రాజస్థాన్ ఉక్కు మహిళ-వసుంధర రాజే సింధియా

- March 09, 2025 , by Maagulf
రాజస్థాన్ ఉక్కు మహిళ-వసుంధర రాజే సింధియా

వసుంధర రాజే సింధియా...రాజస్థాన్ రాజకీయాల్లో ప్రభావశీలవంతురాలైన రాజకీయ నాయకురాలు. మరాఠా గ్వాలియర్ రాజవంశానికి చెందిన రాజే ధోల్‌పూర్ రాజమాత కూడా! దివంగత భైరాన్ సింగ్ షెకావత్ శిష్యురాలిగా రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె అనతి కాలంలోనే  రాజస్థాన్ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. రాజస్థాన్ ఉక్కు మహిళ వసుంధర రాజే సింధియా రాజకీయ ప్రస్థానం మీద ప్రత్యేక కథనం....

 వసుంధర రాజే సింధియా 1953 మార్చి 8న బొంబాయి (ప్రస్తుత ముంబై) నగరంలో గ్వాలియర్ చివరి మహారాజు సర్ జార్జ్ జీవాజీరావ్ మాధవ్‌రావ్ సింధియా, విజయరాజే సింధియా దంపతులకు మూడో కుమార్తెగా జన్మించారు. వసుంధర చిన్నతనంలోనే ఆమె తండ్రి ఆకస్మిక మరణంతో సోదరుడు మాధవ్ రావ్ సింధియా గ్వాలియర్ రాజుగా పట్టాభిషక్తులయ్యారు. వసుంధర తమిళనాడు రాష్ట్రంలోని  కొడైకెనాల్‌లో ఉన్న ప్రెజెంటేషన్ కాన్వెంట్‌లో ప్రాథమిక విద్యను, ముంబై విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సోఫియా కళాశాల నుండి పొలిటికల్ ఎకనామిక్స్ విభగంలో డిగ్రీ పూర్తిచేశారు.

వసుంధర కుటుంబం భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేది. ఆమె తండ్రి జీవాజీరావ్ మధ్యభారత రాష్ట్రానికి రాజప్రముఖ్‌గా పనిచేశారు. ఇక తల్లి గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా దేశ రాజకీయాల్లో అతిపెద్ద మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకురాల్లో ముఖ్యరాలిగా ఆమె ప్రసిద్ధురాలు. సోదరుడు మాధవ్ రావ్ సింధియా ఓటమెరుగని నేతగా 9 సార్లు ఏకధాటిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. రాజీవ్, నరసింహారావు ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన బ్రతికుంటే 2004లో మన్మోహన్ సింగ్ బదులు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవారు.

తన మెట్టినిల్లు రాజకీయాల్లో ఉండటంతో పాటుగా ఆమె వైవాహిక జీవితంలో ఏర్పడ్డ ఆటుపోట్లు వసుంధరను రాజకీయాల వైపు తప్పని పరిస్థితుల్లో నడిచేలా చేశాయి. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఢిల్లీలో ఒరిస్సా రాజకీయ దిగ్గజం నవీన్ పట్నాయక్, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ వంటి పలువురు రాజకీయ, పారిశ్రామిక మరియు సామాజిక సేవా రంగాలకు చెందిన ఎందరితోనో సన్నిహిత పరిచయాలు ఉండేవి.

తల్లి విజయరాజే సింధియా ప్రోద్బలంతో పాటుగా తమ కుటుంబానికి సన్నిహితులైన రాజస్థాన్ రాజకీయ దిగ్గజం భైరాన్ సింగ్ షెకావత్ గారి ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వసుంధర మొదట రాజస్థాన్ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత షెకావత్ ప్రోత్సాహంతో 1985 అసెంబ్లీ ఎన్నికల్లో ధోల్‌పూర్ నుంచి భాజపా తరపున ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. మొదట్లో రాజకీయాల పట్ల సీరియస్‌గా ఆమె క్రమక్రమంగా రాజస్థాన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. రాజస్థాన్ భాజపా యువమోర్చాకు తోలి మహిళా  ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజస్థాన్ భాజపా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.

1989 సార్వత్రిక ఎన్నికలు సింధియా కుటుంబ రాజకీయ ప్రస్థానంలో చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఆ ఎన్నికల్లో వసుంధర, ఆమె తల్లి విజయరాజే, సోదరుడు మాధవ్ రావ్ సింధియాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యారు.  1991,1996,1998లలో సైతం ఈ ముగ్గురు నేతలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. దేశ రాజకీయాల్లో ఒకే కుటుంబం నుంచి ఒకేసారి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన రాజకీయ ఘనత సింధియాల సొంతం. 1999లో విజయరాజే రాజకీయ విరమణ తర్వాత వసుంధర, మాధవ్ రావులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. వసుంధర 1989 నుంచి 2004 మధ్యలో 5 సార్లు ఝాలావర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.

తల్లి విజయరాజే, భాజపా అగ్రనేతలైన వాజపేయ్, అద్వానీల ఆశీస్సులతో భాజపాలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన వసుంధర 1997 నుంచి 1998 వరకు భాజపా పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు. 1998లో వాజపేయ్ ఎన్డీయే మొదటి ప్రభుత్వంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా 1999 వరకు పనిచేశారు. 1999లో మరోసారి కేంద్రంలో ఏర్పడ్డ వాజపేయ్ రెండో ప్రభుత్వంలో 1999 నుంచి 2003 వరకు కేంద్ర చిన్న, సూక్ష్మ, ఆగ్రో & గ్రామీణ పరిశ్రమలు, డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్, పెన్షన్స్ గ్రీవియన్స్, డిపార్టుమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ స్పెస్ శాఖల స్వతంత్ర మంత్రిగా పనిచేశారు.

2002లో రాజస్థాన్ భాజపా పెద్ద దిక్కుగా ఉన్న భైరాన్ సింగ్ షెకావత్ దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత 2003లో జరగబోయే అసెంబ్లీ  ఎన్నికల్లో షెకావత్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా వసుంధరకు ఉందని నమ్మిన భాజపా అధిష్ఠానం ఆమెను 2002 చివర్లోనే రాజస్థాన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఆమెతో పాటుగా ఆ రాష్ట్ర ఎన్నికల బాద్యుడిగా నియమితులైన భాజపా అగ్రనేత దివంగత ప్రమోద్ మహాజన్ సహకారంతో వసుంధర 2003 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చారు. పార్టీ పెద్దలు, తన గురువు షెకావత్ గార్ల ఆశీస్సులతో 2003లో రాజస్థాన్ రాష్ట్ర తోలి మహిళా ముఖ్యంత్రిగా వసుంధర బాధ్యతలు చేపట్టారు. 2008- 13 వరకు ప్రతిపక్షనేతగా, 2013
 నుంచి 2018 వరకు రెండో పర్యాయం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర బాధ్యతలు చేపట్టారు.

రాజస్థాన్ ముఖ్యంత్రిగా ఆమె సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగారు. రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను  తీసుకురావడంలో వసుంధర విజయవంతం అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కఠినమైన చర్యలు చేపట్టడమే కాకుండా పలువురు అసాంఘిక శక్తుల నిర్మూలనకు పోలీసులకు పూర్తి అధికారాలు కట్టబెట్టారు. మహిళల సాధికారత కోసం ఆమె తీసుకున్న పలు విప్లవాత్మకమైన నిర్ణయాలను నిర్బంధంగా అమలు చేసి ప్రశంసలు అందుకున్నారు.

2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, పార్టీ పెద్దలు ఆమెను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. రాజస్థాన్ రాష్ట్రంలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆమెను పార్టీ పెద్దలు పక్కన పెట్టారని రాజకీయ పండితుల అభిప్రాయం. అయితే, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయంలో రాజే అన్నితానై వ్యవహరించారు. అయితే, ఆమెను సీఎంను చేసేందుకు పార్టీ పెద్దలు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 

వసుంధర పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటం వల్లే 2024 లోక్ సభ ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలో భాజపా పలు స్థానాల్లో ఓటమి పాలైంది. ఏది ఏమైనా రాజస్థాన్ లాంటి పురుషాధిక్యత కలిగిన రాష్ట్రంలో నిబద్దత కలిగిన పరిపాలనా దక్షురాలిగా తన కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.      

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com