నిస్వార్థ ప్రజా సేవకుడు - సుబ్బరామన్న

- November 26, 2024 , by Maagulf
నిస్వార్థ ప్రజా సేవకుడు - సుబ్బరామన్న

మరణించిన తరువాత కూడా జీవించడమంటే.. ఒక మనిషి విలువ జీవించిన సమయంలోనే కాదు. మరణించిన తర్వాత కూడా మనిషిగా సజీవంగా సమాజాన్ని ప్రభావిత చేస్తాడు. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తాడు. అలా ఆదర్శవంతంగా జీవించి ప్రజల హృదయాలలో నిలిచిపోయారు మాగుంట సుబ్బరామరెడ్డి. తన పారిశ్రామిక సమర్థతో కూడిన దయార్థ హృదయంతో ఎన్నో కుటుంబాల నట్టింట దీపాన్ని వెలిగించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా రాజకీయాలు చేసిన సుబ్బరామన్నగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. నేడు మహోన్నత రాజకీయవేత్త మాగుంట సుబ్బరామరెడ్డి గారి జయంతి.

సుబ్బరామన్నగా ప్రసిద్ధి గాంచిన మాగుంట సుబ్బరామరెడ్డి 1947 నవంబర్ 26న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు తాలూకా పేడూరు గ్రామంలో మాగుంట రాఘవరెడ్డి, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. నెల్లూరులో పీయూసీ వరకు పూర్తి చేసిన మాగుంట, కర్ణాటకలోని తుమకూరు సిద్ధగంగా కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ తండ్రి హఠాన్మరణంతో చదువుకు స్వస్తి పలికి కుటుంబ నిర్వహణతో పాటుగా తండ్రి నిర్వహిస్తున్న వ్యాపార బాధ్యతలను భుజానికెత్తుకున్నారు.

లిక్కర్ బిజినెస్ రంగంలో వారి కుటుంబం తోలి నుంచి ఉండటంతో, ఆ రంగంలోనే అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద లిక్కర్ డిస్ట్రిబ్యూటర్ గా సుబ్బరామరెడ్డి అవతరించారు. ప్రముఖ లిక్కర్ తయారీ సంస్థ మెక్డొవెల్ కు డైరెక్టర్ అయిన తోలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. తమ ఇలవేల్పైన వెంకటేశ్వర స్వామి వారి పేరు మీద బాలాజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ను ఏర్పాటు చేశారు. పశ్చిమ భారతంలో సైతం తన వ్యాపారాన్ని విస్తరించే ప్రక్రియలో భాగంగా మహారాష్ట్ర, గోవాలలో సైతం లిక్కర్ డిస్టిలరీలు ఏర్పాటు చేశారు. వ్యాపారం పెరిగే కొద్దీ ఇతర రంగాల్లోకి సైతం అడుగుపెట్టారు. చక్కర, స్టార్ హోటల్స్, షిప్పింగ్, స్టీల్, ఆక్వా, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, సినిమా నిర్మాణం& డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో బాలాజీ గ్రూప్ ను విస్తరించారు.

ఆయన సోదరులైన సుధాకర్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డిల సహకారంతో దక్షిణ భారతావని నుంచి యావద్భారతానికి తన వ్యాపార రంగాన్ని విస్తరించుకుంటూ పోయారు. వ్యాపార రంగంలో ప్రవేశించిన రెండు దశాబ్దాలకే 1000కోట్ల రూపాయల బిజినెస్ టర్నోవర్ ను సాధించారు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి రాకపోయుంటే, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తలైన టాటాలు, బిర్లాలు, అంబానీల సరసన నిలిచేరేవారని ఆయన సన్నిహితులు, స్నేహితులు ఇప్పటికి చెబుతుంటారు. ఈరోజు బాలాజీ గ్రూప్ సంస్థలన్నిటిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది పనిచేస్తున్నారు.          

సుబ్బరామరెడ్డి గారి రాజకీయ ప్రస్థానం యాదృచ్చికంగా జరిగింది. తన వ్యాపారాలతో బిజీగా ఉన్న రోజుల్లో అన్ని పార్టీల నాయకులతో సన్నిహితంగా మెలిగేవారు. ఎన్నికల సమయాల్లో వారందరికీ ఆర్థిక సహాయాలు చేశారు. అయితే, ఆయన మాజీ ప్రధాని ఇందిరమ్మను ఎంతో అభిమానించేవారు. దేశ ప్రజలకు  కోసం ఆమె చేసిన సేవలను పలుమార్లు బహిరంగంగానే కొనియాడేవారు. ఇందిరమ్మతో పాటుగా తన సన్నిహితుడైన మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి  కారణంగానే ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ రంగప్రవేశం చేశారు.

వ్యాపార రంగంలో అపర కుబేరుడైన సుబ్బరామరెడ్డిగా కాకుండా నిస్వార్థంగా ప్రజా సేవ చేయాలనే దృక్పథం కలిగిన సేవకుడిగా ప్రజలతో మమేకం అయ్యారు. తన తరం పారిశ్రామికవేత్తల్లా రాజకీయాన్ని అదనపు సంపాదన మార్గంలా ఆయన ఏనాడు భావించలేదు. తారతమ్యాలు లేకుండా అందరితో కలిసి నడిచారు, జనంలో తిరిగే కొద్దీ ఆయనకు విపరీతమైన జనాదరణ లభించింది. 1991లోక్ సభ ఎన్నికల్లో ఆయన ఎటువంటి రాజకీయ లాబీలు చేయకుండానే ఒంగోలు లోక్ సభ టిక్కెట్ దక్కింది. 1991 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు.

సుబ్బరామరెడ్డి గారి రాజకీయ జీవితంలో అతిపెద్ద మలుపు 1992లో తిరుపతి ఏఐసిసి ప్లినరీ సమావేశాలు అని చెప్పొచ్చు. సీఎం నేదురుమల్లి ఇచ్చిన సమావేశాల నిర్వహణ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి జాతీయ కాంగ్రెస్ శ్రేణుల ప్రశంసలు అందుకున్నారు. నెల రోజుల పటు తిండి నిద్రలు మానేసి, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా అన్ని తానై వ్యవహరించారు. సమావేశాలను విజయవంతం చేయడంతో ఆయనకు ఢిల్లీలో పలుకుబడి పెరిగింది. ఆయనతో పరిచయాలు పెంచుకోవడం కోసం ఢిల్లీ జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు తహతహలాడేవారు.    

 దేశ ఆర్థిక పరిస్థితి, సంస్కరణలపై పార్లమెంట్ లో తాను చేసిన ప్రసంగం దేశంలోని ఆర్థిక శాస్త్రవేత్తలందరినీ ఆకట్టుకుంది. ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రశంసలందుకున్నారు. ఆయన మేధస్సు, రాజకీయ పరిజ్ఞానం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలలో పార్లమెంట్ మెంబర్ల సలహా సంప్రదింపుల కమిటీలో మెంబెర్ గా నియమింపబడ్డారు. స్వల్ప కాలంలోనే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ లో ఉత్తమ నేతగా గుర్తింపు పొందారు.                 

ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారు.పార్లమెంటు సభ్యులంటే ఏ ఢిల్లీలోనో, హైదరాబాద్ లోనో ఉంటూ ప్రజలకు దూరంగా ఉంటారని అప్పటిదాకా ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేశారు. ఎంపీగా ఎన్నికైన వెంటనే ఒంగోలులోనే  నివాసమేర్పరచుకుని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా నేదురుమల్లి ఉండటంతో నియోజకవర్గ అభివృద్ధికి దండిగా నిధులు తీసుకొచ్చారు. ఒంగోలు పట్టణంలో సిమెంటు రోడ్లతో పాటు ఒంగోలు, మద్రాసు జాతీయ రహదారి, ఒంగోలు, కావలి, కందుకూరు, కనిగిరి, పామూరు వగైరా పట్టణాలలో సిమెంటు రోడ్లు తన ప్రత్యేక కృషితో వేయించగలిగారు.

తన పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమైన ఉదయగిరి, కనిగిరి, కొండపి, దర్శి ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రజల కోసం వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణాలు ఆయన హయాంలోనే జరిగాయి. ఎంపీ లాడ్స్ నిధులతో పాటుగా తన సొంత నిధులను వెచ్చించి విద్యాసంస్థలను ఏర్పాటు చేయించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సింగరాయకొండలో పెరల్ డిస్టిలరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి  వందలాది మంది నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించి మహిళా పక్షపాతిగా నిలిచారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న దళిత కాలనీల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు, వివిధ సంఘాల వారి భవన నిర్మాణాలకు విరాళాలు అందజేసారు. అంతేకాకుండా, సింగరాయకొండలో పినాకినీ ఎక్స్ ప్రెస్ నిలుపుదల చేయించి వేలాదిమంది ప్రయాణికుల కష్టాలు తీర్చారు.    

సుబ్బరామరెడ్డి గారికి సాహిత్యం, కళారంగం అంటే ఎంతో మక్కువ. మద్రాసులోని కళాసాగర్ సంస్థకు ఉపాధ్యక్షుడిగా ఉంటూ అనేక కవితా గోష్ఠులు, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు సినిమా రంగంలో సైతం తనదైన ముద్ర వేశారు. నటరత్న ఎన్టీఆర్ అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. దాని వల్లే నెల్లూరులో రాఘవ సినీ కాంప్లెక్స్ పేరుతో  నిర్మించిన కృష్ణ, కావేరి, కల్యాణి అనే అద్భుతమైన మూడు సినిమా థియేటర్ల కాంప్లెక్స్ సముదాయాన్ని ఎన్టీఆర్ చేతుల మీదగా ప్రారంభింపజేశారు. తన ఫైనాన్స్ సంస్థ ద్వారా పలు కళాత్మక సినిమాలకు ఫైనాన్స్ కూడా చేశారు.  

సుబ్బరామరెడ్డి అంటే ముందుగా గుర్తొచ్చేది సామాజిక సేవా కార్యక్రమాలు.చేతికి ఎముక లేకుండా దానం చేయడం అంటే ఏమిటో ఆయన్ని చుస్తే మనకు ఇట్టే  తెలిసిపోతుంది. వ్యాపారవేత్తగా ఎదుగుతున్న సమయంలోనే ఆయన విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. అలాగే, ధార్మిక కార్యక్రమాల కోసం విరాళాలు ఇస్తూ వచ్చారు. అలాగే 1995లో పుట్టపర్తి సాయిబాబా జన్మదినోత్సవం సందర్భంగా అనంతపురం కరువు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీరు సరఫరా కోసం సాయిబాబా ట్రస్ట్ కి కోటి విరాళం అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయానికి ట్రస్టీగా తన సొంత నిధులతో ఆలయ అభివృద్ధికి తోడ్పాటును అందించారు. పోలియో వ్యాధి నిర్మూలన, ఉచిత కంటి ఆపరేషన్ల కోసం లక్షల్లో విరాళాలు అందించారు.  

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాథమిక విద్యతోనే చదువులకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే లక్ష్యంగా పెట్టుకొని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ఎంఎస్ఆర్ పేరుతో జూనియర్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి విద్యాదాతగా నిలిచారు. మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బందుల పడుతున్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజల కోసం మంచినీటి సరఫరా చేయించారు. ఇందుకోసం ఏటా లక్షల రూపాయల తన సొంత నిధులను వెచ్చించారు. ఆయన దగ్గర చేయి చాపిన సామాన్య ప్రజలను, రాజకీయ, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులను ఒట్టి చేతులతో తిరిగి పంపిన దాఖలాలు లేవు. అవధులు లేని దాతృత్వంతో అభినవ దానకర్ణుడిగా కీర్తించబడ్డారు.    

సుబ్బరామరెడ్డి స్వతహాగా మృదుస్వభావి. ఆయనతో సంభాషిస్తున్నప్పుడు మరికొంత సేపు మాట్లాడితే బాగుండుననిపిస్తుంది. అద్భుత జ్ఞాపకశక్తి కలవారు. అందువల్ల ప్రతిమనిషి ఆయనను తమ సొంతం చేసుకున్నారు. అదే అభిమానంతో తన ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతివ్యక్తీ తనతోపాటు తన ఇంటిలో భోజనం చేయాల్సిందే. ఆ పద్దతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం ప్రజలపై “మాగుంట” కుటుంబానికి ఉన్న అభిమానానికి నిదర్శనం. ఆయన తన వ్యక్తిత్వం, స్నేహశీలత మరియు విస్తృతమైన సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో నిష్కలమైన ప్రేమాభిమానాలను పొందగలిగారు.  

ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి గారి సోదరుడి కుమార్తె పార్వతమ్మను 1967 ఫిబ్రవరి 19న వివాహం చేసుకున్నారు. వీరికి విజయ్ కుమార్ రెడ్డి, మాలిని ఇద్దరు సంతానం. తన భర్త అడుగుజాడల్లో పార్వతమ్మ గారు సైతం సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 1996లో ఒంగోలు ఎంపీగా, 2004లో కావలి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల సుబ్బరామరెడ్డి గారు కుమారుడు విజయ్ కుమార్ రెడ్డి, పార్వతమ్మ గార్లు అనారోగ్యంతో కన్నుమూశారు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, జాతీయ రాజకీయాల్లో ఎదుగుతున్న సమయంలోనే 1995, డిసెంబర్ 1వ తేదీన ఒంగోలులోని తన స్వగృహంలోనే నక్సలైట్ల కాల్పుల్లో మరణించారు. సుబ్బరామరెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన రాజకీయ వారసుడిగా తమ్ముడు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు సైతం ఒంగోలు నుంచి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. శ్రీనివాసులరెడ్డి గారు సైతం మాగుంట సుబ్బరామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న    సేవాకార్యక్రమాలతో పాటుగా మరిన్ని నూతన కార్యక్రమాలకు విస్తరించారు. ‘మాగుంట’ ఇంటిపేరునే మానవత్వానికి చిరునామాగా, సమాజ సేవే వారసత్వంగా మలిచారు.పెదనాన్న, తండ్రి చూపిన బాటలోనే శ్రీనివాసులరెడ్డి తనయుడైన మాగుంట రాఘవరెడ్డి యువ పారిశ్రామిక వేత్తగా వ్యాపార రంగంలో రాణిస్తూనే  ప్రజాహిత కార్యక్రమాల్లో, రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

వ్యాపారం చేసినా... పరిశ్రమలు నడిపినా... రాజకీయ నాయకత్వం వహించినా... ఎదురులేని విజయ పరంపరలతో.. అశేషమైన ప్రజాదరణతో తేజోమయ జీవితాన్ని గడిపిన మాగుంట సుబ్బరామరెడ్డి గారు లాంటి దానగుణ సంపన్నుడు, పేదల పెన్నిధి, ప్రజానాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఇలా  రంగమేదైనా ఆయన ముద్ర స్పష్టంగా కనపడుతుంది. ఆయన గతించి మూడు దశాబ్దాలు కావొస్తున్నా, ఈనాటికి ప్రకాశం జిల్లా ప్రజలు ఆయన్ని విశేషంగా అభిమానిస్తూనే ఉన్నారు.  

  - డి.వి.అరవింద్      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com