స్వరబ్రహ్మ- కె.వి.మహదేవన్

- March 14, 2025 , by Maagulf
స్వరబ్రహ్మ- కె.వి.మహదేవన్

‘మామ’గా మన తెలుగువారి మదిలో చెరిగిపోని ముద్ర వేశారు స్వరబ్రహ్మ మహదేవన్. ఆయన బాణీలు ఈ నాటికీ జనాన్ని చిందులు వేయిస్తూనే ఉన్నాయి. మహదేవన్ మన తెలుగువారు కాదు. అయితేనేం? ఆయన బాణీలతో తెలుగుజనం ఆనందసాగరంలో మునకలేశారు. ఈ నాటికీ ఆ మధురం మనల్ని వెంటాడుతూనే ఉంది. నేడు స్వరబ్రహ్మ కె.వి.మహదేవన్ జయంతి సందర్భంగా ఆయన సినీప్రస్థానంపై ప్రత్యేక కథనం.. 

కె.వి.మహదేవన్ పూర్తి పేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్. 1918, మార్చి 14న ఒకప్పటి ట్రావెన్‌కోర్ రాజ్యంలోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ పట్టణానికి దగ్గర్లోని కృష్ణన్ కోయిల్ గ్రామంలో వెంకటాచలం భాగవతార్ అయ్యర్, లక్ష్మీ అమ్మాళ్ దంపతులకు జన్మించారు. మహదేవన్ తాతగారు ట్రావెన్‌కోర్ ఆస్థానంలో విద్వాంసునిగా ఉండేవారు. మహాదేవన్ తండ్రి సైతం గోటు వాద్యంలో నిష్ణాతుడు. నాలుగేళ్ల ప్రాయంలోనే చిన్నారి మహాదేవన్ నాదస్వర వాద్యానికి ఆకర్షితుడై తండ్రి ప్రోత్సాహంతో నాదస్వర విద్వాన్ రాజరత్నం పిళ్లై దగ్గర శిష్యరికం చేశారు. ఆ తర్వాత బూదంపాడి అరుణాచల కవిరాయర్ వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారు. నాటకాలమీద ఆసక్తితో కొన్ని నాటకాల్లో నటించారు.

తెలుగువారికి మహదేవన్ ‘మామ’గా మారడానికి కారణం – ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ‘మంచి మనసులు’ చిత్రంలోని పాటనే. దాదాపు ఏడుపదుల కాలం కిందట రూపొందిన ఆ పాట ఈ నాటికీ తెలుగువారి నోట నాట్యం చేస్తూనే ఉంది. 1962లో తెరకెక్కిన ‘మంచిమనసులు’ చిత్రంలో కొసరాజు రాసిన ‘మామ మామామామా…” పాట ఆ రోజుల్లో జనాన్ని ఉర్రూతలూగించింది. ఆ పాట గుర్తుకు వస్తే చాలు, మహదేవన్ తలపుల్లోకి రావలసిందే. ఆయన సంగీతమూ గుర్తొచ్చి పులకించి పోవలసిందే. తమిళనాట పుట్టినా, తమిళ చిత్రాలలో స్వరవిన్యాసాలు చేసి అలరించినా, ఎందుకనో మహదేవన్ కు తెలుగు చిత్రాలతోనే ఎక్కువబంధం ఉందని చెప్పక తప్పదు. కేవలం సాంఘిక చిత్రాలలోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ మహదేవన్ బాణీలు భలేగా సాగాయి.

సందర్భోచితంగా స్వరకల్పన చేయడంలో దిట్ట మహదేవన్. అందుకనే పలువురు దర్శకులు, నిర్మాతలు మహదేవన్ బాణీలతోనే సాగాలని తలపించేవారు. దర్శకులేనా నిర్మాతల్లోనూ ఎందరో మహదేవన్ స్వరకల్పనతోనే విజయాలను చవిచూశారు. కొందరు నిర్మాతలయితే మహదేవన్ లేకుంటే సినిమాలే నిర్మించమనీ భీష్మించుకున్నారు. ఆయన మరణం తరువాత చిత్ర నిర్మాణానికి దూరమైన వారూ లేకపోలేదు.

మహానటులు ఎన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరికీ మరపురాని విజయాలుగా నిలచిన చిత్రాలకు సైతం కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చి మురిపించారు. తరువాతి తరాల వారికీ మహదేవన్ బాణీలు విజయసోపానాలు చూపించాయి. పలువురు వర్ధమాన కథానాయకులు మామ స్వరకల్పన చేసిన చిత్రాలతోనే తమ ఉనికిని చాటుకున్నారు. తరువాత స్టార్స్ గా వెలుగులు విరజిమ్మారు. 

ఇంతకూ మహదేవన్ ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయనకు తెలుగు అంతగా రాకపోయినా, తెలుగు పదాలను వింటే చాలు వాటికి ఇట్టే ట్యూన్స్ కట్టేస్తారు అని ప్రతీతి. ఆయనకు తగ్గ శిష్యునిగా పుహళేంది చివరిదాకా పయనం సాగించారు. తెలుగు గీతరచయితలు రాసిన పాటలను పుహళేంది వినేవారు. వాటిని ఆయన పాడి వినిపించగానే, వాటికి తగ్గ స్వరాలను మహదేవన్ సమకూర్చేవారు. తెలుగునాట పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలన్నిటా మామ స్వరాలు భలేగా సందడి చేశాయి.ఇలా చెప్పుకుంటూ పోతే … ఎన్నెన్నో మామ మధురస్మృతులు మన మదిలో నాట్యం చేస్తాయి. మామ లేకున్నా, ఆయన పంచిన మధురామృతం మన సొంతం. మహదేవన్ ను తలచుకున్న ప్రతీసారి మరింత ఆనందంతో మైమరచిపోవలసిందే! 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com