హ్యాండ్సమ్ యాక్టర్-వినోద్ కుమార్

- April 01, 2025 , by Maagulf
హ్యాండ్సమ్ యాక్టర్-వినోద్ కుమార్

ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకు వచ్చి పట్టం కట్టడంలో ముందుంటారు తెలుగువారు. పరభాషా నటులకు సైతం పట్టం కట్టి ఆదరించారు. కన్నడనాట జన్మించి తెలుగునాట రాణించిన వారెందరో ఉన్నారు. అలాంటి వారిలో వినోద్ కుమార్ కూడా చోటు సంపాదించారు. తెలుగునాట హీరోగా తనదైన బాణీ పలికించిన వినోద్ కుమార్ ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా నటిస్తున్నారు. నేడు నటుడు వినోద్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం...

వినోద్ కుమార్ పూర్తి పేరు వినోద్ కుమార్ అల్వా. 1963, ఏప్రిల్ 1న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో సంపన్న మరియు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించారు. చదువుకొనే రోజుల్లో తమ కన్నడ సీమలోని రాజ్ కుమార్, విష్ణువర్ధన్ సినిమాలతో పాటు బెంగళూరులో ఎన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలూ చూసేవారు. సినిమాలపై అనుకోకుండా అతనికి ఆసక్తి పెరిగింది. ఒడ్డూ పొడుగూ ఉండడం వల్ల చిత్రసీమలో అవకాశాలు లభించాయి. కొన్ని కన్నడ చిత్రాల్లో నటించినా, తెలుగులో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘మౌనపోరాటం’లో నటునిగా మంచి గుర్తింపు లభించింది. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు వినోద్. ‘న్యాయం కావాలి’లో చిరంజీవి పాత్రను పోలినదే ‘మౌనపోరాటం’లో వినోద్ కుమార్ ధరించిన పాత్ర. అందువల్ల చిరంజీవిని తాను ఆదర్శంగా తీసుకున్నానని వినోద్ చెప్పుకొనేవారు.

“నవయుగం, కర్తవ్యం, మామగారు, భారత్ బంద్, గ్యాంగ్ వార్, సీతారత్నంగారి అబ్బాయి, రథసారథి, పోలీస్ బ్రదర్స్, పోలీస్ లాకప్, బొబ్బిలి బుల్లోడు, వీరుడు, వామ్మో వాత్తో ఓ పెళ్ళామా, శుభముహూర్తం” చిత్రాలు హీరోగా వినోద్ కుమార్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. కన్నడ, తమిళ, మళయాళ భాషల్లోనూ వినోద్ కుమార్ నటించారు. ఆ తరువాత నుంచీ వినోద్ కుమార్ కేరెక్టర్ రోల్స్ లో కనిపించసాగారు. “యుద్ధం శరణం, యాత్ర” చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన వినోద్ కుమార్ ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నారు.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com