సాహితీ రాజకీయవేత్త-మండలి బుద్ధ ప్రసాద్
- May 27, 2025
మండలి బుద్ధ ప్రసాద్.... తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు భాషా పరిరక్షణ కోసం కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్న అరుదైన రాజకీయవేత్త. గాంధేయవాదైనా తండ్రి నుంచి రాజకీయ వారసత్వంతో పాటుగా సాహితీ వారసత్వాన్ని అందుకున్న నాయకులు వీరు. అవనిగడ్డ రాజకీయాల్లో దాదాపు నాగున్నర దశాబ్దాలుగా ఒక్క అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు ఆమోదయోగ్యుడైన నిస్వార్థ ప్రజాసేవకుడిగా కొనసాగుతున్నారు. నేడు సాహితీ రాజకీయవేత్త మండలి బుద్ధ ప్రసాద్ గారి మీద ప్రత్యేక కథనం....
మండలి బుద్ధ ప్రసాద్ 1956, మే 26వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నాగాయలంక తాలూకా భావదేవరపల్లి గ్రామంలో మండలి వెంకట కృష్ణారావు, ప్రభావతి దేవి దంపతులకు జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం నాగాయలంక, అవనిగడ్డల్లోనే సాగింది. హైస్కూల్ నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్ నగరంలోనే చదువుకున్నారు. ఆ తర్వాత సామాజిక సేవా రంగంలోకి ప్రవేశించారు.
బుద్ధ ప్రసాద్ కుటుంబం తోలి నుంచి రాజకీయ కుటుంబం వీరి తాత వెంకట్రామయ్య స్వాతంత్య్రం పూర్వమే ఉపాధ్యాయుడిగా, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఇక వీరి తండ్రి దివిసీమ గాంధీగా ప్రసిద్ధులైన మండలి వెంకట కృష్ణారావు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, గాంధేయవాదిగా రాజకీయాల్లో అడుగుపెట్టి అజాతశత్రువుగా నిలిచారు. మంత్రిగా తెలుగు భాష అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తండ్రి స్పూర్తితో విద్యార్ధి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన బుద్ధ ప్రసాద్ యువజన కాంగ్రెస్ సభ్యుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు.
1977-78 మధ్యలో కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ఒకవైపు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ అవనిగడ్డ నియోజకవర్గ వ్యవహారాలను పర్యవేక్షణ చేస్తుండేవారు. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం అవనిగడ్డ నుంచి మండలి వెంకట కృష్ణారావు గెలవడంలో బుద్ధ ప్రసాద్ పాత్ర కీలకం. 1985,1989లలో వరుస ఓటములతో తండ్రి రాజకీయ విరమణ పొందిన తర్వాత వీరు అవనిగడ్డ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పీసీసీ అధ్యక్షుడు మరియు సీఎంగా మర్రి చెన్నారెడ్డి కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. 1989 నుంచి 2001 వరకు ఆ పదవిలోనే జిల్లా కాంగ్రెస్ పెద్దల సంపూర్ణ ఆమెదంతో కొనసాగారు.
కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా నియమితులై 1997 వరకు కొనసాగారు. 1992లో ఎఐసీసీ అసభ్యుడిగా నియమితులై 2013 వరకు కొనసాగారు.1994 ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 1994-2004 మధ్యలో తెదేపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు నిర్వహించారు.
2004లో అవనిగడ్డ నుంచి రెండోసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 2007-09 వరకు వైఎస్ మంత్రివర్గంలో పశు సంవర్థక, డెయిరీ డెవలప్మెంట్ మరియు ఫిషరీస్ శాఖల మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2007 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల డీ లిమిటేషన్ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి రెండోసారి ఓటమి పాలయ్యారు. అయితే, సీఎం కిరణ్ 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించారు. ఆ పదవిలో వీరు 2014 వరకు కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రం అధికార భాషా సంఘం చివరి అధ్యక్షుడిగా బుద్ధ ప్రసాద్ నిలిచారు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత తెదేపా అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు తన మిత్రుడైన అప్పటి ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావుతో కలిసి ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి సునాయాసంగా మూడోసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 2014-19 వరకు నవ్యంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి మూడోసారి ఓటమి పాలయ్యారు. 2019-24 వరకు అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాలగొనలేకపోయారు. 2024లో తెదేపా - జనసేన పొత్తులో భాగంగా అవనిగడ్డ జనసేనకు కేటాయించడంతో చంద్రబాబు సూచన మేరకు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి వెళ్లారు. 2024 ఎన్నికల్లో జనసేన తరపున అవనిగడ్డ నుంచి పోటీ చేసి నాలుగోసారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.
బుద్ధ ప్రసాద్ అభివృద్ధి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారు తప్పించి వర్గ రాజకీయాలకు కాదు. ముఖ్యంగా కృష్ణాజిల్లా పశ్చిమ ప్రాంతంలో డెల్టా ఆధునీకరణ, రోడ్లు, లంక గ్రామాల్లో త్రాగునీటి వసతి కల్పన, నిరుపేదలకు గృహాల నిర్మాణం వంటి ఎన్నో కార్యక్రమాలు నిబద్ధతగా నిర్వహించారు. ముఖ్యంగా పెనుమూడి - పులిగడ్డ వంతెన నిర్మాణం వీరి హయాంలోనే జరిగింది. మంత్రిగా ఉన్న సమయంలో మచిలీపట్టణం కేంద్రంగా కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటు, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. పశుసంవర్థక పరోశోధన కేంద్రాలు, వెటర్నరీ స్పెషల్ హాస్పిటల్స్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయించారు. దీనితో పాటుగా భావదేవరపల్లిలో ఫిషరీస్ పాలిటెక్నీక్ కళాశాలకు అనుమతి ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో పశుక్రాంతి, మత్స్య క్రాంతి పథకాలను ప్రవేశపెట్టారు.
బుద్ద ప్రసాద్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది తెలుగు భాష. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాలనే కాకుండా తెలుగు భాష పట్ల అవాజ్యమైన ప్రేమను అందుకున్నారు.తన తండ్రి హయాంలో ప్రపంచ తెలుగు మహాసభలను 1975లో హైదరాబాద్ నగరంలో విజయవంతంగా నిర్వహించారు. ఆనాటి సభ గురించి ఈనాటికి కూడా చాలా బాగా మాట్లాడుకుంటూనే ఉంటారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికి తెలుగు పరిరక్షకు నడుంకట్టి ఉమ్మడి రాష్ట్రాలో కవులు, భాషా మేధావులతో సభలు, సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా కృష్ణా మహోత్సవం, దివి మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పలు తెలుగు సాహిత్య గ్రంథాలను సైతం రచించి ప్రచురించారు.
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన చివరి 2012 ప్రపంచ తెలుగు సభల నిర్వహణలో సైతం కీలకమైన పాత్ర పోషించారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడి హోదాలో 2013 ప్రపంచ తెలుగు చరిత్ర సమేవేశాలకు అధ్యక్షత వహించారు. తెలుగు భాషా పట్ల ఆంధ్ర జాతి మమకారాన్ని పెంచుకోవాల్సింది పోయి చులకన భావాన్ని పెంచుకుంటున్నారని అనేక సందర్భాల్లో ఆవేదన సైతం వ్యక్తం చేశారు.
మండలి వారు రాజకీయాలతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలను ఇప్పటికి కొనసాగిస్తూనే ఉన్నారు. 1977లో దివిసీమ ఉప్పెన సమయంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా క్షతగాత్రులు సహాయార్థం ఎన్నో సేవా కార్యక్రమాలను మిత్రులతో కలిసి నిర్వహించారు. తన తండ్రి గారు నెలకొల్పిన అవనిగడ్డ గాంధీ క్షేత్రం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు గాంధేయవాద సిద్ధాంతాలను తెలుగు నాట విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, సాంఘిక సేవా మరియు పరిశుభ్రత కార్యక్రమాల మీద పనిచేస్తున్నారు.
నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లో కొనసుగుతున్న మండలి బుద్ధ ప్రసాద్ మీద పసలేని విమర్శలు చేయడానికి ఆయన ప్రత్యర్థులు సైతం ఏ మాత్రం ఇష్టపడరు. తమ కుటుంబాన్ని ఏడు దశాబ్దాలుగా ఆదరిస్తున్న అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి పాటుపడడానికి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలి అనే బాధ్యతను గుర్తెరిగి ఉంటారు. ప్రత్యర్థి పార్టీల నాయకులతో సైతం ఆయన చాలా సన్నిహితంగా ఉంటారు. ప్రస్తుతానికైతే రాజకీయాలు, సమాజసేవ, సాహిత్యాభిరుచిని చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!







