కన్నడ రాజకీయ భీష్ముడు-బి.ఎస్.యడ్యూరప్ప

- February 27, 2025 , by Maagulf
కన్నడ రాజకీయ భీష్ముడు-బి.ఎస్.యడ్యూరప్ప

బి.ఎస్.యడ్యూరప్ప.... కర్ణాటక రాజకీయాలను శాసించిన నేత. ఆ రాష్ట్రంలో భాజపాకు జవసత్వాలు కల్పించడమే కాకుండా మొట్టమొదటి సారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. సామ్యవాదంతో పాటు లౌకికవాద రాజకీయాలు రాజ్యమేలిన కన్నడ నాట కాషాయ పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చిన ఘనత యడ్యూరప్పకే దక్కుతుంది. నేడు కన్నడ రాజకీయ దిగ్గజం బి.ఎస్.యడ్యూరప్ప జన్మదినం సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం... 

కన్నడ రాజకీయ భీష్ముడు బి.ఎస్.యడ్యూరప్ప పూర్తి పేరు బూకనాకెరె సిద్ధలింగప్ప యడ్యూరప్ప. 1943, ఫిబ్రవరి 27న కర్ణాటకలోని మాండ్య జిల్లా బూకనాకెరె గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన సిద్ధిలింగప్ప, పుట్టథాయమ్మ దంపతులకు జన్మించారు. నాలుగేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయిన యడ్యూరప్పను తండ్రి తోబుట్టువులు అల్లారుముద్దుగా పెంచారు. మాండ్య ప్రభుత్వ కళాశాలలో పియూసీ పూర్తి చేశారు. 

యడ్యూరప్ప రాజకీయాల్లోకి రాకముందు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖలో క్లర్క్ గా శికరిపుర పట్టణంలో పనిచేసేవారు. అనంతరం రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేసేవారు. మిల్లు యజమాని కుమార్తె మైత్రా దేవితో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో కులాంతర వివాహం చేసుకున్నారు. అనంతరం రైస్ మిల్ వ్యాపారంతో పాటుగా పలు వ్యాపారాలు చేశారు. 

యడ్యూరప్ప కాలేజి రోజుల్లోనే అరెస్సెస్ శాఖలకు వెళ్లేవారు. అనంతర కాలంలో సైతం సంఘంలో ఉంటూ శికరిపుర పట్టణంలో సంఘ్ విస్తరణ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సంఘ్ పెద్దల ఆదేశాల మేరకు జనసంఘ్ పార్టీలో చేరి ఆ పార్టీని నగరంలో బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. 1972లో శికరిపుర పురపాలక సంఘం ఎన్నికల్లో కౌన్సిలరుగా ఎన్నికయ్యారు. అనంతరం కాలంలో 1975 వరకు పట్టణ జనసంఘ్ పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో ఆయన కొనసాగారు. 

1975లో ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు. 1977-80 వరకు జనతాపార్టీలో సంఘ్ పెద్దల మాట మేరకు చేరి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత భాజపాలో చేరి ఆ పార్టీ తరపున షిమోగా జిల్లా అధ్యక్షుడిగా 1985 వరకు పనిచేశారు. కన్నడ రాజకీయాలు సామ్యవాద లౌకిక భావజాల ప్రేరణ దిశగా నడుస్తున్న సమయంలో భాజపాను నడిపించే సమర్థత లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్పకే ఉందని భావించిన అధిష్టానం 1988లో రాష్ట్ర పార్టీ బాధ్యతలను ఆయనకే అప్పగించింది. 1988-92 వరకు ఆ పార్టీ అధ్యక్షుడిగా భాజపాను క్షేత్రస్థాయిలో పటిష్టం చేశారు. ముఖ్యంగా వీరేంద్ర పాటిల్ పట్ల రాజీవ్ గాంధీ ప్రవర్తన పట్ల ఆగ్రహంతో రగులుతున్న ప్రజల నాడిని పట్టి భాజపా వైపు మొగ్గు చూపేలా చేశారు. 

1994 నాటికే కన్నడ రాజకీయాల్లో జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలను మించిన బలమైన క్యాడర్ ఏర్పడటంలో యడ్యూరప్ప పాత్ర కీలకం. భాజపా సీనియర్ నేత అనంత్ కుమార్ సహకారంతో పార్టీని పట్టణ ప్రాంతాల్లో బలోపేతం చేసేందుకే కృషి చేశారు. 1998 నాటికి రాష్ట్రంలో జనతాదళ్ పార్టీ చీలికల వల్ల ఆ పార్టీ స్థానంలో భాజపా ప్రధాన ప్రతిపక్షంగా, కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కోగల సత్తా ఉన్న పార్టీగా తీర్చిదిద్దంలో యడ్యూరప్ప పాత్ర మరువలేనిది. ఆయన ఇచ్చిన జవసత్వాలు మూలంగానే పార్టీ ఈనాటికి క్షేత్రస్థాయిలో మరింత బలంగా వేళ్లూనుకుపోయింది.

1983లో శికరిపుర నుంచి మొదటిసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన యడ్యూరప్ప 1985, 1989, 1994 లలో వరసగా ఎన్నికవుతూ వచ్చారు. 1999 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికి 2000లలో రాష్ట్ర శాసనమండలికి ఎన్నికయ్యారు. 2004, 2008, 2013, 2018 లలో అదే నియోజకవర్గం నుంచి మొత్తం 8 సార్లు కర్ణాటక అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2014లో షిమోగా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 

1994-96, 2004-06, 2018-19 మధ్యల్లో కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2006లో ధరమ్ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చిన కుమారస్వామితో కలిసి రాష్ట్రంలో భాజపా-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో యడ్యూరప్ప, ఆ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్, జాతీయ నేత అరుణ్ జైట్లీ కీలకంగా వ్యవహరించారు. 2006-08 వరకు కుమారస్వామి మంత్రివర్గంలో రాష్ట్ర ఐదో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఫైనాన్స్, ఎక్సైజ్ మరియు భారీ పరిశ్రమల శాఖలను నిర్వహించారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల తర్వాత కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉండగా తన పదవికి రాజీనామా చేసేందుకు కుమారస్వామి సేసేమిరా అనడంతో ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరణ చేసి 2008 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కారణమయ్యారు. 

2008 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని కొందరు స్వతంత్రుల మద్దతుతో కర్ణాటకలో తొలిసారి భాజపా సొంతంగా యడ్యూరప్ప నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. సీఎంగా 2011 వరకు ఉన్న యడ్యూరప్ప గాలి బ్రదర్స్ అక్రమ మైనింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా తన పదవిని కోల్పోయారు. అయితే, తన పదవి నుంచి రాజకీయ కుట్రలు చేసి దించేయడంలో కీలకంగా వ్యవహరించిన వారిని పార్టీ నెత్తిన పెట్టుకుందనే నెపంతో భాజపాకు 2012లో రాజీనామా చేసి కర్ణాటక జనతా పక్ష పార్టీని స్థాపించి 2013లో రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయగా కేవలం 6 స్థానాలకే పరిమితం అయ్యి ఘోర పరాజయం మూటగట్టుకుంది. 

2014 లోక్ సభ ఎన్నికల నాటికి తిరిగి భాజపా గూటికి చేరిన యడ్యూరప్ప ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విజయపథంలో నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించారు. 2018 నాటికి భాజపాను తిరిగి పటిష్టం చేసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లగా 104 స్థానాలలో అతి పెద్ద పార్టీగా భాజపా అవతరించగా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకొని కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికి ఆపరేషన్ కమలం వల్ల 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత తిరిగి యడ్యూరప్ప నాయకత్వంలో భాజపా అధికారంలోకి వచ్చింది. 

2019-21 వరకు సీఎంగా ఉన్న యడ్యూరప్ప భాజపా నియమంలో ఒకటైన 75 ఏళ్ల వయోభార పరిమితి  కారణంగా తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత భాజపా జాతీయ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా చేరారు. 2023 నాటికి క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగిన యడ్యూరప్ప పార్టీ మార్గదర్శనం చేసే పనిలో ఉన్నారు. యడ్యూరప్ప తనయులు రాఘవేంద్ర , విజయేంద్ర ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. రాఘవేంద్ర భాజపా కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నారు. 

కన్నడ  రాజకీయాల్లో ఎందరో సామాన్య మధ్యతరగతి యువకులను దిగ్గజ రాజకీయ నేతలుగా తీర్చిదిద్దిన ఘనత యడ్యూరప్ప సొంతం. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శోభా కార్లందజే, మాజీ సిఎంలైన జగదీష్ షట్టర్, డి.వి.సదానంద గౌడ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. ఇంతమంది నేతలను తయారు చేసిన ఆయన తన రాజకీయ ప్రత్యర్ధులతో సైతం ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. కన్నడ రాజకీయ యవనిక పై యడ్యూరప్ప చెరగని ముద్ర వేశారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు ఎప్పటికి నిలిచే ఉంటుంది.

 --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com