మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..

- March 14, 2025 , by Maagulf
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..

మెగాస్టార్ చిరంజీవికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. హౌస్ ఆఫ్ కామ‌న్స్-యూకే పార్ల‌మెంట్‌లో చిరంజీవికి గౌరవ స‌త్కారం జ‌ర‌గ‌నుంది. నాలుగున్న‌ర ద‌శాబ్దాలుగా సినిమాల ద్వారా క‌ళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ.. చిరంజీవిని యుకే కి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా స‌న్మానించ‌నున్నారు. మార్చి 19న యూకే పార్ల‌మెంట్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఇక ఇదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ.. సినిమాలు, ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రధానం చేనుంది.

బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఓ ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు.. వారు తమ చుట్టూ ఉన్న స‌మాజంపై చూపించిన ప్ర‌భావం మ‌రింత విస్తృతం కావాల‌నే ఉద్దేశంతో వారిని స‌త్క‌రిస్తోంది.

కాగా.. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అంద‌జేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండ‌టం విశేషం.

ఇదిలా ఉంటే.. 2024లో భార‌త ప్ర‌భుత్వం నుంచి దేశ రెండో అత్యున్న‌త‌ పౌర పుర‌స్కారం పద్మ విభూష‌ణ్‌ ను చిరంజీవి అందుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం విశ్వంభ‌ర చిత్రంలో న‌టిస్తున్నారు. సోషియో ఫాంట‌సీ జాన‌ర్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. వ‌శిష్ఠ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. చిరంజీవి విశ్వంభర మూవీ తర్వాత అనిల్ రావిపూడితో కామెడీ సినిమా, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మాస్ సినిమా చేయబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com