విమానంలో అల్లాహు అక్బర్ అని అరిచి జైలు పాలయ్యాడు

- July 04, 2016 , by Maagulf
విమానంలో అల్లాహు అక్బర్ అని అరిచి జైలు పాలయ్యాడు

అవును.. గాల్లో విమానం వెళ్తున్నప్పుడు ప్రయాణికుల్లో ఎవరైనా 'అల్లాహు అక్బర్' అని అరిస్తే.. ఇంకేమైనా ఉందా. ప్రయాణికులు బెంబేలెత్తిపోతారు. ఉగ్రవాది ఏమోనని వణికిపోతారు. ఎందుకంటారా.. ఇటీవల దాడులకు ముందు తీవ్రవాదులు 'అల్లాహు అక్బర్' అని అరుస్తున్నారు కాబట్టి. ఇదే అనుభవం దుబాయ్ నుంచి బర్మింగ్‌హామ్ వెళ్తున్న ఎమిరేట్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానంలో ప్రయాణికులకు ఎదురైంది. ఫిబ్రవరి 1న ఈ ఘటన జరిగింది. 347 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో 38 ఏళ్ల షెహ్రాజ్ సర్వార్ కూడా ఉన్నాడు. విమానం గాల్లో ఉండగా సర్వార్ ఒక్కసారిగా 'అల్లాహు అక్బర్' అని గట్టిగా అరిచాడు. అంతే విమానంలో ఉగ్రవాది ఉన్నాడని భావించిన ప్రయాణికులు, విమాన సిబ్బంది ఇక తమ పని అయిపోయిందని అనుకున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయంతో వణికిపోయారు. కొందరైతే ఏడ్చేశారు కూడా. టేకాఫ్ సమయంలోనూ అతను వింతగా ప్రవర్తించాడు. సిబ్బంది సీటు బెల్టు పెట్టుకోమంటే రెండు సార్లు తిరస్కరించాడు. ఆహార పదార్థాలను కేబిన్‌లో విసిరికొట్టాడు. ఆ తర్వాత విమానం బర్మింగ్‌హాం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్నప్పుడు మరోమారు 'భూం' అంటూ పెద్దగా అరిచాడు. అతడి అనుమానాస్పద ప్రవర్తనపై విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు. కేసును విన్న బర్మింగ్‌హాం క్రౌన్ కోర్టు రెండు నెలల తర్వాత తుదితీర్పు వెల్లడించింది. సర్వార్‌ను దోషిగా తేలుస్తూ పది వారాల జైలు శిక్ష విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com