దిగ్గజ పారిశ్రామికవేత్త-గల్లా రామచంద్రనాయుడు
- June 10, 2025
భారతదేశ ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీ రంగంలో ఆయన్ని పితామహుడిగా పిలుస్తారు. చిత్తూరు జిల్లాలోని మారుమూల పల్లె నుంచి దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నారు. తానూ స్థాపించిన సంస్థల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వారి గుండెల్లో కొలువై పోయారు అమరరాజా గ్రూప్స్ అధినేత గల్లా రామచంద్రనాయుడు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...
"రామచంద్ర ఎన్ గల్లా" గా దేశ పారిశ్రామిక, రాజకీయ, మీడియా వర్గాల్లో సుపరిచితులైన గల్లా రామచంద్రనాయుడు 1938,జూన్ 10న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం తాలూకా పేటమిట్ట అనే కుగ్రామంలో దిగువ మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన గల్లా గంగులప్ప నాయుడు, మంగమ్మ దంపతులకు చివరి సంతానంగా జన్మించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతగా సహకరించకపోయినా, కష్టపడి చదివి వాళ్ళ గ్రామంలో మొట్టమొదటి పదో తరగతి వరకు ఉతీర్ణత సాధించిన వ్యక్తిగా నిలిచారు.
ఆ తర్వాత కూడా ప్రభుత్వం, దాతలు ఇచ్చిన ఉపకారవేతనాలతో చదువుకుంటూ తిరుపతిలో ఇంటర్మీడియట్, ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో బీఈ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకొని రూర్కీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో అప్లైడ్ ఎలక్ట్రానిక్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత 1963లో అమెరికా వెళ్లి మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి సిస్టమ్స్ సైన్స్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. 1968-71 వరకు పిట్స్‌బర్గ్ పట్టణంలో ఉన్న యూఎస్ స్టీల్ కార్పొరేషన్ సంస్థలో పనిచేశారు. 1971-85 వరకు ప్రముఖ ఇంజనీరింగ్ దిగ్గజ కంపెనీ సార్జెంట్ & లుండీలో పలు కీలకమైన హోదాల్లో పనిచేశారు.
అమెరికాలో మంచి ఉద్యోగం ఇలా అన్ని విధాలా సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నా, రామచంద్రనాయుడు గారికి ఏదో వెలితిగా ఉండేది. అదే సమయంలో మాతృభూమి మీద మమకారంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి చిత్తూరు జిల్లాలో పరిశ్రమను స్థాపించి ఆ ప్రాంత ప్రజానీకానికి ఉపాధి కల్పించేందుకు పూనుకున్నారు. అలా మంచి ఉద్యోగాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి 49 సంవత్సరాల వయసులో… తన నేలకు ఏదో చేద్దామన్న పట్టుదలతో తిరిగి చిత్తూరు జిల్లాలో ఎందుకు కొరగాని బీడు భూములను ప్రభుత్వం నుంచి పొంది 1984వ సంవత్సరంలో తిరుపతి కరకంబాడిలో కనీసం ఫోన్ సౌకర్యం కూడా లేని ప్రాంతంలో అమరరాజా పరిశ్రమని ప్రారంభించారు. తన అత్త అమరావతి, మామ రాజగోపాల్ నాయుడుల పేర్లు కలిసేలా అమర్ రాజాను ఆయన స్థాపించారు. పరిశ్రమ ప్రారంభం నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నిలబెట్టారు.
ప్రస్తుతం కరకంబాడి పరిశ్రమలో 6,800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దేశ విదేశాల్లో తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ, తన ప్రస్థానాన్ని విస్తరింప చేసుకుంటూ ఆయన పారిశ్రామిక రంగంలో బలమైన శక్తిగా ఎదిగారు. తన పరిశ్రమలలో ఉద్యోగులు స్థానికులే ఉండాలని నిర్ణయించుకోవటం వీరి ప్రత్యేకత. ఆఖరుకు సాంకేతిక నైపుణ్యతను సైతం… ఏమీ తెలియని వారికి నేర్పించి, విదేశాలకు పంపి ట్రైనింగ్ ఇప్పించి మరీ స్థానికులను వినియోగించుకున్నారు. ఎంత ఇబ్బంది ఏర్పడినా బయటి వాళ్లను తీసుకొని రాలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. తరువాతి కాలంలో తనకు జన్మనిచ్చిన పేటమిట్టలో ప్లాస్టిక్ ఉపకరణాల తయారీ కేంద్రం, బోల్టులు, నట్లు తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. 1100 మందికి ఇక్కడ ఉపాధి కల్పించారు.
తన అత్తగారి ఊరు దిగువమాఘంలో అమరరాజా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమని ప్రారంభించారు. ఇందులో 85 శాతం మహిళలే ఉంటారు. 400 మందికి పైగా పని చేస్తున్నారు. తేనెపల్లి వద్ద ‘గల్లా ఫుడ్స్’ పరిశ్రమలో ‘పల్ప్’ (పండ్ల గుజ్జు) పరిశ్రమ నడుస్తున్నది. 45 దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తున్నారు. ఇందులో 300 మంది పనిచేస్తున్నారు. కోకా- కోలా సంస్థ ‘మాజా’ డ్రింక్ ఇక్కడే తయారవుతుంది.ఇక్కడి మంగళ్ ఇండస్ట్రీలో 600 మంది పని చేస్తున్నారు.
బంగారుపాళెం నూనుగుండ్లపల్లి వద్ద అమర్ రాజ గ్రోత్ కారిడార్ లో ప్లాస్టిక్ కాంపోనెంట్ పరిశ్రమతో పాటు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీ తయారీ యూనిట్, ఇన్వర్టర్లకు బ్యాటరీ యూనిట్, యూపీఎస్ లకు బ్యాటరీ తయారీ యూనిట్, 4 చక్రాల వాహనాలకు బ్యాటరీ తయారీ యూనిట్లు రెండు, కాలుష్య నివారణకు బ్యాటరీ ప్లేట్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. మొత్తం 5800 మంది ఇక్కడ పనిచేస్తున్నారు.
కరకంబాడిలో పరిశ్రమ ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. నాటి నుంచి నేటి వరకు ఎవరు అధికారంలో ఉన్నా ఈ యాజమాన్యానికి సహకరించారు. గత వైసీపీ ప్రభుత్వమే వీరి పట్ల సానుకూలంగా వ్యవహరించక పోవడం కారణంగా పదివేల కోట్ల పెట్టుబడి, పదివేల మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు తరలిపోయింది. విద్యుత్ వాహనాలకు సెల్స్, బ్యాటరీలు తయారు చేసే ఈ పరిశ్రమ చిత్తూరు జిల్లాలో ఉండి ఉంటే ఇక్కడి వారికి ఎంతగానో ఉపయోగపడి ఉండేది. అలాగే బ్యాటరీ రీసైక్లింగ్ పరిశ్రమ తమిళనాడు రాష్ట్రంలోని రాణీపేటలో ప్రారంభించారు. 200 మంది ఇక్కడ పని చేస్తుంటారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే రామచంద్ర నాయుడు గారు తన సొంత ఊరు ‘పేటమిట్ట’ ప్రజలకు చేసిన సాయం మరువలేనిది. ఒకనాడు కరెంటుకు కూడా నోచుకోని కుగ్రామం… నేడు పట్టణంగా మారిపోయింది. సొంతంగా పంచాయతీ ఏర్పడింది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అన్ని హంగులు కల్పించడంతో పది పడకల ఆసుపత్రిగా మారింది. ఆసుపత్రి అంటే తెలియని పేటమిట్ట గ్రామానికి చుట్టుపక్కల 50 గ్రామాల ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు.
తనలాగా తన గ్రామస్తులు చదువు కోసం ఇబ్బంది పడకూడదని మాతృమూర్తి మంగమ్మ, తండ్రి గంగులప్ప నాయుడుల పేర్లు కలిసి వచ్చేలా "మంగళ్ విద్యాలయాన్ని" ప్రారంభించారు. మంగళ్ సీబీఎస్ఈ విద్యాలయంలో ప్రస్తుతం 2300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ చదువు చెబుతున్నారు. సమర్థులైన ఉపాధ్యాయులు ఉన్నారు. అమ్మాయిలకు హాస్టల్ వసతి ఉంది. ‘పేటమిట్ట’ చుట్టుపక్కల 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలకు ఈ విద్యాలయం ఎంతో ప్రయోజనకరంగా ఉంది.
పేటమిట్టలోనే ‘మల్టీ స్కిల్’ టెక్నీషియన్ సెంటర్ ఉంది. ఈ కేంద్రంలో పదవ తరగతి ఫెయిల్, పాస్ అయినవారికి ప్రతినెలా 70 నుంచి 80 మందికి అడ్మిషన్లు ఇస్తున్నారు. మూడు సంవత్సరాలపాటు ట్రైనింగ్ ఉంటుంది. స్టైఫండ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వీరికి తమ పరిశ్రమలలోనే ఉపాధి కల్పిస్తున్నారు. వద్దనుకున్న వారు బయట కూడా ఉపాధి పొందవచ్చు. 15 దేశాలు, దేశీయంగా కోయంబత్తూర్ లోని జీడి నాయుడు పిఎస్ జి కళాశాల, టీవీ సుందరం మోటార్స్ లాంటి అత్యున్నత స్కిల్ సెంటర్లను పరిశీలన చేసి ఈ కేంద్రాన్ని రూపొందించారు.
ఐఐటి చెన్నైలో సైతం లేని సౌకర్యాలు ఇక్కడ ఉండటం చూసి ఐఐటి తిరుపతి డైరెక్టర్ కె.ఎన్. సత్యనారాయణ గారు సైతం గతంలో ప్రశంసించారు. ఇలాంటి మరొక కేంద్రాన్ని దిగువమాఘంలో ప్రారంభిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు తర్వాత కాలంలో ఉద్యోగులుగా అమరరాజాలో స్థిరపడటమే కాకుండా ప్రతి ఏడాది పది బృందాలుగా ఏర్పడి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. వీరికి అవసరమైన విమాన టికెట్లు, రాను, పోను ఖర్చులు మొత్తం పరిశ్రమ నుంచే భరిస్తున్నారు. ఇప్పటికే జపాన్, చైనా, ఫిలిప్పీయన్స్, ఇండోనేషియా, సింగపూర్ తదితర దేశాల్లో వీరు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించి అవార్డులు గెలుచుకున్నారు. గత ఎన్నో ఏళ్లుగా పోటీలలో ప్రథమ స్థానం పొందుతూనే ఉన్నారు.
ఆ గ్రామంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు. ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి. 24 గంటలు మంచినీళ్ల సరఫరా వ్యవస్థ వంటివి సమకూర్చడంతో ఆ గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామం చుట్టూతా… నీటి వృధాను అరికట్టడానికి, వర్షపునీటిని సైతం వినియోగించుకోవడానికి చెక్ డ్యామ్‌లను నిర్మించారు. పైన పేర్కొన్నవి.. ఏవీ… ప్రభుత్వానికి సంబంధం లేకుండా తమ సొంత నిధులతో గ్రామానికి నాయుడు గారు ఖర్చు చేశారు.
పేటమిట్టలోని ప్రతి ఇంటిలో ఇప్పుడు ఉద్యోగులు, ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, చదువుకుంటున్న వారు అనేకమంది ఉన్నారు. ఇలాంటి సమగ్ర అభివృద్ధితో కూడిన ఇలాంటి ఆదర్శ గ్రామాలను తయారు చేయడానికి పూనుకున్న నాయుడు గారు రాజన్న ట్రస్ట్, అమరరాజా ట్రస్ట్, మంగళ్ ట్రస్ట్‌ల ద్వారా తన సొంత నిధులను వెచ్చించి ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నారు. ఇప్పటికే పేటమిట్టతో పాటుగా దిగువమాఘం, కరకంబాడి గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
రామచంద్రనాయుడు వ్యక్తిగత జీవితానికి వస్తే ప్రముఖ రైతు నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది అయిన పాటూరి రాజగోపాల్ నాయుడు గారి కుమార్తె అరుణకుమారిని వివాహం చేసుకున్నారు. అరుణకుమారి గారు సైతం రాజకీయాల్లో రాణించి పలు దఫాలు మంత్రిగా పనిచేశారు. వారి కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి ఎంపీగా రెండుసార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం అమరరాజా గ్రూప్స్ వ్యవహారాల్లో బిజీగా గడుపుతున్నారు. కుమార్తె రమాదేవి ప్రముఖ వైద్యురాలు.
బిజినెస్ సామాజిక సేవా రంగాల్లో చేసిన కృషికి గానూ రామచంద్రనాయుడు గారు ఎస్వీ యూనివర్సిటీ, హైదరాబాద్ జేఎన్టీయూల నుంచి గౌరవ డాక్టరేట్స్ అందుకున్నారు. ఉత్తర పారిశ్రామికవేత్తగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి కలిగిన పలు పురస్కారాలను అందుకున్నారు. నాలుగు దశబ్దాల్లోనే అమరరాజా సంస్థల విలువ వేల కోట్ల రూపాయలకు పెరగడంలో ఆయన కృషి, పట్టుదల మనకు కనబడుతుంది. ఏదిఏమైనా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అనేక కష్టనష్టాలను ధైర్యంగా అధిగమించి తన లక్ష్యాన్ని చేరుకున్న ఆయన జీవితం నేటి యువతరానికి ఎంతో ఆదర్శం..
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా