్రాలే కాదు తమిళ, హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి.వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందించాలని సమాజంలోని సమస్యలను కూడా చర్చించాలని, కుటుంబపరమైన సమస్యలు, సరదాలు చక్కగా చూపించాలని ప్రయత్నించి, సఫలం చెందేవారు. దర్శకుడుగా, అందుకే తాతినేని ప్రకాశరావు చిత్రాలలో కథ, కథనం ఆకట్టుకునేలా ఉండేది.
తాతినేని వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వి.మధుసూదనరావు, గుత్తా రామినీడు, కె. హేమాంబరధరరావు, తాతినేని రామారావు, కె.ప్రత్యగాత్మలు తర్వాత కాలంలో చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకులుగా స్థిరపడ్డారు. వీరిలో తాతినేని రామారావు, కె.ప్రత్యగాత్మలు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
50వ దశకంలో తెలుగు చిత్రసీమకు చక్కని చిత్రాలు అందించగల టాలెంటెడ్ డైరక్టర్లుగా ప్రకాశరావుతో పాటు సి.ఎస్.రావు, డి. యోగానంద్, కె.బి. తిలక్, ఆదుర్తి సుబ్బారావులను పరిగణించేవారు. వీరంత కూడా యువరక్తం పొంగుతూంటే చక్కని కుటుంబకథా చిత్రాలు, ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాలను రూపొందించినవారే. అంతేకాదు వీరి చిత్రాల్లో మెలొడీ పాటలకూ ప్రాధాన్యత ఉండేది.
చిత్ర పరిశ్రమలో ఆయనకు హీరో ఎన్టీఆర్, దర్శకుడు డి. యోగానంద్, సంగీత దర్శకుడు టి.వి.రాజులు మంచి స్నేహితులు. వీరందరూ ఒకే ఏడాది చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడమే కాకుండా, మద్రాస్ పాండి బజార్లో ఒకే భవనంలో కలిసి ఉండేవారు. ఎన్టీఆర్, ప్రకాశరావులు చిత్ర పరిశ్రమలో ఎదిగిన తర్వాత మిగిలిన ఇద్దరికి తమ చిత్రాల ద్వారా అవకాశాలు కల్పించారు. ఎన్టీఆర్‌ను ‘బావగారు’ అని పిలిచేవారు ప్రకాశరావు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీకి కోశాధికారిగా వ్యవహరించిన ప్రకాశరావు ఒక దశలో ఎన్టీఆర్‌తో విభేదించి, ఆయనకు వెన్నుపోటు పొడిచిన నాదెళ్ల భాస్కరరావుకు మద్దతు పలకడం ఆసక్తికర పరిణామం.
ప్రకాశరావు తనయుడు ప్రసాద్ కూడా దర్శకుడై తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు. ప్రసాద్ కుమారుడు సత్య కూడా దర్శకుడిగా మారడం గమనార్హం. ఇలా ఒకే కుటుంబంలో మూడు తరాలకు చెందిన వాళ్లు దర్శకులు కావడం అరుదైన విషయమే. చిత్రపరిశ్రమలో అభ్యుదయవాదిగా ముద్రపడ్డ తాతినేని ప్రకాశరావు 1992, జూలై 1న దివంగతులయ్యారు. ఆయన మూడు దశాబ్దాలు అవుతున్నా, ఆయన రూపొందించిన చిత్రాలు ఇప్పటికి బుల్లితెర మీద ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







