నిష్కలంక ప్రజా నేత-సంజీవయ్య
- February 14, 2025
ఎటువంటి పైరవీలు చేయకుండా ఆయనను పదవులు వెతుక్కొంటూ వచ్చాయి. ప్రధానమంత్రుల నుంచి ముఖ్యమంత్రుల వరకు ఆయనను ఏరికోరి కేబినెట్‌లో చేర్చుకున్నారు. దేశంలోనే తొలి దళిత సీఎంగా కీర్తినీ ఆయన ఆర్జించారు. కానీ, ఆర్థికంగా ఆర్జించింది లేదు. స్వగ్రామంలో ఆయన తల్లి చివరివరకు కట్టెల పొయ్యి మీదే వంట చేసి తాను తిని, పదిమంది ఆకలి తీర్చింది.ఇంతకి ఆయన ఎవరో కాదు...విలువలకు రూపంగా, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన దామోదరం సంజీవయ్య. నేడు ఆయన 104వ జయంతి.
దామోదరం సంజీవయ్య 1921,ఫిబ్రవరి 14న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త కర్నూలు జిల్లా కేంద్రమైన కర్నూలు నగరంలో నేడు అంతర్భాగంగా ఉన్న కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో ఓ సామాన్య నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మునెయ్య, సుంకలమ్మ దంపతులకు జన్మించారు. సంజీవయ్య పుట్టిన మూడు రోజులకు తండ్రి మరణంతో ప్యాలకుర్తిలో ఉన్న మేనమామ ఇంట పెరిగారు.
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. జీవనాధారం కోసం పశువులు కాయడం, కూలి పనులకు వెళ్లడం, పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేయడం, ఖాళీ సమయాల్లో చేనేత వస్త్రాలు విక్రయించేవారని అప్పటి పెద్దల ద్వారా తెలుసుకున్నామని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన జన్మించేనాటికి ఇంట్లో అందరూ నిరక్షరాస్యులే. అయితే, సంజీవయ్యకు చదువు పట్ల అమిత ఆసక్తి. అది గుర్తించిన అన్న చిన్నయ్య, మేనమామల ప్రోత్సాహాంతో సంజీవయ్య చదువులో ఒక్కో మెట్టు ఎక్కారు.
పెద్దపాడులో ఐదవ తరగతి వరకు చదువుకొని హైస్కూల్ చదువు కోసం ప్రతి రోజు కాలినడకన కర్నూలుకు వెళ్లేవారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చేరి 1942లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై విధి నిర్వహణలో మేటిగా పేరు పొందారు. అధికారిగా పని చేస్తుండగా న్యాయమూర్తి జస్టిస్ కేఆర్ కృష్ణయ్యతో పరిచయం అయింది ఆయన ప్రోత్సాహంతో మద్రాస్‌లో న్యాయవిద్యను అభ్యసించారు. గణపతి శాస్త్రి, జాస్తి రామలక్ష్మమ్మ దగ్గర జూనియర్‌గా పనిచేశారు.
సంజీవయ్యకు విద్యార్థిగా ఉన్న రోజుల్లో రాజకీయాలపై, స్వాతంత్ర్యోద్యమముపై ఏమాత్రము ఆసక్తి చూపలేదు. కానీ లా అప్రెంటిసు చేస్తున్న సమయములో వివిధ రాజకీయనాయకుల పరిచయము, సాంగత్యము వలన రాజకీయాలలో ప్రవేశించాలనే ఆసక్తి కలిగినది. సంజీవయ్య మంచి వక్త. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ధారాళంగా, మనోరంజకంగా మాట్లాడేవారు.సంజీవయ్య చురుకుదనం, చొరవను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చి రాజకీయాల్లోకి తీసుకువచ్చింది.
1950 జనవరి 26న రాజ్యాంగము అమలులోకి రావడముతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్ పార్లమెంట్ గా అవతరించింది. అయితే ప్రొవిజనల్ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండిట్లో సభ్యత్వము ఉన్న సభ్యులు ఏదొ ఒకే సభ్యత్వముని ఎన్నుకోవలసి వచ్చింది. షెడ్యూల్డ్ కులానికి చెందిన ఎస్.నాగప్ప అలా తన శాసనసభ సభ్యత్వం అట్టిపెట్టుకొని ప్రొవిజనల్ పార్లమెంటుకు రాజీనామా చేయడముతో ఆ స్థానాన్ని పూరించడానికి ఎన్జీ రంగా, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రేసు కమిటీ తరఫున సంజీవయ్యను ఎంపిక చేశారు. ఎన్నికలు జరిగి తొలి విధానసభ ప్రమాణస్వీకారము చేయడముతో 1952 మే 13 న ప్రొవిజనల్ పార్లమెంటు రద్దయినది.
1952లో మద్రాస్ అసెంబ్లీకి కర్నూలు రిజర్వుడు నియోజకవర్గం నుండి గెలుపొంది చిన్న వయసులోనే రాజాజీ కేబినెట్‌లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రం తొలి సీఎం ప్రకాశం పంతులు కేబినెట్‌లోను మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.1955 ఆంధ్ర రాష్ట్ర మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మిగనూరు–కోడుమూరు ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రిజర్వుడు స్థానం నుండి దామోదరం సంజీవయ్య గెలుపొందారు. బెజవాడ గోపాల్‌రెడ్డి మంత్రివర్గంలో రవాణా, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1956లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గ సహచరుడుగా పనిచేశారు. నీలం అనివార్య కారణాల వల్ల పదవి దిగిపోయినప్పుడు, ఆ స్థానంలో సంజీవయ్య నియమితులయ్యారు.
1960-62 మధ్య 27 నెలల పాటూ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. సంజీవయ్య ముఖ్యమంత్రి కావడం వెనుక పశ్చిమ గోదావరికి చెందిన కాంగ్రెస్ నాయకులు అల్లూరి సత్యనారాయణ రాజు పాత్ర ఉంది.సంజీవ రెడ్డికి, సత్యనారాయణ రాజుకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. దీంతో అనూహ్యంగా సంజీవయ్య పేరు తెరపైకి తెచ్చారు సత్యనారాయణ రాజు. అధిష్ఠానం మధ్యేమార్గంగా, రెండు పెద్ద వర్గాల మధ్య రాజీకోసం ఎన్నుకున్న ముఖ్యమంత్రులు అంత చురుగ్గా కనిపించరు. కానీ సంజీవయ్య దానికి మినహాయింపు.
1960 జనవరి 11న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే నాటికి ఆయన వయస్సు కేవలం 38 ఏళ్లు. 1962 మార్చి 29 వరకు ఆయన పాలన కొనసాగింది. ముఖ్యమంత్రిగా సంజీవయ్య అనేక విప్లవాత్మక విధాన నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమంతో రాష్ట్ర ప్రజలకు బాగా చేరువయ్యారు.
భూసంస్కరణలు అమలుచేసి, ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను భూమిలేని వ్యవసాయ కూలీలకు పంచిపెట్టారు. ఉత్తరాంధ్ర ప్రజల కోసం శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టుకు, కర్నూలు జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పేరు నేడు ‘సంజీవయ్య సాగర్’గా ప్రసిద్ధికెక్కింది. గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు మొదటి శంకుస్థాపన చేసింది సంజీవయ్యే.
ప్రాజెక్టుల స్థాపనే కాకుండా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. సబ్బండ వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను అమలుపరిచారు. రిజర్వేషన్ల శాతాన్ని ఎస్సీ, ఎస్టీలకు 14 నుంచి 17 శాతానికి, బలహీన వర్గాలకు 24 నుంచి 38 శాతానికి పెంచారు. వృద్ధాప్య పింఛన్లు, కార్మికులకు బోనస్ ఇచ్చే పద్ధతికి శ్రీకారం చుట్టారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలని ఉత్తర్వులు జారీ చేశారు. ‘లా’ కమిషన్‌ను, లిడ్ క్యాప్, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్, భూగర్భ గనుల సంస్థలను నెలకొల్పారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధికి చేయూతనిచ్చే ప్రత్యేక ఆర్థిక సహకార సంస్థలను ఏర్పాటు చేశారు. దళిత విద్యార్థులకు ఉపకార వేతనాలను, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వాలు పోటాపటీగా అమలు చేస్తోన్న వృద్ధాప్య పింఛన్లు ప్రారంభించింది ఈయనే. ‘‘ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో సొంతూరు వచ్చి, తిరిగి వెళుతూ తల్లికి వంద రూపాయలు ఇచ్చారు. ప్రతి నెలా, ప్రతి ఒక్కరికీ ఇలా ఎవరు డబ్బు ఇస్తారు అన్న తల్లి ప్రశ్నకు సమాధానంగా వృద్ధాప్య పింఛన్ ప్రారంభించారు. అప్పట్లో నెలకు 25 రూపాయల పింఛన్ ఇచ్చేవారు’’.
ఆంధ్ర, తెలంగాణల మధ్య కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా కేవీ రంగారెడ్డిని ఉప ముఖ్యమంత్రి చేశారు.అగ్ర కులాల వారిగా చెప్పుకొనే కేబినెట్ సహచరులు ఆయనకు తగినంత గౌరవం ఇచ్చేవారు కాదని అనేక సాక్ష్యాలు చెబుతున్నాయి.ఆయన వస్తే నిల్చునే వారు కాదు. కనీసం మర్యాదకు కూడా నమస్కారం పెట్టేవారు కాదు. కానీ ఇవన్నీ సంజీవయ్య పెద్దగా పట్టించుకునేవారు కాదు. ముఖ్యంగా నీలం సంజీవ రెడ్డి వర్గానికి చెందిన, నెల్లూరుకు చెందిన ప్రముఖ నాయకులు ఆనం చెంచు సుబ్బారెడ్డి, సంజీవయ్యను బాగా అవమానకరంగా చూశారు. అదను కోసం వేచి చూసిన సంజీవయ్య, సుబ్బారెడ్డిని కేబినెట్ నుంచి తొలగించారు.
ఏసీ సుబ్బారెడ్డి ఒకసారి సంజీవయ్యకు రాజీనామా పత్రం పంపించారు. రాజకీయ పరిణామాలు ఆలోచించకుండా, తక్షణం ఆ లేఖను గవర్నర్‌కు పంపి, ఆమోదించేలా చేసి సుబ్బారెడ్డిని పక్కన పెట్టారు. అయితే ఏసీ సుబ్బారెడ్డి సంజీవయ్యను, కేబినెట్ సమావేశంలోనే కులం పేరుతో దూషించినట్టు కొందరు చరిత్ర పరిశోధకులు చెబుతారు.
1962లో ఆంధ్ర, తెలంగాణలకు కలపి మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంతకుముందు ఆంధ్రకు వేరుగా, తెలంగాణకు వేరుగా జరుగగా, ఉమ్మడిగా జరిగిన మొదటి ఎన్నికలు అవే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సంజీవయ్య గెలిపించారు. ఆ ఎన్నికల్లో సీఎం సంజీవయ్య నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి 175 సీట్లు వచ్చాయి. కానీ ఆ తరువాత ఆయన్ను సీఎం చేయకుండా పక్కన పెట్టారు. తిరిగి నీలం సంజీవ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు.
సంజీవయ్యను తిరిగి ముఖ్యమంత్రి చేయకూడదంటూ తెలుగు రాష్ట్రాల్లోని అగ్ర కుల నాయకులంతా, మరీ ముఖ్యంగా నీలం సంజీవ రెడ్డి దిల్లీలో లాబీ చేశారు. ఒక దశలో నెహ్రూను.. మేం కావాలో అతను కావాలో తేల్చుకోమన్నారు. దాంతో అప్పటి ప్రధాని నెహ్రూ వారి ఒత్తిడికి తలొగ్గారు.
సంజీవయ్యకు మొదట్లో కర్నూలు రెడ్లతో సఖ్యత ఉండేది. కానీ సంజీవయ్య ఎదిగే కొద్దీ శత్రుత్వంగా మారింది. ఆ క్రమంలో తనకంటూ కొందరు రెడ్లను చేరదీసి, ఒక వర్గం తయారు చేసుకున్నారు. అదే సమయంలో కర్నూలులో బీసీ నాయకత్వాన్నీ ప్రోత్సహించారు. కేఈ మాదన్నను ( ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తండ్రి) బీసీ నాయకుడిగా ప్రోత్సహించారు. ఆయన చివరి వరకూ సంజీవయ్యతో సఖ్యతతో ఉన్నారు. చివరకు 1967 ఎన్నికల్లో అగ్ర కులాల వారు పార్టీలకతీతంగా పనిచేసి, సంజీవయ్యను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు.
సంజీవయ్య నచ్చారో లేక ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేనందుకు నష్టపరిహారంగానో కానీ సంజీవయ్యను దిల్లీ పిలిపించారు నెహ్రూ. అఖిల భారత కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిని చేశారు.1962-1964 వరకూ నెహ్రూ హయాంలో, 1971-72 మధ్య ఇందిర హయాంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా రెండుసార్లు పనిచేశారు సంజీవయ్య. అలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన తొలి దళితుడిగా కూడా రికార్డు సృష్టించారు. నిజానికి సంజీవయ్య తెలుగునాట ఎదుర్కొన్నంత కులవివక్ష దిల్లీలో కూడా ఎప్పుడూ ఎదుర్కోలేదు.
మొట్టమొదటిసారి కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పుడు ప్రధాని నెహ్రూ లేచి సంజీవయ్యను పిలిచి, ‘‘సర్ మీ కుర్చీని అలంకరించండి అంటూ స్వాగతం చెప్పారు. నెహ్రూ అంతటి వారు లేచి తనను సర్ అని పిలిచి అధ్యక్ష స్థానం అలంకరించమనేసరికి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు సంజీవయ్య.
1964, 1970లలో రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారాయన. నెహ్రూ, నందా, శాస్త్రి, ఇందిర కాబినెట్లలో కేంద్ర మంత్రిగా పరిశ్రమలు, కార్మిక శాఖలకు పనిచేశారు. కార్మిక శాఖ మంత్రిగా జెనీవాలో, ఐక్యారాజ్య సమితి అనుబంధ అంతర్జాతీయ కార్మిక సదస్సులో ప్రసంగించారు.కంపెనీలు, ఫాక్టరీలు తమ సిబ్బందికి తప్పనిసరిగా ఒక నెల జీతం బోనస్‌గా ఇవ్వాలనే చట్టం తేవడం ద్వారా సంజీవయ్య పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
అదే సమయంలో దిల్లీ కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలపి ఉంచే ఒక రాజకీయ వేదికగా 'సేవా స్థంబ్' అనే ప్రజాస్వామ్య ఐక్య సంస్థ ప్రారంభించారు. తరువాత కాలంలో బీఎస్పీ ప్రారంభించిన కాన్షీరాం కూడా 'ఈ విషయంలో నాకు సంజీయవ్య స్ఫూర్తి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు
సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆయనంటే గిట్టనివారు అప్పటి ప్రధాని నెహ్రుకి అనేక ఫిర్యాదులు చేశారు. నిజానిజాలను తేల్చేందుకు నెహ్రూ అప్పటి హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యాశ్వంత్ పర్మార్‌ను పంపిచారు. పర్మార్‌తో పాటు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా పనిచేసిన) చక్రపాణి కూడా సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడును సందర్శించారు. వారు ప్రయాణిస్తున్న కారు ఓ పూరింటి ముందు ఆగింది. దాన్ని చూసి ఇక్కడెందుకు ఆపారు, మనం వెళ్లాల్సింది సంజీవయ్య ఇంటికి కదా! అని పర్మార్ అడిగారట. అప్పుడు చక్రపాణి ఇదే సంజీవయ్య ఇల్లు అని చెప్పడంతో పర్మార్ ఆశ్చర్యపోయారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే వృద్ధురాలయిన సంజీవయ్య తల్లి సుంకులమ్మ చిరిగిన ముతక గుడ్డలతో కట్టె పొయ్యి దగ్గర వంట చేస్తూ కనిపించారు. ఈ దృశ్యం చూసి పర్మార్ చలించిపోయి వెంటనే తిరుగు ప్రయాణమయ్యారట. ఇది సంజీవయ్య నిజాయితీకి నిలువుటద్దం.
సంజీవయ్యలో చాలా మందికి తెలియని కోణం సాహిత్యం, సంగీతం. అయన ఒక గొప్ప రచయిత. తన జన్మవృత్తాంతంపై స్వయంగా సీస పద్యం రాసుకున్నారాయన. 'కనకాంతులీను కర్నూలు సీమలో…' అంటూ సాగుతుందా పద్యం. తాను పూజలో పాడుకునేందుకు వినాయకుడు, సరస్వతీ దేవిలపై హంసధ్వని రాగంలో స్తోత్రం రాసుకుని, ట్యూన్ చేసుకున్నారు. భీష్మ జననం అనే హరికథ రాశారు.
సంజీవయ్య వ్రాసిన లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు. ఆయన రాసిన మరికొన్ని అరుదైన తెలుగు సాహిత్య గ్రంథాలు అందుబాటులో లేవు. సీఎంగా మొదటిసారి 'అఖిల భారత తెలుగు రచయితల సంగీతి' నిర్వహించారు.జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరధ్వాజ సంజీవయ్య మిత్రులు. ఒక ప్రాచీన కావ్యంపై చర్చ మా ఇద్దరినీ మిత్రులుగా చేసిందని ఒక సందర్భంలో చెప్పారు భరధ్వాజ. 'సంజీవయ్యకు మొక్కెద' అంటూ ఆయనపై కవిత్వం రాశారు దాశరథి.
సంజీవయ్య కులస్తులు స్వతహాగా వాద్యకారులు. పాటలు పాడతారు. అలా అనువంశికంగా వచ్చిన విద్య ఆయనకు రాజకీయంగా బాగా ఉపయోగపడింది. బహిరంగ సభల్లో భారత, భాగవత పద్యాలు పాడుతూ, ఛలోక్తులు విసురుతూ, పౌరాణిక, ఇతిహాస వృత్తాంతాలు చెబుతూ జనాన్ని తన వైపుకు తిప్పుకునేవారు. అందుకే ఆయన బహిరంగ సభలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. జనాన్ని కట్టిపడేసేవారు.
సంజీవయ్య వ్యక్తిగత జీవితానికి వస్తే 1954 మే 7న సికింద్రాబాద్‌కు చెందిన బుచ్చయ్య కూతురు కృష్ణవేణమ్మను కులాంతర వివాహం చేసుకొని అభ్యుదయ భావాలకు ఆనాడే బీజం వేశారు. మాజీ ఎంపీ కెఎస్ఆర్ మూర్తి సంజీవయ్యకు తోడల్లుడు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆయనకు పిల్లలు లేరు. సావిత్రి అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.
1967లో ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడ నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకోలేకపోయారు. దాంతో పాటుగా షుగర్ వ్యాధితో బాధపడేవారు. 51 ఏళ్ల వయసులో 1972 మే 5 న ఢిల్లీలోని జంతర్ మంతర్ అధికార నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆయన స్మారకార్ధం పాటిగడ్డ సమీపమున ఒక ఉద్యానవనమును పెంచి ఆయన పేరు మీదుగా దామోదరం సంజీవయ్య పార్కు అని పేరు పెట్టారు. 2006లో పార్లమెంటు సెంట్రల్ హాలులో సంజీవయ్య ఫోటో ఆవిష్కరించారు. 2008 లో విశాఖపట్నంలో స్థాపితమైన ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీకి ఆయన జ్ఞాపకార్థం 2012 లో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అని పేరు మార్చారు. సంపద లేకుండా ‘సంతతి’ లేకుండా జీవించిన అతి కొద్ది మంది రాజకీయవేత్తలలో సంజీవయ్య ఒకరు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







