డ్రైవింగ్ చేసే సమయంలో నీళ్లు తాగడం, తినడం నేరమా?

- June 11, 2025 , by Maagulf
డ్రైవింగ్ చేసే సమయంలో నీళ్లు తాగడం, తినడం నేరమా?

కువైట్: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీళ్లు తాగడం లేదా తినడం, స్మోకింగ్ చేయడం నేరంగా పరిగణించే చట్టపరమైన నిబంధన లేదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ట్రాఫిక్ అవగాహన విభాగం యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బు హసన్ స్పష్టం చేశారు. అయితే, అలాంటి చర్యలు అజాగ్రత్త లేదా రోడ్డు నుండి దృష్టి మరల్చడానికి దారితీస్తే, డ్రైవర్‌ పై కేసులు నమోదు చేయవచ్చని తేల్చిచెప్పారు. నిర్దేశిత వేగ పరిమితులను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. లేదంటే ట్రాఫిక్ చలానా విధిస్తారని పేర్కొన్నారు.

కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలు 75% తగ్గాయని బు హసన్ పేర్కొన్నారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రోడ్డు మరణాలు కూడా 55% తగ్గాయన్నారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అత్యంత జాగరూకతతో ఉండాలని సూచించారు. ట్రాఫిక్ చలానా చెల్లింపు లింకుల పేరిట జరుగుతున్న సైబర్ ఫ్రాడ్ లపై స్పందించారు. ఆన్‌లైన్ చెల్లింపులు చేసేటప్పుడు లేదా అధికారికంగా కనిపించే పోర్టల్‌లను యాక్సెస్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com