జననేత-వైఎస్ జగన్
- December 21, 2024
వైఎస్ జగన్ ....చూడడానికి సాదాసీదాగా ఉంటారు. జనంలోకి వచ్చినప్పుడు పూర్తి తెలుపు రంగు చొక్కా ధరిస్తారు. ‘అన్నా, వాట్ సర్’.. ఇవి రెండూ ఊతపదాలు. కలిసిన వాళ్లు చిన్నవాళ్లయితే పేరుతోనూ, పెద్దవాళ్లయితే ‘అన్నా’ అని పిలవటం అలవాటు. అలాంటి వ్యక్తి
సొంతంగా పార్టీని స్థాపించి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాజకీయాల్లో కని విని ఎరుగని రీతిలో తన తండ్రి రాజశేఖరరెడ్డిని మించిన మెజారిటీ విజయం నమోదు చేసి నవ్యంధ్రప్రదేశ్ రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టారు.సరిగ్గా మరో ఐదేళ్లు తిరగ్గానే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పరాజయాన్ని మూటగట్టుకొని మరో మారు చరిత్రకెక్కారు. నేడు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గారి జన్మదినం.
యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి.. అలియాస్ వైఎస్ జగన్ 1972 డిసెంబర్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, విజయమ్మ దంపతులకు జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించారు. బీకామ్ డిగ్రీని పూర్తి చేసిన జగన్ మీడియా, పవర్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారవేత్తగా కొనసాగారు.తండ్రి అడుగు జాడల్లో 2009లో జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. కడప ఎంపీగా విజయం సాధించారు. ఆ ఏడాదే వైఎస్ మృతి చెందడంతో రాజకీయంగా అనుకోని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని అప్పట్లో సంతకాల సేకరణ జరగడం.. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఆయనకు మద్దతుగా నిలవడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొన్ని నెలలపాటు జగన్ చుట్టూనే నడిచింది.
తన తండ్రి అకాల మృతిని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రకు మంచి స్పందన రావడంతో రాజకీయంగా మళ్లీ ఆయన చర్చల్లో నిలిచారు. కాంగ్రెస్ అధిష్ఠానం అనూహ్యంగా 2010 నవంబరు 25న రోశయ్యను తొలగించి కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. అదే సమయంలో జగన్ ఓదార్పు యాత్రకు అభ్యంతరం తెలిపింది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో కిరణ్ సీఎంగా నియమితులైన నాలుగు రోజులకే 2011 అక్టోబరు 29న జగన్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఓదార్పు యాత్రను కొనసాగిస్తూ.. 2011 మార్చిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ-వైకాపా) ప్రారంభించారు.
2014 ఎన్నికల్లో 67 స్థానాలను సాధించి శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నర ఆయన.. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 స్థానాలలో 151 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని స్థానాలతో ముఖ్యమంత్రి అయ్యారు.అయితే మూడు రాజధానులు అంటూ ఐదేళ్లు స్థిరమైన రాజధాని లేకపోవడం.. పెట్టుబడుల పెట్టేందుకు కంపెనీలు వెనక్కి తగ్గడం.. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత.. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి కూటమిగా ఏర్పడడంతో జగన్‌కు ఓటమి తప్పలేదు. ఇక, తాజా ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయిన విషయం విదితమే. కానీ, కూటమి సర్కార్‌కు ఎక్కువ సమయం ఇవ్వకుండా.. వెంటనే ప్రజా సమస్యలపై పోరాటాలు ప్రారంభించారు.. క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు.
ఒంటరిగా పోటీ చేయాలి.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి..... తొలి నుంచి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి విధానం ఇదే. నవ్యాంధ్రలో జరిగిన తొలి ఎన్నికల్లోనూ.. 2019,2024 ఎన్నికల్లో కూడా ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో దిగటం వెనక లక్ష్యం ఇదే! 2014,2024లో కచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఉన్న జగన్.. ఎన్నికలు సమీపించాక పరిస్థితులు మారుతున్నా వ్యూహాలు మార్చుకునేందుకు ఆసక్తి చూపలేదు. నాటి ఓటమికి కారణాలను విశ్లేషించుకుని, వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై శ్రద్ధ పెడుతూ.. పార్టీలో మార్పులు చేసుకుంటూ వచ్చారు. వ్యూహాత్మక ప్రణాళికలతో, సకల అస్త్రశస్త్రాలతో 2019 ఎన్నికల బరిలోకి దిగి భారీ మెజారిటీ విజయం నమోదు చేసి సీఎం అయ్యారు. 2024లో సైతం గెలుస్తామనుకున్నా అంచనాలు తలకిందులు అయ్యి భారీ పరాజయాన్ని చవిచూసి 11 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు.
గెలుపొటములు పక్కనబెడితే ఏపీ రాజకీయాల్లో కచ్చితంగా ఎప్పటికి వినిపించే పేరు జగన్. జగన్ ఇప్పుడు దారుణంగా ఓడిపోయాడని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. వైసీపీ నుంచి సీనియర్ నాయకులు ఒక్కొక్కరు వెళ్లిపోతున్నా.. రాజకీయంగా జగన్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తన వ్యూహ రచనలకు పదునుపెడుతున్నారు. "గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయకంరంగా ఉంటాదని అంటారు. తమ అధినేత కూడా రెండింతల ఉత్సాహంతో కచ్చితంగా పుంజుకుంటారు.." అంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







