మేధో రాజకీయవేత్త-ఐ.కె.గుజ్రాల్
- December 04, 2024జాతీయ రాజకీయాల్లో మేధావి వర్గానికి చెందిన వ్యక్తుల్లో ఐ.కె.గుజ్రాల్ ఒకరు. సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలకమైన పాత్ర పోషించారు. భారత రాజకీయాల పట్ల ఆయన అవగాహన, విదేశాంగ విధానంలో ఆయన కృషి ఏ మాత్రం విస్మరించరానిది. దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలం తక్కువే అయినప్పటికీ దేశాన్ని సమర్థవంతంగా నడిపారు. నేడు రాజకీయ మేధావి, మాజీ ప్రధాని ఐ.కె.గుజ్రాల్ జయంతి.
ఐ.కె.గుజ్రాల్ పూర్తి పేరు ఇందర్ కుమార్ గుజ్రాల్.1919 డిసెంబర్ 4న ఉమ్మడి పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలం జిల్లా (నేడు పాకిస్తాన్ లో ఉంది)లోని పరి దర్వేజా గ్రామంలో అవతార్ నారాయణ్, పుష్ప గుజ్రాల్ దంపతులకు జన్మించారు. గుజ్రాల్ లాహోర్ పట్టణంలోని D.A.V కాలేజీ, హైలీ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీల్లో M.A., B.Com. Ph.D. & D.Litt. (Hons. Causa) డిగ్రీలను పూర్తి చేశారు.
గుజ్రాల్ తల్లిదండ్రులిద్దరూ జాతీయవాదులు కావడంతో వారిని స్ఫూర్తిగా తీసుకోని చిన్నతనం నుంచే జాతీయవాద భావాలను పెంచుకున్నారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా మారి 18 ఏళ్ల వయసులోనే స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ పంజాబ్ ప్రధాన కార్యదర్శిగా విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు.
దేశ విభజన తర్వాత కూడ గుజ్రాల్ కుటుంబం కొంత కాలం పాటు పాకిస్తాన్‌లోనే ఉంది. గుజ్రాల్ తండ్రి అవతార్ నారాయణ్ ప్రముఖ న్యాయవాది కావడంతో ఆయన కాంగ్రెస్‌లో ఉత్సాహంగా పని చేసేవారు.1949లో ఆయన కుటుంబం పాకిస్తాన్ నుంచి భారత్‌కు తరలి వచ్చింది. వామపక్ష వాదిగా క్రియాశీలక రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గుజ్రాల్, దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ఆ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 1958లో ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కమిటీకి వైస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.
నాటి ప్రధాని నెహ్రూ విదేశాంగ విధానం పట్ల ఆకర్షితుడైన గుజ్రాల్, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతూ వచ్చారు. నెహ్రూ మరణం తర్వాత 1964లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రీసెర్చ్ విభాగంలో పనిచేస్తూ వచ్చిన ఆయన, భావి ప్రధాని ఇందిరా గాంధీకి సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. 1966లో దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆమె సలహాదారుగా వ్యవహరిస్తూ వచ్చారు. 1966 - 75 వరకు కాంగ్రెస్ పార్టీలో చంద్రశేఖర్, కృష్ణకాంత్, కె.వి.రఘునాథ రెడ్డి, మోహన్ ధారియాలతో కలిసి "యంగ్ టర్క్స్" గా ఏర్పడ్డారు.
యంగ్ టర్క్స్ సభ్యుడిగానే ఇందిరా గాంధీ మంత్రివర్గంలో జలవనరులు, పార్లమెంటరీ వ్యవహారాలు, ప్రణాళిక, గృహ నిర్మాణం మరియు ప్రసార శాఖల మంత్రిగా గుజ్రాల్ పనిచేశారు. సమాచార శాఖ మంత్రిగా విప్లవాత్మకమైన సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందిరా చేసిన రాజ్యభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ వంటి విప్లవాత్మకమైన నిర్ణయాల వెనుక గుజ్రాల్ ఉన్నారు. 1975లో విధించిన ఎమెర్జెన్సీ మూలంగా ఇందిరా గాంధీతో విభేదించడంతో మంత్రి పదవి నుంచి తొలగించి రష్యా రాయబారిగా నియమించారు.
1977లో తన పూర్వ మిత్రులైన చంద్రశేఖర్, కృష్ణకాంత్, మోహన్ ధారియాల ఆహ్వానం మేరకు జనతా పార్టీలో చేరారు. జనతా ప్రభుత్వ పెద్దలు కూడా ఆయన్ను మాస్కోలోనే రాయబారిగా కొనసాగించింది. గుజ్రాల్ రాయబారిగా ఉన్న సమయంలో అప్పటి సోవియట్ రష్యా, భారత్ దౌత్య సంబంధాలు మరింతగా మెరుగుపడ్డాయి. 1980లో ఇందిరా తిరిగి అధికారంలోకి రాగానే తన పదవికి రాజీనామా చేసి, విదేశాంగ విధానం అధ్యయనాలు చేస్తూ 1988 వరకు గడిపారు.
1989లో ఏర్పడ్డ జనతాదళ్ పార్టీలో చేరి, అదే ఏడాది వీపీ సింగ్ ప్రధాని అయిన తరువాత విదేశాంగ వ్యవహారాల మీద విశేషమైన అనుభవం ఉన్న గుజ్రాల్‌ను విదేశీ వ్యవహారాల శాఖామంత్రిగా నియమించారు. అదే సమయంలో గల్ఫ్ లో జరుగుతున్న యద్దాన్ని ఆపేందుకు ఐక్యరాజ్య సమితి తరపున ప్రతినిధిగా ప్రయత్నించారు. యుద్ధం ఆపేందుకు జరిగిన చర్చల విషయంలో సఫలం కాకపోయినా గల్ఫ్ లో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి రప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. లక్షా 70వేలమంది భారతీయులను ఎయిర్ ఇండియా విమానాల ద్వారా కువైట్ నుంచి వెనక్కు తీసుకురాగలిగారు. పౌరవిమానాల ద్వారా ఇంతమందిని తరలించడం చరిత్రలో అతిపెద్ద రక్షణ కార్యక్రమంగా నిలిచింది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులోనూ నమోదైంది.
1990 ప్రారంభంలోనే సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పడిపోవడంతో, తిరిగి విదేశాంగ వ్యవహారాల్లో నిమగ్నమయ్యారు. పివి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల తీసుకొచ్చే అంశం మీద ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. 1996లో దేవెగౌడ సారథ్యంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ సర్కారులోనూ రెండో సారి విదేశాంగ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు.
విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు 'గుజ్రాల్ సిద్ధాంతాన్ని' ప్రతిపాదించారు. భారత విదేశాంగ విధానంలో ఇదొక మైలురాయిగా భావిస్తారు. ఈ సిద్ధాంతం ప్రకారం భారతదేశం తన భద్రత విషయంలో రాజీ పడకుండా, ప్రతిదానికీ సాయం ఆశించకుండా పొరుగునున్న దేశాలకు సాయపడాలి.అయితే ఈ సిద్ధాంతం అమలుపై అసమ్మతి కూడా ఉంది. ఎందుకంటే ఈ సిద్ధాంతం వల్ల భారత్, పాకిస్తాన్ సంబంధాలలో తక్షణం పెద్ద మార్పేమీ తీసుకురాదు. పైగా పొరుగునున్న చిన్న దేశాలు మెరుగైన సంబంధాలను తమ దౌత్య విజయంగా చెప్పుకుంటున్నందున గుజ్రాల్‌కు దక్కాల్సిన ఘనత కూడా దక్కలేదు.
ఇందుకు ఉదాహరణ చెప్పుకోవాలంటే 1996లో గుజ్రాల్ విదేశాంగ మంత్రిగా బంగ్లాదేశ్‌తో ఉన్న గంగా నీటి వాటాల సమస్యను పరిష్కరించారు. ఇందుకోసం ఆయన బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వాన్ని, పశ్చిమబెంగాల్‌లోని కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని ఒప్పించారు. నిజానికి ఇది అంత తేలికైన పనికాదు. కానీ వాస్తవంలో భారత్ విదేశాంగ విధానం రీత్యా చూసినప్పుడు ఈ ఒప్పందం ద్వారా పెద్దగా లాభపడిందేమీ లేదు. తరువాత బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తరువాత క్రమంగా ఇరుదేశాల మధ్య కొంతకాలం సంబంధాలు క్షీణించాయి.
భారత్, పాకిస్తాన్ సంబంధాల విషయంలో గుజ్రాల్ వ్యక్తిగత స్థాయులో ఓ వారధిలా పనిచేశారు. ఆయన పాకిస్తాన్ నాయకులతో సన్నిహితంగా ఉండటమే కాకుండా, ఆ దేశంలోని మానవ హక్కుల కార్యకర్తలతో, మేథావులతోనూ సన్నిహితంగా ఉండేవారు. చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఆయన పాకిస్తాన్‌ను సందర్శించి, అక్కడి సామాన్య ప్రజలను కలుసుకునేవారు.మొత్తం మీద గుజ్రాల్‌ను ఓ శాంతి కాముకుడిగా చిత్రీకరించారు.
కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఏడాదిలోపే దేవెగౌడ ప్రభుత్వం పడిపోవడంతో మధ్యంతర ఎన్నికలు రాకుండా నివారించేందుకు అందరికి ఆమోద యోగ్యుడైన గుజ్రాల్ పేరుకు తెరమీదకు రావడం, కాంగ్రెస్ సైతం సుముఖత వ్యక్తం చేయడంతో అనూహ్యంగా 1997 ఏప్రిల్ 21న భారత ప్రధానిగా గుజ్రాల్ బాధ్యతలు చేపట్టారు. 1997 ఏప్రిల్ 21 నుంచి 1998 మార్చి 19 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రధానిగా ఉంటూనే తనకిష్టమైన విదేశాంగ మంత్రిత్వ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. నేపాల్ దేశాన్ని సందర్శించిన తోలి భారత ప్రధానిగా గుజ్రాల్ చరిత్రలో నిలిచిపోయారు.
గుజ్రాల్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే ఆయన సహచరుడు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పేరు దాణా కుంభకోణం కేసులో చర్చనీయాంశమైంది. గుజ్రాల్ దానిపై చర్య తీసుకోవడానికి నిరాకరించారు. లాలూ యాదవ్ కారణంగానే గుజ్రాల్ బిహార్ నుంచి రాజ్యసభ సీటు పొందారు.గుజ్రాల్ ప్రభుత్వం అప్పటి సీబీఐ డైరెక్టర్‌ను బదిలీ చేసింది. ఇది చాలా మంది ఆగ్రహానికి కారణమైంది.
ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఎమర్జెన్సీ విధించాలని గుజ్రాల్ సిఫార్సు చేశారు. అయితే, రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ దాన్ని వెనక్కి పంపారు. అలహాబాద్ హైకోర్టు కూడా ఉత్తరప్రదేశ్‌లో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తీర్పునిచ్చింది.ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన ఒక మధ్యంతర నివేదికపై కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తాయి. ఈ నివేదికలో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీ నాయకులు శ్రీలంకలోని ఎల్టీటీఈ మద్దతుదారులకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. (రాజీవ్ గాంధీ హత్యకు ఎల్టీటీఈ బాధ్యత వహించింది)
డీఎంకే మంత్రులందరినీ ప్రభుత్వం నుంచి తొలగించాలని లేదా వారి మద్దతును ఉపసంహరించుకోవాలని గుజ్రాల్‌ను కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గుజ్రాల్ ఈ డిమాండ్‌ను తిరస్కరించారు. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది. అయితే, తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు అధికారంలో ఉండాలని గుజ్రాల్‌ను రాష్ట్రపతి నారాయణన్ సూచించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎవరూ విజయం సాధించలేదు. చివరకు ఎన్నికలు ప్రకటించారు. వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదమూడు నెలల్లోనే పడిపోయి మళ్లీ ఎన్నికలు జరిగాయి. 1999 ఎన్నికల్లో గుజ్రాల్ పోటీ చేయలేదు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్నారు. అనారోగ్యం కారణంగా 2012, నవంబర్ 30న తన 93వ ఏట తుదిశ్వాస విడిచారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!