హైదరాబాద్ వాసులకు రెయిన్ అలెర్ట్..

- April 04, 2025 , by Maagulf
హైదరాబాద్ వాసులకు రెయిన్ అలెర్ట్..

హైదరాబాద్: హైదరాబాద్ లో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3గంటల నుంచి అర్థరాత్రి వరకు ఎడతెరిపిలేని వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవటం వల్ల వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కూడళ్లలో, రైల్వే అండర్ బ్రిడ్జీల (RUB) వద్ద భారీగా వరద నీరు నిలవడంతో ఉప్పల్, మలక్ పేట్, చాదర్ ఘాట్ ప్రాంతాల్లో వరద నీటిలో బస్సులు నిలిపోయాయి. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సాయంత్రం వేళల్లో ఇంటికి చేరేందుకు అధికశాతం మంది మెట్రో స్టేషన్లకు చేరుకున్నారు. సాధారణంగానే ఐటీ కారిడార్ లో రాయదుర్గం నుంచి నాగోల్, మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే మార్గంలో సాయంత్రం అయితే మెట్రో స్టేషన్ లలో కాలుపెట్టేంత చోటు ఉండదు. వర్షం కారణంగా గురువారం సాయంత్రం అధికశాతం మంది మెట్రోను ఆశ్రయించడంతో రద్దీ పెరిగింది. ప్లాట్ ఫామ్ పై నిలబడేందుకుకూడా చోటు లేనంత రద్దీ నెలకొనడంతో ప్రయాణికులు రావొద్దంటూ కొద్దిసేపు స్టేషన్ కాన్ కోర్స్ లోనే భద్రతా సిబ్బంది నిలిపివేశారు.

నగరంలో శుక్రవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. అకాల వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అలర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధికారులను ఆదేశించారు. అత్యవసరమైతే జీహెచ్ఎంసీకి కాల్ సెంటర్ 04021111111 కు కాల్ చేయాలని ప్రజలను కోరారు. మరోవైపు వికారాబాద్ కలెక్టరేట్ లో 08416242136 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com