భాషా పరిశోధన ఫలాలను క్షేత్ర స్థాయికి తీసుకు వెళ్ళాలి: వెంకయ్య నాయుడు
- March 16, 2025
హైదరాబాద్: ఏ విషయంలోనైనా కావచ్చు...పరిశోధన ఫలాలు క్షేత్ర స్థాయికి చేరనంత వరకూ వాటి వల్ల ప్రయోజనం ఉండదని, భాష విషయంలో ఈ చొరవ మరింత పెరగాల్సిన అవసరం ఉందని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అమ్మ భాషపై అభిమానం, ప్రేమతో పాటు అన్ని భాషల పట్ల గౌరవం ఉండాలని దిశానిర్దేశం చేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధిపతి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు రచించిన ‘సాహిత్యంలో పాత్రల సృజన పద్ధతి’ పుస్తకాన్ని వెంకయ్య నాయుడు, ఆదివారం హైదరాబాద్ లోని తమ స్వగృహంలో ఆవిష్కరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని,వారిని స్మరించుకున్న ఆయన, తెలుగు భాషను కాపాడుకోవడమే పొట్టి శ్రీరాములుకి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
‘‘ప్రతి ఒక్కరూ తమ మాతృభాషలోనే మాట్లాడుకోవాలన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, నిత్యం మన అమ్మభాషలోనే మాట్లాడుతుంటూనే భాషకు మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. తెలుగు భాషకు ఎంతో మంది మహనీయులు సేవ చేశారని, వారి కృషిని వెలుగులోకి తీసుకొచ్చేలా విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేపట్టాలని, సామాన్యులకు అర్థమయ్యే భాషలో పరిశోధన గ్రంథాలుండాలని సూచించారు. ‘‘భాష దూరమైతే... శ్వాస దూరమైనట్లే అని నా నిశ్చితాభిప్రాయం. ఈ విషయంలో విశ్వవిద్యాలయాల స్థాయిలో సమగ్రమైన పరిశోధనలు, అభిప్రాయ సేకరణలు జరగాలి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు విశ్వవిద్యాలయాలు సమగ్రమైన భాషా విధానంతో ముందుకు రావాలి.ఈ విషయంలో ప్రభుత్వాలు వర్సిటీలను సంప్రదించి సహాయ సహకారాలు అందించాలి.సమాజంలో వస్తున్న మార్పులను గమనంలోకి తీసుకొని, ప్రజల అభిప్రాయాలు సేకరించి భాషా విధానాన్ని రూపొందించాలి.గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకుని సమగ్రమైన భాషా విధానం మీద విశ్వవిద్యాలయాలు దృష్టి కేంద్రీకరించాలి. ప్రభుత్వాలు భాషాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకారం అందించేందుకు, సానుకూలమైన మార్పులకు నాంది పలికేందుకు ముందస్తుగా పరిశోధనలతో సిద్ధం కావలసిన అవసరం ఉంది.’’ అని చెప్పారు.’’
పరిశోధన అంటే అందుబాటులో లేని విషయాన్ని వెలికితీయడం మాత్రమే కాదు, దాన్ని భవిష్యత్ తరాలకు సమగ్రంగా అందించడం కూడా అన్న వెంకయ్యనాయుడు, ఏ విషయంలోనూ కల్తీ మంచిది కాదని, అలాగే భాష విషయంలోనూ కల్తీ జరగరాదని సూచించారు. స్వచ్ఛమైన తేట తెనుగు పదాలతో సాహిత్యం రావాలన్నారు. తెలుగు భాష ఆచార్యులు, పండితులు, అధ్యాపకులు, తమ తమ విద్యార్థులను ప్రోత్సహించాలని, సాహిత్య గోష్టులు నిర్వహిస్తూ విద్యార్థులు అందులో పాల్గొనేలా ప్రోత్సహించాలని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలని సూచించారు. తెలుగు భాషా పండితులను సమాజం గుర్తించి గౌరవించాలన్నారు. ఒకప్పుడు తెలుగు పద్యాలు చదువుకోని వారు సైతం పాడేవారని, ఇప్పుడు చదువుకున్న వారు కూడా అర్ధం చేసుకోలేకపోతున్నారని, ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఏం చేయాలన్న విషయం మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, పూర్వఅధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరక్టర్ ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, పాత్రికేయులు రెంటాల జయదేవ్, తెలుగు లెక్చరర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్