నీ పిలుపు కోసం

- July 09, 2015 , by Maagulf
నీ పిలుపు కోసం

ప్రియ నేస్తమా ! నేనిక నిష్క్రమిస్తున్నాను ,

ఈ పచ్చని చేలల్లో చెట్టు  స్నేహితుల 

బాహువుల్లో ఉయలలూగిన మన పల్లె తల్లి  

అనుభూతుల నుండి బాల్యం బడి ఒడిలో 

మనసు స్వేచ్చా విహంగమై నింగి కెగసిన 

తీపి జ్ఞాపకాల నుండి,చల్లని సాయం సంధ్యలెన్నో 

నన్ను సేద దీర్చిన నీ మమతానురాగాల నుండి 

నా నిరీక్షణ లో మౌన ప్రతిమవయ్యే నిను  

క్షోభింప చేసి,

తరలి పోతున్నాను నేస్తం. 

నీవు లేని ఒక నిర్జీవ నిశ్శబ్ధ సమాధిలోకి 

కాలం నిర్దేశించిన ఒంటరి బ్రతుకు పోరాటం లోకి 

ఇక నేనక్కడ అత్మియతనుబందాలు లేని 

శిలలా...  

ఆశల ఆశ్వాలకు కళ్ళెం వేసిన మునిలా 

నీ ఆలోచనల జ్ఞాపకాలన్నీ 

శూలాలై నా హృదయాన్ని  

గాయపెడుతుంటే,

ఓర్చుకుంటూ నన్ను నేను ఓదార్చుకుంటూ 

మర యంత్రంలా సాగిపోతుంటాను 

అయితేనేం సఖీ 

కాలం కలిసొస్తే,

నీవు మరొక్క సారి  

వసంత గాన కోకిలై పిలవాలని  

నేనొక చెదరని చిరు నవ్వునయి  

నీ పెదవులఫై ఉదయించాలన్న 

ఆశతో ....  

 

 

(07-07-2015 బ్రతుకుదెరువు కోసం తన వాళ్ళందరిని వీడి, గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్న వారందరకు అంకితం.) 

--బోడ జయ రెడ్డి(అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com